మాట‌లు నేర్పేందుకు ఓ సాంకేతిక వేదిక‌

మాట‌లు నేర్పేందుకు ఓ సాంకేతిక వేదిక‌ఎలిజబెత్‌ జీన్‌ థామస్‌… అనేక సవాళ్లను ఎదుర్కొని తన కుటుంబం నుండి మొదటి వ్యాపారవేత్తగా ఎదిగింది. వ్యాపారమంటే తనకు మాత్రమే లాభాలు వస్తే చాలనుకోలేదు. తాను చేసే ఏపనైనా సమాజానికి ఉపయోగపడాలనుకుంది. విద్యార్థిగా ఉన్నప్పుడే ప్రత్యేక అవసరాలున్న తల్లిదండ్రుల సమస్యలు ఆమెను ప్రభావితం చేశాయి. దానికి సంబంధించిన విద్యనే అభ్యసించి ప్లాట్‌ఫారమ్‌ స్పీచ్‌ థెరపీని అందరికీ అందుబాటులో ఉంచింది. ఇప్పుడు చిన్నారులకే కాక పెద్దలకు సైతం నాణ్యమైన స్పీచ్‌ థెరపీ సేవలను యాక్సెస్‌ చేయడానికి ఒక సాంకేతిక వేదికను ప్రారంభించిన ఆమె పరిచయం…
కేరళలోని కొట్టాయంలో పుట్టి పెరిగిన ఎలిజబెత్‌ జీన్‌ థామస్‌ ముగ్గురు అమ్మాయిలలో పెద్దది. ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ ప్రొఫెసర్లు. ఎలిజబెత్‌ వృత్తిపరమైన డిగ్రీ ఏదైనా చేయాలనుకుంది. ‘ఆ సమయంలో ఇతర విద్యార్థుల మాదిరిగానే నేను కూడా మెడికల్‌, ఇంజనీరింగ్‌ ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్నాను. అప్పుడే మా కుటుంబ స్నేహితుని ద్వారా ఆడియాలజీ అండ్‌ స్పీచ్‌-లాంగ్వేజ్‌ పాథాలజీలో డిగ్రీ గురించి విన్నాను. ఇది నాకు చాలా ఆసక్తిని కలిగించింది. అంతే నా విద్యాపరమైన ఆకాంక్షలను మార్చింది’ అని ఆమె పంచుకున్నారు.
చేయగలనా లేదా..?
ఎలిజబెత్‌ ఏఎస్‌ఎల్‌పీలో బ్యాచిలర్‌ డిగ్రీ చేసి ముంబై విశ్వవిద్యాలయం నుండి మాస్టర్స్‌ పూర్తి చేసింది. పెండ్లి తర్వాత బెంగుళూరు, చెన్నై, గురుగ్రామ్‌ వంటి నగరాల్లో నివసించింది. అక్కడ రెండు దశాబ్దాలకు పైగా వివిధ సంస్థలు, ఆసుపత్రులలో స్పీచ్‌-లాంగ్వేజ్‌ పాథాలజిస్ట్‌గా పనిచేసింది. చివరగా పీడియాట్రిక్‌ థెరపీ సేవలను అందించే స్టార్టప్‌గా మారింది. అక్కడ స్పీచ్‌ థెరపీ విభాగానికి నాయకత్వం వహించింది. ‘ఈ పనులన్నీ చేస్తూనే థెరపీ సెంటర్‌ను ప్రారంభించాలనుకున్నా. కానీ చేయగలనా లేదా అనే అనుమానం. పైగా నా భర్త ఉద్యోగ రీత్యా వివిధ నగరాలకు వెళ్ళాల్సి వచ్చేది’ ఆమె జతచేస్తుంది.
