శారీరక అఘాయిత్యాలపై మాట్లాడే నవల

”The object of the novelist is to keep the reader entirely oblivious of the fact that the author exists, even of the fact that he is reading a book”
– Ford Madox Ford
తెలుగు లిటరేచర్‌లో డిటెక్టివ్‌ (ఇన్వెస్టిగేషన్‌) తరహాలో నేను చదివిన మొదటి నవల ఇది. రకరకాల సమస్యలతో తలమునకలవుతున్న ప్రస్తుత సమాజంలో మనుషుల్ని భయంకరంగా బాధపెట్టేవి ఆడపిల్లల మీద అఘాయిత్యాలు- లైంగికదాడులు. రేప్‌ – ఒళ్ళు గొగ్గురుపొడిచే పదం. మానసిక స్థితిని కుళ్ళపొడిచే పదం. చాలామంది కుర్రకారు మగాళ్లు ఆడవాళ్ళ మీద లైంగికదాడికి ఎందుకు
పాల్పడుతున్నారు? ఈ ప్రశ్న ఈ నవలలో రకరకాల లైంగిక దాడుల మీద పరిశోధన చేస్తూ పుస్తకం రాస్తున్న ఇన్‌స్పెక్టర్‌ మాధవ్‌లోనే కాదు మనలోనూ మొదలవ్వాలి.
విచక్షణ కోల్పోయి, వావివరసలు మర్చిపోతూ ఆడపిల్లల్ని శారీరక అఘాయిత్యాలకు ఎందుకు బలి చేస్తున్నారు ఈ దేశంలో. ఇవన్నీ మన ఇంటి దగ్గర ఉండే నివారణ కావాలి. ఇంటి దగ్గర తల్లిదండ్రుల ద్వారా ‘గుడ్‌ టచ్‌- బాడ్‌ టచ్‌’ గురించి, ఆడపిల్లలతో మగ పిల్లలెలా మసులుకోవాలి? మగవాళ్ళతో ఆడపిల్లలు ఎలా నడుచుకోవాలో ఇంటిదగ్గరే తల్లిదండ్రులు వివరంగా చెప్పాలి. బడిలో ఇంటి ఆవరణలోనూ ఎలాంటి సమస్యలు పిల్లలకు, ముఖ్యంగా ఆడపిల్లలకు ఎదురవుతున్నాయో తెలుసుకోవాలి.
నవలా కథనం ప్రకారం :-
ఓపెనింగ్‌ చాప్టర్‌ ప్రియా అనే స్నేక్‌ క్యాచర్‌ సుబ్బారెడ్డి పొలంలో పాము పట్టడంతో మొదలవుతుంది. తన భర్త మాధవ్‌ పోలీస్‌ ఆఫీసర్‌. వాళ్ళు ఉండే ఊరి దగ్గరి బ్రిడ్జి కింద శవం కనబడిందని కూతురు యోగితాని కాలేజ్‌కి డ్రాప్‌ చేయడానికి వెళుతున్న మాధవ్‌కి మంగమ్మ, నాగయ్య ద్వారా తెలుస్తుంది. ఇన్వెస్టిగేషన్‌ మొదలవుతుంది. అది ప్రకతి అనే అమ్మాయి శవమని, ఆమెపై లైంగికదాడి చేసి, తర్వాత బ్రిడ్జి కింద పడేశారని పోస్ట్‌మార్టం ద్వారా తెలుస్తుంది. హంతకుడు ఎవరో తెలుసుకోవడమే మాధవ్‌ వెతుకులాట.
మాధవ్‌ రకరకాల లైంగికదాడుల మీద ఒక పుస్తకం కూడా రాస్తుంటాడు. మాధవ్‌ తన కొలీగ్స్‌ పురుషోత్తం, వనజలు కలిసి suspectsని ఎంక్వయిరీ చేస్తారు. ఎదురింటి కుమారస్వామిని, బాయ్‌ ఫ్రెండ్‌ దుర్గాప్రసాద్‌ని, ఆఫీసుకు పగడాల సత్యాన్ని, బాబాయ్‌ వరసయ్యే ధర్మేంద్రని ఇలా తన ఎంక్వయిరీలో ఒక్కో కొత్త కోణంలో ప్రకతి లైంగికదాడికి చిన్నప్పుడు నుండే ఎలా బలైపోయిందో చెప్తాడు. ఈ కేసు గురించే పురుషోత్తం, మాధవ్‌ ఇద్దరు గొడవలు పడుతుంటారు.
ప్రకతిని గురించి ఆలోచిస్తూ తన ఫ్లాష్‌ బ్యాక్‌లోకి వెళ్లి తనపై జరిగిన మూడు లైంగికదాడులు అతన్ని వదలని దెయ్యాలయి, తన జీవితం మీద ఎంత ప్రభావం చూపాయో ఒక చాప్టర్లో చెప్తాడు.చివరికి తన భార్య ప్రియ ఒక పెద్ద చెట్టు కింద ఉన్న పాముల్ని పట్టడానికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన విషయం చెప్పినప్పుడు మాధవ్‌కి ఈ కేసును ఎలా డీల్‌ చేయాలో స్ఫురణకు వస్తుంది. చిక్కుముడి ఎలా వీడుతుందనేదే సస్పెన్స్‌… ఇది మాత్రం రివీల్‌ చేయను…
