సివిల్స్‌లో సత్తా చాటిన.. ఉమ్మడి వరంగల్‌ యువత

సివిల్స్‌లో సత్తా చాటిన.. ఉమ్మడి వరంగల్‌ యువతనవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి
యూపీఎస్సీ ఫలితాల్లో ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన నలుగురు యువకులు విజేతలుగా నిలిచారు. గతేడాది ఐపీఎస్‌ సాధించిన జయసింహారెడ్డి ఈసారి 103వ ర్యాంకు సాధించడంతో ఈసారి ఐఏఎస్‌ సాధించే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఎట్టకేలకు తన లక్ష్యాన్ని సాధించడంతో ఆ కుటుంబంలో హర్షం వ్యక్తం చేసింది. వరంగల్‌ పరిశోధనా స్థానంలో ప్రముఖ శాస్త్రవేత్త ఉమారెడ్డి కుమారుడే జయసింహారెడ్డి. రఘునాధపల్లి మండలకేంద్రానికి చెందిన కొయ్యాడ ప్రణరు 554వ ర్యాంకు సాధించారు. ప్రణరు ఎలాంటి కోచింగ్‌ లేకుండానే ఈ ర్యాంకు సాధించడం గమనార్హం. గతేడాది 885వ ర్యాంకు సాధించిన ప్రణరు ఐఆర్‌ఎంఎస్‌ రావడంతో ప్రస్తుతం శిక్షణలో ఉన్నారు. గీసుకొండ మండలం అనంతారం గ్రామానికి చెందిన సయింపు కిరణ్‌ 568వ ర్యాంకు సాధించారు. వరంగల్‌ శివనగర్‌కు చెందిన కోట అనిల్‌కుమార్‌కు 764 ర్యాంకు సాధించారు. కిరణ్‌కు ఐపీఎస్‌ వచ్చే అవకాశముండగా, కోట అనిల్‌కుమార్‌కు ఐఆర్‌ఎస్‌ వచ్చే అవకాశమున్నట్లు అంచనా వేస్తున్నారు.
నిరాశపడని సయింపు కిరణ్‌
568వ ర్యాంకు సాధించిన సయింపు కిరణ్‌.. తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కిరణ్‌ వరంగల్‌ మామునూరులోని జవహర్‌ నవోదయ విద్యాలయంలో పాఠశాల విద్యనభ్యసించారు. ఇంటర్‌ ప్రయివేటు కాలేజీలో చదివారు. జేఈఈ అడ్వాన్స్‌లో 1598వ ర్యాంకు సాధించి ఐఐటీ ఢిల్లీలో బీటెక్‌ పూర్తి చేశారు. 2018లో మొదటిసారి సివిల్స్‌ రాశారు. ప్రిలిమ్స్‌లో క్వాలిఫై కాలేదు. జీవితంలో మొదటిసారి ఫెయిల్యూర్‌ వచ్చినా కుంగిపోకుండా తప్పులను సరిదిద్దుకొని 2019, 2020లో ప్రిలిమ్స్‌ పూర్తి చేసి మెయిన్స్‌ రాశారు. రెండు మార్కులతో సెకండ్‌ అటెంప్ట్‌లో ఇంటర్వ్యూ పోయింది. 2021లో ఇంటర్వ్యూకు అవకాశం వచ్చింది. జాతీయస్థాయిలో నిర్వహించే సీఏపీఎఫ్‌లో ఆలిండియాలో 15వ ర్యాంకు సాధించిన సయింపు కిరణ్‌ ప్రస్తుతం శిక్షణలో ఉన్నారు.

Spread the love