కరోనా రావడంతో…
15 ఏండ్లకు ముందు నుండే విదేశాల్లో ఆన్‌లైన్‌లో థెరపీ సర్వసాధారణం. అయితే మనదేశంలో నెట్‌వర్క్‌ సమస్యల వల్ల దీనికి అంత ప్రాధాన్యం ఇవ్వలేదు. ‘చిన్న పట్టణాలలో స్పీచ్‌ థెరపీ సెంటర్లు లేవు. ప్రత్యేక అవసరాలున్న తమ పిల్లల కోసం తల్లిదండ్రులు నాకు ఫోన్లు చేసేవారు’ అమె గుర్తు చేసుకుంది. కొంతకాలం తర్వాత ఎలిజబెత్‌ క్లయింట్‌లలో ఒకరు వేరే ప్రాంతానికి వెళ్లారు. ఆమె ఆన్‌లైన్‌ స్పీచ్‌ థెరపీని కోరింది. ఆ క్లయింట్‌ కోరికతో తన స్నేహితురాలు ప్రవీణ తో కలిసి 2020లో ఫోనోలాజిక్స్‌ను ప్రారంభించింది. ‘ప్రారంభంలో దీనిపై తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించేందుకు ప్రయత్నించాం. అయితే కొన్ని రోజుల్లోనే మహమ్మారి వచ్చిపడింది. అన్ని చికిత్సా కేంద్రాలు మూసివేశారు. దాంతో మా ఆన్‌లైన్‌ థెరఫీని ఎక్కువ మంది ఉపయోగించుకున్నారు’ అని ఆమె జతచేస్తుంది.
ఆన్‌లైన్‌కి రాక తప్పలేదు
క్రమంగా మరింత మంది స్పీచ్‌ పాథాలజిస్ట్‌లను నియమించుకుని సెప్టెంబర్‌ 2021లో NSRCEL, IIM బెంగళూరులో ఉమెన్‌ స్టార్టప్‌ ప్రోగ్రామ్‌లో చేరింది. NSRCEL వద్ద సలహాదారులతో ఆలోచనలు చేస్తున్నప్పుడు ఇ-లెర్నింగ్‌ ప్లాట్‌ఫారమ్‌ను అభివృద్ధి చేయాలనే ఆలోచన వచ్చింది. అయితే ఈ ప్రయాణం అంత సులభం కాదు. ‘ఆన్‌లైన్‌ థెరపీలో పిల్లలు చిన్నవారు కాబట్టి స్క్రీన్‌ ముందు కూర్చోవడం, అర్థం చేసుకోవడం కష్టం. అయితే కోవిడ్‌-19 ఒత్తిడి కూడా తల్లిదండ్రులను ప్రభావితం చేసింది. చికిత్సను ఆఫ్‌లైన్‌లో కొనసాగించలేని చాలా మంది ఆన్‌లైన్‌కి రాక తప్పలేదు’ అమె అన్నారు. ఏది ఏమైనా మారిన పరిస్థితులకు అనుగుణంగా అందరూ మారడంతో వారి కృషి ఫలించింది. ఇద్దరు థెరపిస్ట్‌లతో ప్రారంభించిన ఫోనోలాజిక్స్‌ నాలుగేండ్లలో 14 మందితో కూడిన బృందంగా ఎదిగింది. పిల్లలు, పెద్దలకు స్పీచ్‌ థెరపీ, పేరెంట్‌ కోచింగ్‌ ప్రోగ్రామ్‌, అప్లైడ్‌ బిహేవియర్‌ అనాలిసిస్‌, ఆక్యుపేషనల్‌ థెరపీతో పాటు ప్రత్యేక విద్యను అందిస్తోంది.
తల్లిదండ్రులను సహ చికిత్సకులుగా
దేశంలో స్పీచ్‌ పాథాలజిస్ట్‌ల కొరతపై ఎలిజబెత్‌ దృష్టి కేంద్రీకరించింది. ప్రతి 4,000 మంది వ్యక్తులకు కేవలం ఒకరు మాత్రమే ఉన్నారు. DERBI ఫౌండేషన్‌, కేరళ స్టార్టప్‌ మిషన్‌ ద్వారా స్టార్టప్‌ ఇండియా నుండి గ్రాంట్‌ల సహాయంతో ఫోనోలాజిక్స్‌ తన సేవల పరిధిని విస్తరిస్తూ జూలై 2023లో తన వినూత్న ఇ-లెర్నింగ్‌ ప్లాట్‌ఫారమ్‌, స్పీచ్‌ అల్లీని ప్రారంభించింది. ‘ఈ గైడెడ్‌ ప్లాట్‌ఫారమ్‌ స్పీచ్‌ థెరపీ గోల్స్‌, స్ట్రక్చర్డ్‌, ఆటోమేటెడ్‌ గేమిఫైడ్‌ యాక్టివిటీల సోపానక్రమాన్ని అందిస్తుంది. కో-థెరపిస్ట్‌లుగా మారడానికి తల్లిదండ్రులకు అధికారం ఇస్తుంది’ అంటూ ఆమె వివరించింది. స్పీచ్‌ అల్లీ వెబ్‌ ఆధారిత ప్లాట్‌ఫారమ్‌ Android, iOS యాప్‌లుగా అందుబాటులో ఉంది.
