– కొత్తూరు నాట్కో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం
– ట్రాఫిక్ ఎస్ఐ రవీందర్ నాయక్
నవతెలంగాణ – కొత్తూరు
ట్రాఫిక్ నియమ నిబంధనలను తెలుసుకొని విధిగా ప్రతి ఒక్కరూ పాటించాలని ట్రాఫిక్ ఎస్ఐ రవీందర్ నాయక్ అన్నారు. శనివారం ఆయన నాట్కో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ట్రాఫిక్ నిబంధనలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించి ట్రాఫిక్ రూల్స్ కలిగిన పాంప్లెట్ ను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… విద్యార్థి దశ నుండి ట్రాఫిక్ పై అవగాహన పెంచుకోవాలని అన్నారు. ట్రాఫిక్ అవగాహన లేకపోతే ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ట్రాఫిక్ నియమ నిబంధనాలను తెలుసుకొని తల్లిదండ్రులకు, తోటి వారికి అర్థమయ్యేలా సూచించాలని చెప్పారు. రోడ్డుపై నడిచేటప్పుడు ఎడమవైపున నడక కొనసాగించాలని అన్నారు. రోడ్డు ముఖ్య కూడలి వద్ద ఎరుపు, ఆకుపచ్చ, ఆరంజ్ సిగ్నల్స్ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు అంగూర్ నాయక్, కానిస్టేబుల్స్ శ్రీరామ్, వెంకట్ రెడ్డి, నరేందర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.