తెలియకపోవటం తప్పుకాదు. అందరికీ అన్ని తెలియాలనీ లేదు. తెలుసుకోవాలన్న జిజ్ఞాస లేకపోవటం పెద్ద సమస్య. ఇక అసలు భయంకరమైన సమస్యేమిటంటే తనకు తెలిసిందే జ్ఞానమను కోవటం.ఇక సహించరాని దేమిటంటే కావాలని అజ్ఞానాన్ని జ్ఞానంగా చలామణి చేయించాలని చూడటం! పిల్లలు, చదువులేని వాళ్లు ఏదో మాట్లాడారంటే నవ్వి ఊరుకుంటాం. అలా వొదిలేయటానికి వీలులేని మనిషాయే. ఒకపెద్ద దేశానికి ప్రధానిగా ఉన్నవ్యక్తి, ఇంత అజ్ఞానంగా మాట్లాడటం చూస్తే పదవి స్థాయి దిగజారిపోతున్నది. ప్రపంచం ముందు పరువు పోతున్నది. మన మోడీగారి తీరు ఇందుకు నిదర్శనంగా నిలిచింది. ఈ మధ్య ఒక మీడియా ప్రతినిధులకు ఇంటర్వూ ఇస్తూ- అటెన్ బరో నిర్మించిన ‘గాందీ’ó చిత్రం 1982లో విడుదలయ్యేంత వరకు ప్రపంచానికి మహాత్మా గాంధీ గురించి తెలియనే తెలియదని తన విశేష అజ్జానాన్ని వెల్లడించారు. ఇది ప్రపంచ ప్రజలకు, మేధావులకు రాజకీయ వర్గాలకు నవ్వు తెప్పిస్తున్నది. ఒకింత ఆగ్రహము కలిగిస్తున్నది.
ఇంకా ఆ అజ్ఞానం ఎలా విస్తరించిందో చూడండి. అంతగొప్ప వ్యక్తిని, మహాత్ముని ప్రపంచానికి పరిచయం చేయడంలో మనం విఫలమయ్యామని, దీనికి కారణాలేమిటనీ కూడా బాధపడ్డారు. ప్రపంచంలోని ఉద్యమకారులు మార్టిన్ లూథర్‌కింగ్ జూనియర్, దక్షిణాఫ్రికా నేత నెల్సన్ మండేలా మొదలైన వారు ప్రపం చానికి బాగా తెలుసు. కానీ గాంధీని గురించి ప్రపంచానికి సినిమా వచ్చేవరకు తెలవకపోవటం అనే వ్యాఖ్యానం, మహాత్ముని గొప్పతనాన్ని తగ్గించే ప్రయత్నమా? తగ్గినందుకు బాధనా? బహుశా పరోక్షంగా గాంధీ ఈ ప్రపంచానికి ఇచ్చిన ప్రేరణను తక్కువ చేయటం ఆయన అంతర్గత ఉద్దేశ్యంగా కనపడుతున్నది. ఈయనలాగా తనను తాను ప్రచారం చేసుకోవటం, ఫొటోషూట్ లతో ఎక్స్‌ఫోజ్ చేసుకోవటం గాంధీకి చేతకాని విషయం.అవసరంలేనిది కూడా.
