మంత్రి వ్యక్తి గత దూషణలు చేయడం మానుకోవాలి

– దమ్ముంటే మంత్రి తనతో కబడ్డీ ఆడాలి
– బీఆర్‌ఎస్‌ అవినీతి అక్రమలపై విచారణ చేస్తాం
– దోషులను ప్రజాకోర్టులో నిలబెడతాం
– సూర్యాపేట సమగ్ర అభివృద్ధి కి ప్రణాళిక.. కాంగ్రెస్ అభ్యర్థి, మాజి మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి
నవతెలంగాణ- సూర్యాపేట: బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మంత్రి జగదీష్ రెడ్డి గత కొద్ది రోజుల నుండి తనపై చేస్తున్న వ్యక్తిగత విమర్శలను మానుకోవాలని కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి హెచ్చరించారు. సోమవారం స్థానిక తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల  సమావేశంలో ఆయన మాట్లాడారు. జగదీష్ రెడ్డి అసభ్యంగా మాట్లాడుతూ అర్థరహితమైన ఆరోపణలు చేయడం  తగదన్నారు. తనని ముసలి ఎద్దు అంటూ మాట్లాడడం తగదని దమ్ముంటే మంత్రి తనతో కబడ్డీ ఆడేందుకు సిద్దమా అని ఆయన సవాల్ విసిరారు. బీఆర్‌ఎస్‌ చేసిన అవినీతి, అక్రమాలపై విచారణ చేసి దోషులను ప్రజాకోర్టులో నిలబెడతామని పేర్కొన్నారు. తాను ఎమ్మెల్యే గా గెలిచిన తరువాత సూర్యాపేట అభివృద్ధి కి సమగ్రమైన ప్రణాళిక రూపొందిస్తానని అన్నారు. భానుపురి విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తానని తెలిపారు. సూర్యాపేట అభివృద్ధి కి కట్టుపడి వున్నట్లు చెప్పారు. తాను 2014 -19 లో సూర్యాపేట ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో 440 కెవి సబ్ స్టేషను, 132 కెవి, 32 కెవి సబ్ స్టేషను ల నిర్మాణం చేశానని పేర్కొన్నారు. నూతన వ్యవసాయ మార్కెట్ నిర్మాణం, అవుట్ డోర్ స్టేడియం నిర్మాణం చేసినట్లు చెప్పారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా వున్న సమయంలో ఎస్ ఆర్ ఎస్పి  రెండవ దశ కాలువల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. 1000 ట్రాన్స్ ఫార్మర్లు  గ్రామాలలో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 250 కిమి లమేర గ్రామాలలో రోడ్ల నిర్మాణం చేసినట్లు తెలిపారు. నియోజకవర్గం లో 25 వేల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేసినట్లు చెప్పారు. సూర్యాపేట పట్టణంలో ఇందిరమ్మ కాలనీ ఫేస్-1,2,3 లలో ఐదువేల ఇళ్ల నిర్మాణం చేసినట్లు తెలిపారు. ప్రతి గ్రామంలో సిసి రోడ్ల నిర్మాణం, డ్రెయినేజీ ల నిర్మాణం చేపట్టి‌నట్లు చెప్పారు. తాను ఎమ్మెల్యే గా గెలిచిన తరువాత సూర్యాపేట పట్టణంలోని మేధావులు, ప్రజా ప్రతినిధులతో కమిటీ వేసి సూర్యాపేట అభివృద్ధి కోసం ప్రణాళిక ఏర్పాటు చేస్తామని చెప్పారు. పట్టణంలో పలు రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా వుందని, అనేక రహదారుల నిర్మాణం చేస్తామని అన్నారు. సూర్యాపేట చుట్టూ రింగ్ రోడ్ నిర్మాణం చేస్తామని తెలిపారు. ప్రతి గ్రామంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్, మండలం లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. యువతకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లు ఏర్పాటు చేసి ఉద్యోగాలు ఇస్తామని, పోటి పరీక్షలు వ్రాయడానికి హైదరాబాదు వెళ్లకుండా సూర్యాపేట లోనే శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తామని అన్నారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెంచడంతో పాటు వరితో తయారయ్యే ఉత్పత్తుల పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని, పత్తి ఎక్కువగా పండుతుంది కాబట్టి టెక్స్ టైల్స్ పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పేదలకు అమలుచేసే ఆరు గ్యారంటీ పధకాలు అమలు చేస్తామన్నారు. సూర్యాపేట దోమలపేట గా మారిందని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, దోమలతో అనారోగ్యం పాలవుతున్నారని, తాను గెలిచిన తరువాత అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం చేస్తానని చెప్పారు.ఈ సమావేశంలో కర్ణాటక ఎమ్మెల్యే కోన్ రెడ్డి, పీసీసీ అబ్జర్వర్ సంధ్యారెడ్డి పాల్గొన్నారు.
Spread the love