మనుషులు మానసిక సంఘర్షణలు ఎలా ఉంటాయో వివరించిన సంఘటనలు ఉన్నాయి. సమకాలీనంగా లైంగికదాడులపై వస్తున్న తెలుగు సినిమా చూసినంత ఫీలింగ్‌ కలిగింది. తీసుకున్న వస్తువు, శిల్పం చాలా మటుకు దేనికి తగ్గ ఫ్లేవర్‌ దానికి వాడి ఆకట్టుకునేలా రాశాడు. ఈ నవలలో నాకు బాగా నచ్చిన విషయాలు… ఇన్వెస్టిగేషన్‌ మోడ్‌లో నవల నడిపించడం… అలాగే మాధవ్‌ బాల్యంలో లైంగికదాడికి గురవడం. ఆడవాళ్ళు ఎక్కువ శాతం లైంగికదాడులకు గురవడం మనం చూస్తూ ఉంటాం. కానీ మగపిల్లలను కూడా మగవాళ్ళు తమ శారీరక వాంఛకు ఎలా లొంగ తీసుకుంటారో చెప్తుంది మాధవ్‌ చిన్నప్పటి పాత్ర. ఇలాంటి సంఘటనలు మనం ఇంగ్లీష్‌ లిటరేచర్లలోనూ, సినిమాల్లోనూ తరచూ చూస్తూ ఉంటాం. కానీ పెద్దగా దృష్టి పెట్టం.
అలాగే ప్రియ పాత్ర. ఒక నవలలో మొదటి నుంచి ఒక పాత్ర గురించి ఎక్కువ ప్రస్తావిస్తూ ఉంటే ఆ పాత్ర ద్వారా రచయిత ఏదో ఒక విషయాన్నో, ఉపయోగాన్నో తెలియజేయాలనే చిత్రీకరిస్తాడు. ఈ నవలలు opening protagonical character స్నేక్‌ క్యాచర్‌ ప్రియది. రచయిత స్నేక్‌ క్యాచింగ్‌ చేసే ప్రియ ద్వారా ఏ విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాడో మొదట నాకు అర్థం కాలేదు. Investigation తరహాలో నడుస్తున్న ఈ నవలలు ప్రియ పాత్ర స్నేక్యాచర్‌గా ఎందుకు ప్రత్యేకంగా పెట్టాడు అని ఆలోచన. మాధవ్‌, ప్రకృతి మరణం విషయంలో ఎంతమందిని ఇన్వెస్టిగేషన్‌ చేసిన అంతుచిక్కని చిక్కుముడి చివరికి ప్రియ వల్ల వీడిపోతుంది. ప్రియ పాత్ర అక్కడ ఉపయోగమైంది. Major గా, Minor గా పాముల గురించి, పాముల మనస్తత్వం కలిగిన మనుషుల గురించి చైతన్యం తేవడం.
సోలోమోన్‌ విజయ్‌కుమార్‌ రాసిన మునికాంతపల్లి కథల్లో ‘యానాది సెంచయ్య’ ఒకటి. యానాదుల జీవన విధానంలో ఉపాధికి ఉపయోగపడే తత్వం పాటలు, వివిధ వేషాలు వేసుకొని (మగాళ్లు కోకా రైకా కట్టుకొని) ఆడవాళ్లలా యాక్షన్‌ చేయడం భలే విచిత్రమైన విషయంగా తోస్తాయి. డా. కేశవరెడ్డి ‘చివరి గుడిసె’ నవలలో కూడా వాళ్ల జీవనం వెనుకున్న కన్నీటి సంఘర్షణ, తత్వం పాటలు పాడిస్తూ అవగతం చేస్తాడు. అలాగ, రచయిత బాలాజీ ప్రసాద్‌ కూడా యానాది జీవితాలను దగ్గరగా చూపించాడు. ఇందులో రచయిత పరిశీలనా పరిశోధనా నవలా రచనలో పడిన శ్రమ కనిపిస్తుంది. ఇందులో తత్వం పాటలు ఆకర్షణంగా అనిపించాయి.
‘వాలు కళ్ళ ఒక చిన్నది.. దాని నెత్తిన ఒక కడవంట కాలు జారిపాయ.. కడవ పగిలి పాయా నీళ్ళు పారిపాయా.. చిన్నదాని గుండె నిరమళ మాయ.. మాయా సంసారం ఇదేరా.. కలి మాయా సంసారమిదేరా’
యానాది జీవుల మౌఖిక సాహిత్యాన్ని కొంతలో కొంత నైనా లిఖిత సాహిత్యంగా మార్చి నిక్షిప్తపరిచేలా చేయడం హర్షించదగ్గ విషయం. పల్లెల్లో మమేకమైన జీవితాలని చిత్రించడం కూడా బాగుంది. అందులో మిడియాళం పాత్ర కడుపుబ్బా నవ్విచ్చేలాగా ఉంది.
మొత్తానికి ఈ నవల ద్వారా ఇప్పటి జనరేషన్‌ పిల్లలకు ఎలాంటి సెక్స్‌ అండ్‌ సైకాలజీ ఎడ్యుకేషన్‌ నేర్పాలి? తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి తమ పిల్లలపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? గుడ్‌ టచ్‌ బ్యాడ్‌ టచ్‌ తో పాటు విక్టిమ్‌ బ్లేమింగ్‌ అన్న విషయాలు అవగాహనకు తీసుకురావాలి అనే వాటిని మనముందుకు తెచ్చి పెట్టి ఆలోచించమంటాడు. ఈ ఉద్వేగం, సంఘర్షణ రచయితవి. ఆ కోపంలోంచే ఈ నవల రాశాడనిపిస్తుంది రచయిత. మంచి సోషల్‌ అవేర్నెస్‌తో, మంచి కథనంతో బాగా రాశాడు. యువ రచయితలు ప్రస్తుత సమాజం మీద, మార్పు మీద దృష్టి పెట్టారనడానికి ఈ నవల ఒక ఉదాహరణ.

– లిఖిత్‌ కుమార్‌ గోదా,

9640033378

Spread the love