మోడీ గ్యారంటీలు – ప్రచారార్భాటం

మోడీ గ్యారంటీలు - ప్రచారార్భాటం18వ లోక్‌సభ ఎన్నికలు 2024 ఏప్రిల్‌ 19 నుంచి జూన్‌ 2 వరకు 7 విడతలుగా పోలింగ్‌ జరుగుతున్నది. తిరిగి 3వ సారి అధికారం చేపట్టడానికి ఆర్‌ఎస్‌ఎస్‌ నేతృత్వంలోని బీజేపీ కూటమి ‘మోడీ గ్యారంటీల’ పేరుతో విస్తృత ప్రచారం గావిస్తున్నది. ప్రచార, ప్రసార సాధనాలను వినియోగించడమేకాక సొంత సోషల్‌ మిడియా ద్వారా జరుగుతున్న ప్రచారం వెగటు పుట్టిస్తున్నది. గత పదేండ్లలో జరగని కృషిని జరిగినట్లు చెప్పడంతో పాటు 2047 నాటికి ‘వికసిత భారత్‌’ ఏర్పాటు చేస్తామని చెబుతున్నది. ప్రస్తుతం దేశం ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌'(స్వయం పోషకత్వ దేశం)గా మారిందని చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదు. 144 కోట్ల జనాభాలో నేటికి దారిద్య్రరేఖకు దిగువన 30శాతం మంది ప్రజలున్నట్లు ఆర్‌బిఐ మాజీ అధ్యక్షులు రంగారాజన్‌ కమిషన్‌ చెబుతుండగా, మోడీ ప్రభుత్వం తమ పదేండ్ల పాలనలో 25 కోట్ల మందిని దారిద్య్రరేఖనుంచి ఎగువకు తెచ్చామని చెప్పింది. అదే సందర్భంలో 81 కోట్ల మందికి రానున్న ఐదేండ్లకు నెలకు 5 కిలోల చొప్పున ఉచిత ఆహార పంపిణీ చేస్తామని వాగ్థానం చేసింది. ఈ పథకం ద్వారా పరోక్ష్యంగా దారిద్య్రం ఉన్నట్లు అంగీ కరించడమే. బీజేపీ పాలనలో ఒకశాతం కార్పొరేట్లకు 40 శాతం దేశ సంపద పోగుబడినట్లు, 50శాతం అట్టడుగు జనాభా చేతిలో మూడు శాతం సంపద మాత్రమే ఉందని ‘ఆక్స్‌ఫామ్‌’ నివేదిక వెల్లడించింది. 2020 నాటికి దేశంలో శతకోటీశ్వరులు 102 నుంచి 1695కు పెరి గారు. దేశ ఆర్థిక సంపద కార్పొరేట్‌ల చేతులలో బందీ అయిందని చెప్పడానికి ఇంతకన్నా ఉదహరణ అవసరం లేదు. మోడీ గ్యారంటీల పేరుతో జరిగిన అభివృద్ధి పట్టికలో చూడొచ్చు.
డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ పేర బీజేపీ పాలిత రాష్ట్రాలలో అభివృద్ధి బాగా జరిగినట్లు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదు. దారిద్య్రం, నిరుద్యోగం పెరగడమేకాక శాంతి-భద్రతల సమస్య తీవ్రంగా ఉంది. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో భాగంగా ‘వాషింగ్‌ మిషన్‌’ విధానాన్ని అమలు జరుపుతున్నది. అనగా వేలకోట్ల అవినీతిపరులు తమపార్టీలోకి రావడంతో వారి అవినీతి అరోపణలను తొలగించి వేస్తున్నారు. అశోక్‌ చౌహన్‌(కార్గిల్‌ ఇండ్ల కుంభకోణం), అజిత్‌ పవార్‌ (రూ.25 వేల కోట్లు), నవీన్‌ జిందాల్‌ (ఎన్నికల బాండ్లు), గాలిజనార్దన్‌రెడ్డి (వేల కోట్ల ఐరన్‌ ఒర్‌), తపస్‌ రారు, సువేంద్‌రారు లాంటి 60 మందికి వాషింగ్‌ మిషిన్‌ పథకం కింద అవినీతి నేరాలను తొలగించారు. ఇప్పటికి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌, జార్ఘండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌సొరేన్‌తో పాటు అనేకమంది ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా జైలులో పెట్టారు. మాజీ ముఖ్యమంత్రి మధుకోడాను అక్రమ గనుల కేసులో అరెస్టు చేసి అతని భార్యను బీజేపీలో చేర్చుకుని కేసు ఉపసంహరింప జేశారు.
