కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ లబ్ధిదారులకు తులం బంగారం

నవతెలంగాణ హైదరాబాద్: కల్యాణలక్ష్మి(Kalyana Lakshmi), షాదీముబారక్‌(shaadi-mubarak) లబ్ధిదారులకు నగదుతో పాటు తులం బంగారం ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (CM Revanth reddy) అధికారులను ఆదేశించారు. బీసీ, మైనారిటీ, గిరిజన సంక్షేమ శాఖలపై సమీక్ష నిర్వహించిన సీఎం.. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలోని ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో బీసీ స్టడీ సర్కిల్‌ ఏర్పాటుపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. సంక్షేమ హాస్టళ్లకు గ్రీన్‌ ఛానెల్‌ ద్వారా నిధులు విడుదల చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు నిర్మించేందుకు స్థలాలు గుర్తించి, అంచనాలు తయారు చేయాలన్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్‌, సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ సమీక్షలో పాల్గొన్నారు.

Spread the love