విద్వేష వాక్కుల వీరంగం

విద్వేష వాక్కుల వీరంగంపోలింగ్‌ ముగిసిన రెండు రోజుల తర్వాత ప్రధాన మంత్రి చేసిన పైత్యప్రకోపిత ప్రసంగం దేశంలోనూ విదేశాల్లోనూ తీవ్ర ఖండనలకు గురైంది. ముస్లింలపై ఆయన వాడిన విద్వేష భాష, అలాగే వారి పట్ల బుజ్జగింపు ధోరణి అనుసరిస్తున్నట్లుగా ఆయన ఆరోపిస్తున్న పార్టీలపై వేసిన నిందలు ఆయన గుజరాత్‌ రోజులను గుర్తుచేస్తున్నాయి. 2002లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వున్న ఆయన 2002 జాతి హత్యాకాండ తర్వాత ఇదే విధమైన రెచ్చగొట్టుడుకు పాల్పడ్డారు. ఇప్పుడు ఎన్నికల పోరాటం తొలి దశలోనే మళ్లీ ఆ భాషకు దిగాలని ఆయన ఎందుకు భావించాల్సి వచ్చిందనేది ఇక్కడ కీలకంగా విశ్లేషించ వలసిన అంశం.
ఏప్రిల్‌ 19న 120 సీట్లకు పోలింగ్‌ జరిగింది. ఇందులో 40 తమిళనాడు, పాండిచ్చేరిలో వున్నాయి. వీటిలో బీజేపీకి వచ్చే సీట్లు శూన్యం. మిగిలిన వాటిలో రాజస్థాన్‌లో 12, ఉత్తరప్రదేశ్‌లో 8, మధ్యప్రదేశ్‌లో 6, ఉత్తరాఖండ్‌-మహారాష్ట్ర-అస్సాంలలో ఐదేసి చొప్పున, బీహార్‌లో 4, పశ్చిమ బెంగాల్‌లో 3, ఈశాన్యంలో 6, చత్తీస్‌గఢ్‌లో 1, జమ్ము కాశ్మీర్‌లో 1 వున్నాయి. గతసారి బీజేపీ ఈ రాష్ట్రాల్లో విజయం సాధించింది. కానీ ఈసారి ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్రలలో పరిస్థితి అంత సానుకూలంగా వున్నట్టు కనిపించడం లేదు. అదే నిజమైతే మూడో దఫా అధికారంలోకి రావాలనే ఆ పార్టీ కల కలగానే మిగిలిపోతుంది. అది నెరవేరడం అసాధ్యమవుతుంది.
తమ పట్ల పెరుగుతున్న ఈ విస్తృత నిరసన మింగుడు పడని ఫలితమే ముస్లింలపై, వారిని బుజ్జగిస్తాయని ఆరోపించే పార్టీలపై ద్వేషం మరింత పెంచిన ప్రధాని స్పందనకు కారణం. ఇది ఆయనకు అలవాటైన పాత విద్యే. రాజస్థాన్‌లోని బాన్స్‌వారాలో ఆయన చేసిన ప్రసంగం అందుకే. కొద్ది మాసాల కిందట జరిగిన ఎన్నికలలో బీజేపీకి రాజస్థాన్‌ మంచి విజయాన్నే అందించింది. అలాంటి చోట ఏప్రిల్‌ 19 తొలి దశ పోలింగ్‌లో పరిస్థితి మారడం ఇందుకు కారణమైంది. దాంతో ప్రధాని కాంగ్రెస్‌పై దురుద్దేశపూరితమైన అసత్య ప్రచారానికి దిగారు. ముస్లింలు చొరబాటుదారులనీ ఎక్కువగా పిల్లలను కంటారనీ ఆరోపిస్తూ కాంగ్రెసు సంపద కట్టబెట్టేందుకు మొదటి అవకాశం ఇస్తుందని అభాండం వేస్తున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఈ మేరకు వాగ్దానం చేశారని పచ్చి అవాస్తవం చెప్పేస్తున్నారు. కాంగ్రెస్‌ను గనక ఎన్నుకుంటే హిందూ మహిళల మంగళసూత్రాలను కొల్లగట్టి అందులోని బంగారం అత్యధికంగా ముస్లింలకు ధారాదత్తం చేస్తారని ఆరోపిస్తున్నారు. ఇది హిందూ మహిళలను రెచ్చగొట్టేందుకు చేసిన ప్రయత్నం. ఇక అదే రాజస్థాన్‌లో మరో తప్పుడు ఆరోపణ తెచ్చారు. కాంగ్రెస్‌ వస్తే దళితులు, గిరిజనుల రిజర్వేషన్లు తీసేసి ముస్లింలకు ఇస్తారని మాట్లాడారు. తన విధానాలను వ్యతిరేకించే పేద వర్గాలలో చీలికలు పెంచే పాచికే ఇది.
