ప్రతి కుటుంబం చూడాల్సిన సినిమా

నరేష్‌, రాహుల్‌ రామకష్ణ, నవ్య స్వామి, సురభి ప్రభావతి, గంగవ్వ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘ఇంటింటి రామాయణం’. ఈ చిత్రానికి సురేష్‌ నరెడ్ల దర్శకత్వం వహించారు. సూర్యదేవర నాగవంశీ, మారుతి టీమ్‌ సమర్పణలో ఐవీవై ప్రొడక్షన్స్‌ నిర్మించిన కుటుంబ కథా చిత్రమిది. వెంకట్‌ ఉప్పుటూరి, గోపీచంద్‌ యిన్నమూరి నిర్మాతలు. ఈ చిత్రం త్వరలోనే థియేటర్లలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్రం శుక్రవారం విలేకర్ల సమావేశంలో చిత్ర విశేషాలను షేర్‌ చేసుకున్నారు. ఈ సందర్భంగా నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ, ‘ మొదట దీన్ని డిజిటల్‌ సినిమాగానే ప్రారంభించాం. అవుట్‌ పుట్‌ చూసిన తరువాత థియేటర్‌లో ఆడుతుందన్న నమ్మకంతో విడుదల చేస్తున్నాం. నా స్నేహితులు నిర్మాతలుగా పరిచయం అవుతున్న ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు. ‘దర్శకుడు సురేష్‌ రాసుకున్న కథ ఇది ప్రతి ఇంటికి, ప్రతి ఒక్కరికి కనెక్ట్‌ అయ్యే కథ. ఇతర భాషల్లో విడుదల చేసినా ఈ సినిమాకి ఖచ్చితంగా ఆదరణ లభిస్తుంది. సినిమా చాలా బాగా వచ్చింది’ అని దర్శకుడు మారుతి చెప్పారు. ‘ప్రాంతాలకు, భేదాలకు భిన్నంగా ఉన్న సిసలైన కల్మషం లేని సినిమా ఇది. మన మనస్తత్వాలను, మన మనోభావాలను చాలా అలవోకగా, చాలా సులభంగా చూపిస్తూ మా నుంచి మంచి మంచి నటనను రాబట్టుకున్నారు దర్శకుడు’ అని రాహుల్‌ రామకష్ణ చెప్పారు. నటి నవ్యస్వామి మాట్లాడుతూ, ‘నా కల నిజమైన సమయం ఇది. టెలివిజన్‌లో చేస్తున్నప్పుడు సినిమాలు చేయాలి అనుకునేదానిని. ఇంతమంచి సినిమాలో అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. నన్ను నమ్మి నాకు ఈ అవకాశమిచ్చిన దర్శక,నిర్మాతలకు ధన్యవాదాలు. ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకం నాకుంది’ అని అన్నారు.

Spread the love