రాజ్యాంగ హననం
రాజ్యాంగం కల్పించిన హక్కులను కాజేసి, ప్రథమిక హక్కులను హరించివేస్తున్నారు. 370 అర్టికల్‌ సవరణతో శాసన సభను రద్దు చేసి కాశ్మిర్‌ రాష్ట్రాన్ని, లడక్‌ను కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చారు. రాష్ట్రాల పన్ను ఆదాయాన్ని తగ్గించడానికి, ముఖ్యంగా బీజేపీయేతర రాష్ట్రాల ఆధాయాన్ని దెబ్బకొట్టడానికి ఒకే పన్ను విధానం ‘జిఎస్‌టి’ తెచ్చింది. బ్యాంకులకు వేల కోట్లు ఎగనామం పెట్టిన కార్పొరేట్లకు తిరిగి రుణాలు ఇవ్వడానికి బ్యాంకుల సవరణ చట్టం ద్వారా 27 బ్యాంకులను 12 గ్రూపులుగా మార్చారు. అక్రమ లావాదేవిలతో అధిక ఆదాయాన్ని ప్రకటించిన అదాని కార్పొరేట్‌పై అమెరికా సంస్థ హిండెన్‌ బర్గ్‌ సంస్థ చేసిన పరిశోధనలను పార్లమెంట్‌లో చర్చించడానికి మోడీ ప్రభుత్వం నిరాకరించింది. ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం రాజ్యాంగ విరుద్ధంగా కొనసాగిస్తున్నది. ఒకే భాష, ఒకే సంస్కృతి, ఒకే టారిప్‌, ఒకే ఛానల్‌ పేరుతో విద్యా విధానాన్ని, విద్యుత్‌చ్చక్తిని, మీడియాను కేంద్రం అదీనంలోకి తీసుకుంది. త్రిశూలం పేర ఈడి, ఐటి, సిబిఐ సంస్థలతో ప్రతిపక్షాలపై దాడులు సాగిస్తున్నది. ప్రతిపక్ష పార్టీల ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నది. అక్రమంగా ఉపాచట్టం కింద మేధావులను అరెస్టు చేయడమేకాక, తమకు వ్యతిరేకంగా రాసిన 60 మంది జర్నలిస్టులను హత్యలకు గురయ్యారు. న్యూస్‌ క్లిక్‌ సంస్థ ఎడిటర్‌ ప్రబీర్‌ పురకాయస్తను జైళ్లో పెట్టారు. రాష్ట్రాల హక్కులను కాజేసే విధంగా రాజ్యాంగ చట్ట సవరణలు చేశారు.