బీజేపీ అధికారంలోకి రావాలంటే హిందీ రాష్ట్రాలే కీలకం. కనుక ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌లలో ఇలాంటివే మరిన్ని జరుగుతాయని భావించవచ్చు. ఇప్పటికే యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఆ పని మొదలెట్టేశారు కూడా. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే షరాయిత్‌ చట్టం అమలు చేస్తుందని ఆయన ఆరోపించారు.
ప్రధాని ప్రసంగాలు బీజేపీ నిబద్ద ఓటర్లలో అత్యుత్సాహ పూర్వకమైన స్పందన తెచ్చాయి. ఇప్పటికిప్పుడు జరిగే ఎన్నికల్లో ప్రయోజనం కోసం తమ మౌలిక భావజాలానికి తిరిగి వెళ్లడం వారికి నచ్చింది. అంతేగాక తమ విధానాలపై పెరుగుతున్న నిరససను ఎదుర్కోవడానికి కూడా ఇది ఉపయోగమని వారి ఆలోచన. ఆస్తుల పున:పంపిణీని, కుబేరులపై అదనపు పన్ను విధింపును కచ్చితంగా వ్యతిరేకిస్తూ ప్రధాని మాట్లాడినదానికీ దేశంలోనూ వెలుపలా కార్పోరేట్‌ ప్రపంచంలో కొందరు కూడా ఉత్సాహపడిపోయారు. ఆర్థిక అసమానతల తగ్గింపు కోసం ఇలా చేయాలనే యోచనను ప్రధాని పూర్తిగా తోసిపుచ్చడం వారికి నచ్చింది.
ప్రధానమంత్రి మాట్లాడిన తీరుపై సీపీఐ(ఎం), ఇతర ప్రతిపక్షాలు, దీనిపై ఆందోళన చెందిన పౌరులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ప్రజల్లో వివిధ తరగతుల మధ్య మనస్పర్థలు సృష్టించే ఈ ప్రసంగం రాజ్యాంగ విరుద్ధమని, ఎన్నికల నియమావళికి వ్యతిరేకమని తెలిపాయి. ఈ ప్రసంగంపై ఎన్నికల సంఘం మొదట ఏమీ స్పందించలేదు. తర్వాత ఫిర్యాదును అధ్యయనం చేస్తున్నట్టు చెప్పింది. ఎన్నికల కమిషన్‌ తన రాజ్యాంగ బాధ్యత ఏ మేరకు నిర్వహిస్తుందనే దానిపై లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు. అది ఆ విషయంలో విఫలమైతే ప్రజాస్వామ్యానికి అనర్థం. ఈ విషయంలో ఏం జరుగుతుందనేదాన్ని బట్టి ఎలక్షన్‌ కమిషన్‌ ఏ మేరకు మచ్చిక అయిందనేది తెలుసుకోవచ్చు. (ఇందులో సందేహించినట్టే ఎన్నికల కమిషన్‌ బీజేపీ అధ్యక్షుడు జె.పి. నడ్డాకు మాత్రమే..అది కూడా పైపై మాటలతో మొక్కు బడిగా తాఖీదు ఇచ్చి సరిపెట్టింది) మోడీ విద్వేష ప్రసంగాలు సన్నగిల్లిపోతున్న ఆ పార్టీ అవకాశాలను ఏ మేరకు మెరుగుపరుస్తాయి? అధిక ధరలు, నిరుద్యోగం, అవినీతి వంటి సమస్యలు ఓటర్లను చాలా ఆందోళన పరుస్తున్నాయని అనేక సర్వేలు చెబుతున్నాయి. నిజంగా అదే నిజమైతే వారిని పక్కదోవ పట్టించే ఇలాంటి తంటాలు వృధానే అవుతాయి. అయినా అవి ఖండనపాత్రమే.
(ఏప్రిల్‌ 24 ‘పీపుల్స్‌ డెమోక్రసీ’ సంపాదకీయం)

Spread the love