ప్రతి పల్లెకు క్రీడా జ్యోతి

A sporting torch for every village– నేడు సీఎం కప్‌ టార్చ్‌ రిలే ఆరంభం
– హాజరు కానున్న సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్‌: దశాబ్ద కాలంగా తెలంగాణలో క్రీడా రంగం కుంటుపడిందని, ఇక నుంచి పల్లెల నుంచి ప్రపంచ విజేతలను తయారు చేయటమే లక్ష్యంగా పని చేస్తామని తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (శాట్‌) చైర్మన్‌ కే. శివసేనా రెడ్డి తెలిపారు. మహత్మ గాంధీ, లాల్‌బహుదూర్‌ శాస్త్రి జయంతి సందర్భంగా బుధవారం ఎల్బీ స్టేడియంలో వారి చిత్ర పటాలకు నివాళులు అర్పించిన శివసేనా రెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘తెలంగాణలో ప్రతి పల్లెకు క్రీడా సంస్కతి వ్యాపించాలి. యువత క్రీడలను ప్రొఫెషనల్‌ కెరీర్‌గా ఎంచుకునేందుకు ప్రోత్సహించే దిశగా శాట్‌ ప్రణాళికలు రూపొందిస్తుంది. ఇందులో భాగంగా సీఎం కప్‌ పోటీలను నాలుగు అంచెల్లో నిర్వహిస్తున్నాం. గ్రామ, మండల, జిల్లా సహా రాష్ట్ర స్థాయిలో సీఎం కప్‌ పోటీలకు రంగం సిద్ధమైంది. సీఎం కప్‌ పోటీల్లో విజేతలుగా నిలిచిన అథ్లెట్లకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడా రిజర్వేషన్‌ వర్తింపజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా శాట్‌ యంత్రాంగం, వ్యాయాయ విద్య ఉపాధ్యాయులు, కోచ్‌లు, జిల్లా యంత్రాంగం కలిసికట్టుగా సీఎం పోటీలను విజయవంతం చేసేలే రోడ్‌మ్యాప్‌ సిద్ధం చేశామని’ శివసేనా రెడ్డి తెలిపారు.
నేడు టార్చ్‌ రిలే: సీఎం కప్‌ 2024 పోటీల సందర్భంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి నేడు టార్చ్‌ రిలే కార్యక్రమాన్ని ఆరంభించనున్నారు. తెలంగాణలో ప్రతి పల్లెకు క్రీడా జ్యోతి నినాదంతో 33 జిల్లా కేంద్రాల్లో టార్చ్‌ రిలే నిర్వహిస్తున్నారు. నేడు సాయంత్రం ఎల్బీ స్టేడియంలో జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్న రేవంత్‌రెడ్డి.. క్రీడా జ్యోతిని వెలిగించనున్నారు. అనంతరం టార్చ్‌ రిలే ఎల్బీ స్టేడియం నుంచి వికారాబాద్‌కు చేరుకోనుంది. అక్కడ్నుంచి 16 రోజుల్లో 33 జిల్లాలు చుట్టేయనుంది. 2023 జాతీయ క్రీడల్లో పతకాలు సాధించిన తెలంగాణ క్రీడాకారులు, ఇటీవల జాతీయ స్థాయి ఫుట్‌బాల్‌ పోటీల్లో విజేతగా నిలిచిన తెలంగాణ జట్టుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నగదు ప్రోత్సాహకాలు అందించనున్నారు. రెండు సార్లు ప్రపంచ చాంపియన్‌, స్టార్‌ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ ఇటీవల గ్రూప్‌-1 కేడర్‌లో డిఎస్పీగా నియామకమైన సంగతి తెలిసిందే. నేడు నిఖత్‌ జరీన్‌కు సీఎం రేవంత్‌రెడ్డి అధికారికంగా ర్యాంక్‌లు ప్రధానం చేయనున్నారు.

Spread the love