పౌరసత్వ సవరణ చట్టం చేసి అప్ఘానిస్తాన్‌, బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌ నుంచి వచ్చిన ముస్లిమేతరులకు పౌరసత్వ హక్కులు అమలు చేస్తున్నారు. ముస్లింలకు గల రిజర్వేషన్లను రద్దు చేస్త్తామని చెబుతున్నారు. ఇప్పటికే దళిత, గిరిజన, మహిళా ఇతర మైనార్టీలపై భౌతిక దాడులకు దిగుతున్నారు.మోడీ మళ్లీ వస్తే ముస్లిం పర్సనల్‌లాను రద్దు చేయడంతో మైనార్టీలతో పాటు ఎస్సీ,ఎస్టీ, ఇతరులకు కల్పించే రిజర్వేషన్‌ హక్కులను కూడా రద్దు చేస్తారు. పార్లమెంట్‌ను రాజ్యాంగబద్దంగా నిర్వహించ కుండా బిల్లులన్ని మూజువాణి ఒటుతో అంగీకరింప చేసుకున్నారు. పార్లమెంట్‌ సమావేశ కాలాన్ని సగానికి కుదించారు. మూడోసారి బీజేపీ అధికారానికి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేసి, అధ్యక్షతరహా పాలన తేస్తామని ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారం చేస్తున్నది. గవర్నర్ల వ్యవస్థ ద్వారా బీజేపీయేతర రాష్ట్రాలలోని శాసనసభలలో ఆమోదించిన బిల్లులను ఆమోదించకుండా పెండింగులో పెట్టారు. తమిళనాడు, కేరళ, తెలంగాణ సుప్రీం కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ గవర్నర్ల వ్యవస్థలో ఎలాంటి మార్పు రాలేదు. ఎన్నికల కమిషన్‌ ఏర్పాటుకు ప్రధాని ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు జడ్జితో కలిసి త్రిసభ్య కమిటీ రికమండేషన్‌ చేయాల్సి ఉండగా సుప్రీంకోర్టు జడ్జిని తొలగించి కేంద్ర కేబినెట్‌ మంత్రితో త్రిసభ్య కమిటీ వేసి ప్రస్తుత ఎన్నికల కమిషన్‌ను రికమండ్‌ చేసి భారత అధ్యక్షునిచే ఆమోదింపజేసుకున్నారు.
ఐదు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ
దేశాన్ని 2025 నాటికి 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ కలిగే విధంగాను ప్రపంచంలో 3వ ఆర్థిక వ్యవస్థగాను తెస్తామని ఆర్‌ఎస్‌ఎస్‌ నేతృత్వ బీజేపీి నిరంతరం ప్రచారం చేస్తున్నది. ప్రపంచంలో 1వ స్థానంలో అమెరికా 26 ట్రిలియన్‌ డాలర్ల జీడీపీతో, 2వ స్థానంలో చైనా 17.57 ట్రిలియన్‌ డాలర్లతో, 4.23 ట్రిలియన్‌డాలర్లతో జర్మనీ, 4.21 ట్రి.డాలర్లతో జపాన్‌ దేశాలు ఉన్నాయి. ప్రస్తుత దేశ ఆర్థిక వ్యవస్థ 3.7 ట్రిలియన్‌ డాలర్లుతో 5వ స్థానంలో ఉంది. 3, 4 స్థానాలను అధిగమించ లేని దేశ ఆర్థిక పరిస్థితి 2వ స్థానంలోని చైనా ఆర్థిక వ్యవస్థకు చేరుకోగలమా? అయినా మోడీ ప్రభుత్వం కుహానా ఆర్థికవేత్తల ద్వారా 3వ స్థానానికి ఎదగగలమని ప్రచారం చేస్తున్నది. తలసరి ఆదాయంలో ప్రపంచంలో 120 స్థానంలో ఉన్నాం. కానీ జనాభాలో మొదటి స్థానంలో ఉన్నాం.
ఆర్థిక వ్యవస్థను చక్కదిద్ద డానికి అంగీకరించని బీజేపీ ప్రభుత్వం మతోన్మాద చర్యలను రెచ్చగొట్టి ప్రజలలో విభజనలు తెస్తున్నది. 5 వందల సంవత్స రాల పోరాట ఫలితంగా రామజన్మ ప్రాణప్రతిష్ట జరపడానికే వేల కోట్ల రూపాయలు వ్యయం చేసినట్లు చెబుతున్నారు. మతాల మద్య ఘర్షణ సృష్టించి 3వ సారి గెలవడానికి ఎన్నికల గ్యారంటీలను ప్రచారం చేస్తున్నది. పదేండ్ల అనుభవం తరువాత ‘మోడీ గ్యారంటీలు’ అభూతకల్పనలేనన్న అభిప్రాయానికి వచ్చిన ఓటర్లు ప్రస్తుత బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లువేస్తారని గమనించాలి.
సారంపల్లి మల్లారెడ్డి
9490098666

Spread the love