ఆరో రోజూ నష్టాల పరంపర

Sixth day of losing streak– ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 900 పాయింట్ల పతనం
– వీడని ట్రంప్‌ టారిఫ్‌ భయాలు
ముంబయి : వరుసగా ఆరో సెషన్‌లోనూ భారత స్టాక్‌ మార్కెట్లలో నష్టాల పరంపర కొనసాగింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సుంకాల భయాలు, ఎఫ్‌ఐఐలు తరలిపోవడం, భారత జీడీపీ వృద్ధిపై అనుమానాలు ఇన్వెస్టర్లను ఆందోళనకు గురి చేశాయి. ఈ నేపథ్యంలోనే బుధవారం ఇంట్రాడేలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ఏకంగా 905 పాయింట్లు పతనమై 76వేల దిగువకు పడిపోయి 75,388 కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నాం తర్వాత కొంత కొనుగోళ్లు పుంజుకున్నప్పటికీ.. తుదకు 122.52 పాయింట్ల నష్టంతో 76,171 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 26 పాయింట్లు కోల్పోయి 23,045కు చేరింది. ఫిబ్రవరి నాలుగో తేదీ నుంచి సెన్సెక్స్‌ 2,412.73 పాయింట్లు లేదా 3.07 శాతం, నిఫ్టీ 694 పాయింట్లు 2.92 శాతం చొప్పున నష్టపోయాయి.
సెన్సెక్స్‌-30లో మహీంద్రా అండ్‌ మహీంద్రా, ఐటీసీ, పవర్‌గ్రిడ్‌, రిలయన్స్‌ ఇండిస్టీస్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, అదానీ పోర్ట్స్‌, టైటాన్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు అధికంగా నష్టపోయిన వాటిలో టాప్‌లో ఉన్నాయి. మరోవైపు బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌, టాటా స్టీల్‌, లార్సెన్‌ అండ్‌ టర్బో, ఆల్ట్రా టెక్‌ సిమెంట్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, టాటా మోటార్స్‌ తదితర షేర్లు అధికంగా లాభపడిన వాటిలో ముందు వరసలో ఉన్నాయి. మంగళవారం నాటికి రూ. 4,486.41 కోట్ల విలువైన ఎఫ్‌ఐఐలు తరలిపోయాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 9 పైసలు బలహీన పడి 86.88 వద్ద నమోదయ్యింది. ఏషియన్‌ మార్కెట్లలో సియోల్‌, టోక్యో, షాంఘై, హాంకాంగ్‌ మార్కెట్లు సానుకూలంగా నమోదయ్యాయి.

Spread the love