వేగవంతమైన పురోగతికి
ఈ చికిత్స నెలకు 12 సెషన్లుగా ఉంటుంది. డార్జిలింగ్‌, జైపూర్‌, అజ్మీర్‌, కొట్టాయం, పతనంతిట్ట, కొల్లాం, షిమోగా, ఈరోడ్‌, జమ్ము, తిరుచిరాపల్లితో పాటు సెమీ-అర్బన్‌ ప్రాంతాలతో సహా భారతదేశం అంతటా దీనికి వినియోగదారులు ఉన్నారు. ‘స్పీచ్‌ అల్లీ స్పీచ్‌ థెరపీని అతి తక్కువ వ్యయంతో సెమీ-అర్బన్‌ ప్రాంతాలకు అందుబాటులో ఉంచుతుంది. పదేపదే సాధన చేయడంలో సహాయపడుతుంది. ఇది వేగవంతమైన పురోగతికి దారితీస్తుంది. ఇది పిల్లల కోసం 1000కి పైగా, తల్లిదండ్రుల కోసం 100పైగా వీడియో ట్యుటోరియల్‌లను కలిగి ఉంది’ ఆమె జతచేస్తుంది. ఫోనోలాజిక్స్‌ ఇప్పటి వరకు 2,800 మంది పిల్లలకు సేవ చేసింది. భారతదేశంతో పాటు 10కిపైగా దేశాలలో సుమారు 30,000 ఆన్‌లైన్‌ స్పీచ్‌ థెరపీ సెషన్‌లను అందించింది. ఇంగ్లీష్‌, హిందీ, మలయాళం, తమిళం, కన్నడ, తెలుగు, మరాఠీతో సహా ఏడు భాషలలో థెరపీ సెషన్లు నిర్వహించబడతాయి. ప్రవీణ కంపెనీ నుండి వెళ్ళిపోయిన తర్వాత ఎలిజబెత్‌ భర్త జిజో జాన్‌ ఫోనోలాజిక్స్‌లో సీటీఓగా చేరారు.
సరైన సమయమంటూ లేదు
ఫోనోలాజిక్స్‌ కొన్ని ప్రశంసలను గెలుచుకుంది. వాటిలో ముఖ్యమైనవి యాక్సెసిబిలిటీ కోసం NCPEDP-MPHASIS యూనివర్సల్‌ డిజైన్‌ అవార్డ్‌, షీ లవ్స్‌ టెక్‌ 2022 ఇండియా చాప్టర్‌ విజేత, వీసా షీస్‌ నెక్స్ట్‌ ప్రోగ్రామ్‌, స్టాన్‌ఫోర్డ్‌ సీడ్‌ స్పార్క్‌ ప్రోగ్రామ్‌ టాప్‌ 6 గ్రాంట్లు పొందింది. ‘మేము సంస్థలతో భాగస్వామ్యం చేయడం, చికిత్స కేంద్రాలు, ప్లేస్కూల్స్‌తో పాటు ఇతరులకు బి2బి సేవలను అందించడం గురించి ఆలోచిస్తున్నాం. తద్వారా తల్లిదండ్రులు సమూహ సభ్యత్వాలను పొందవచ్చు. 2026 నాటికి కనీసం10,000 మంది పిల్లలకు సేవ చేయాలని ఆశిస్తున్నాం. మీ అనుమతి లేకుండా ఎవరూ మిమ్మల్ని ప్రభావితం చేయలేరు. మిమ్మల్ని, మీ కలలను నమ్మండి. వ్యాపారవేత్తగా మారడానికి ఇదే సరైన సమయం అని చెప్పలేము. మీరు ఎప్పుడైతే సిద్ధంగా ఉంటారో అప్పుడే ప్రారంభించాలి. అయితే సహాయం అడగడానికి మాత్రం వెనుకాడవద్దు’ అంటూ ఆమె కాబోయే మహిళా వ్యాపారవేత్తలకు చెబుతున్నారు.

Spread the love