అటెన్ బరో గాంధీ సినిమా తీసేదానికంటే ఇరవై ఏండ్ల ముందే గాంధీని గురించి పరిశోధన చేశారు. దర్శకులు నెహ్రూను సంప్రదించారు. ఆయన అనేక సూచనలు చేశారు. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నపుడే సినిమా నిర్మాణం జరిగింది. ఇక అసలు విషయమేమంటే, మార్టిన్ లూథర్ కింగ్ జూని యర్‌కు ప్రేరణ నిచ్చింది మన మహాత్ముడే. అందుకు గుర్తుగా మార్టిన్ గృహావరణలో గాంధీ నిలువెత్తు విగ్రహం మనకు దర్శనమిస్తుంది. నెల్సన్ మండేలాకూ స్పూర్తి మహాత్మాగాంధీనే. 27 సంవత్సరాలు జైలు జీవితం అనుభవించి విడుదలైన నెల్సన్ మండేలా మొదట చెప్పిన మాట, తనకు గాంధీ ప్రేరణ అని. అందుకే ఆయన్ను దక్షిణాఫ్రికా గాంధీ అని పిలుస్తారు. అంతేకాదు ఐన్‌స్టీన్ లాంటి గొప్ప శాస్త్రకారునికి కూడా గాంధీ ప్రేరకుడు. ప్రపంచానికి గాంధీ తెలవడానికి సినిమాలు ఏవీ అవసరం లేదు. ప్రపంచంలో అనేక మందిని, నాయకులను, దేశాలను ప్రభావితం చేసినవాడు గాంధీ. సీపీఐఎం) కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నట్లు మోడీ పుట్టకముందే మహాత్మాగాంధీ పేరు ఐదుసార్లు నోబుల్ శాంతి బహుమతికోసం పరిశీలింపబడింది. కానీ ఆనాడు దేశం బ్రిటీష్ వలస దేశం కావటం వలన దక్కలేదు. అది తీసుకోవటానికి ఆయన విముఖత కూడా చూపాడు.ఆయన తరతరాలుగా శాంతి, అహింసకు రాయబారిగా ప్రపంచ వ్యాప్తంగా కీర్తించబడ్డారు అన్న ఆయన వ్యాఖ్యలు అక్షర సత్యాలు.
ఇట్లాంటి ప్రపంచాన్ని ప్రభావితం చేసిన మహాత్మున్ని అవమానపరచడం, తక్కువచేసి మాట్లాడటం ప్రధానికి తగదని అనేకమంది నాయకులు మేధావులు తప్పుపడుతున్నారు. ఒక సినిమా దర్శకుడు లూయిస్ కుమార్ బర్మాన్ అయితే, జాతిపితను అవమానపరిచాడని గౌహతి పోలీస్‌స్టేషన్ లో కేసు పెట్టారు. అనేక మంది విద్యావేత్తలూ ఈ రకమైన వ్యాఖ్యలకు ఖండిస్తున్నారు. గాంధీని ప్రపం చానికి ఎరుకపరచడంలో విఫలమయ్యామని, ఈ విఫలత ఎవరిదని పరోక్షంగా కాంగ్రెసును తప్పు పడుతున్న మోడీ, తన హయాంలోనే భావితరాలు చదువుకునే పాఠ్యాంశాలనుండి గాంధీకి సంబంధించిన కొన్నిభాగాలు తొలగించిన విషయాన్ని ఎవరు ఈయనకు గుర్తుచేయలి. ఇంతకన్నా ప్రహసనం మరోటుంటుందా? గాడ్సేను గురించిన మాత్రమే అవగాహన ఉన్నవారికి గాంధీని గురించి ఎలా తెలుస్తుందని అనుకోకతప్పదు.
ఎన్నికల ఘట్టాలు ముగుస్తున్న కొద్దీ ప్రధాని ఇలాంటి హాస్యాస్పద, వివాదాస్పద వ్యాఖ్యలే చేస్తున్నారు. అంతకు ముందయితే, తాను అమ్మకు పుట్టాననుకున్నది వాస్తవం కాదని, భగవంతుడే నన్ను ఈ అవతారంలో పంపిం చాడని, నేను భగవంతుని స్వరూపంగా వచ్చాననీ ప్రకటించాడు. ఎన్నికలు పూర్తవ్వగానే కన్యాకుమారిలో వివేకానంద శిల స్మారకం వద్ద ధ్యానముద్రలోకి వెళ్లాడు.ప్రధానిగా దేశ పాలనను వదిలేసి ఇదేమి చిత్ర విచిత్ర ప్రవర్తనలు. ధ్యానం చేయదలుచుకుంటే పూర్తిగా సన్యాసిగా వెళ్లి పోవచ్చు.అప్పుడు ప్రధాని పదవిని వదిలేయాలి. అటు జ్ఞానమూలేదు, ఇటు ధ్యానమూ రాదు. ఉన్నదొకటే అజ్ఞాన ముద్ర!