విద్యార్థి దశ నుంచే శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి 

– జన విజ్ఞాన వేదిక జిల్లా కార్యదర్శి బీ.రాములయ్య
– ఆమనగల్ లో మండలస్థాయి చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్
– ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేత
నవతెలంగాణ – ఆమనగల్
విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని జన విజ్ఞాన వేదిక జిల్లా కార్యదర్శి బి.రాములయ్య అన్నారు. ఆమనగల్ మండల కేంద్రములోని వివేక విద్యాభారతి ఉన్నత పాఠశాల ఆవరణలో గురువారం జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో విద్యార్థులకు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ పోటీలు నిర్వహించారు. ఈపోటీలలో మండలంలో ఉన్న 11 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సంబందించి ఒకో పాఠశాల నుంచి 3 చొప్పున 8,9,10 తరగతుల  విద్యార్థులు మొత్తం 33 మంది పాల్గొన్నారు. ఈపోటీలలో ఆమనగల్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎన్.పవన్ కళ్యాణ్, ఎం.అజయ్ చౌహాన్, పి.అజయ్ కుమార్ లు ప్రభుత్వ ఇంగ్లీష్ విభాగంలో, ప్రభుత్వ ఉన్నత బాలికల పాఠశాల విద్యార్థులు డీ.ఐశ్వర్య, ఆయేషా, సాదిహా ప్రభుత్వ తెలుగు మీడియం విభాగంలో, లిటిల్ స్కాలర్స్ హైస్కూల్ విద్యార్థులు జీ.నితీష్, ఎం.శృతి, పీ.దీక్షిత్ రెడ్డి ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియం విభాగంలో నిలిచి జిల్లా స్థాయి టాలెంట్ టెస్ట్ కు ఎంపికయ్యారు. ఈసందర్భంగా జరిగిన బహుమతుల ప్రదానోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జన విజ్ఞాన వేదిక జిల్లా కార్యదర్శి రాములయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులందరూ శాస్త్రీయ అవగాహన పెంపొందించుకొని శాస్త్రీయ దృక్పథంతో ముందుకు సాగాలని సూచించారు. సమాజంలోని మూఢ విశ్వాసాలను నమ్మకుండా శాస్త్రీయంగా ఆలోచించాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు ట్రస్మా జిల్లా కోశాధికారి చుక్క అల్లాజీ గౌడ్ మాట్లాడుతూ ప్రతి ఏటా జన విజ్ఞాన వేదిక ద్వారా నిర్వహించే చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ విద్యార్థుల్లో దాగి ఉన్న శాస్త్ర పరిజ్ఞానాన్ని,  సృజనాత్మకతను వెలికి తీయడానికి దోహదపడతాయని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో ఉపాధ్యాయులు సుదర్షన్ రెడ్డి, మహేష్, భార్గవి, మహమూద్, శ్రీశైలం, విఠల్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love