వచ్చారు సరే.. తెచ్చిందేమిటి…?

They came ok.. what did you bring...?సారొచ్చారు.. అలా వచ్చి ఇలా వెళ్లారు. త్వరలోనే ఆయన మళ్లీ వస్తారు. ఎందుకంటే ఇది ఎన్నికల సీజన్‌ కాబట్టి. కానీ ఆయన ఎన్నిసార్లు రాష్ట్రానికి వచ్చినా ఇప్పటిదాకా మనకేం ఇచ్చారో, భవిష్యత్‌లో ఏం ఇవ్వబోతారో చెప్పరు గాక చెప్పరు. ఎందుకంటే ఇప్పటిదాకా ఇచ్చిందే లేదు. మున్ముందు ఇవ్వబోయేది కూడా ఏమీ ఉండదు కాబట్టి. మోడీ తాజాగా మెతుకు సీమకు వచ్చారు. త్వరలో వరంగల్‌, వేములవాడ, మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌లో కూడా ఆయన పర్యటించనున్నారు. ఎలక్షన్ల క్యాంపెయిన్‌ సందర్భంగా రాష్ట్రానికి ఆయన రావొచ్చును, పోవచ్చును, తన పార్టీ తరపున ప్రచారం చేసుకోనూ వచ్చును. కానీ గత పదేండ్ల నుంచి గద్దె మీద కూర్చున్న పార్టీగా బీజేపీ తెలంగాణకు ఏం చేసింది? ఏమిచ్చిం దనేది చెప్పటం ప్రధానిగా ఆయన కనీస బాధ్యత, ధర్మం. కానీ పొద్దున లేస్తే దేశం కోసం.. ధర్మం కోసమంటూ ఊకదంపుడు ఉపన్యాసాలతో ఊదరగొట్టే ఆ పెద్ద మనిషి…తన కర్తవ్యాన్ని, బాధ్యతను విస్మరించారు. మరోసారి రాష్ట్ర ప్రభుత్వంపైనా, ముఖ్యమంత్రి రేవంత్‌ పైనా విమర్శలు గుప్పించేందుకే పరిమితమయ్యారు. ‘ఆర్‌ఆర్‌ (రేవంత్‌ రెడ్డి) ట్యాక్స్‌’ అంటూ సరికొత్త పదాన్ని జనం మీదికి వదిలి, తన తప్పిదాల గురించి ‘తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ…’ అనే లెవల్లో ఫోజుకొట్టారు. షరా మామూలుగా ముస్లింలకు సంబం ధించిన రిజర్వేషన్లపై మరోమారు తన అక్కసును వెళ్లగక్కటమనేది ఆ అంశంపై బీజేపీ విధానాన్ని తేటతెల్లం చేసింది.
దేశవ్యాప్తంగా ఇటీవల చర్చనీయాంశమైన అంశం ఎలక్టోరల్‌ బాండ్లు. ఈ రూపేణా వచ్చిన ఫండులో సగానికి (రూ.8,268 కోట్లు) పైగా కాషాయ పార్టీ ఖాతాలోకే వెళ్లాయన్నది దేశ ప్రజలందరికీ తెలిసిందే. అలా ఇవ్వని కంపెనీలపై ఈడీ, సీబీఐ, ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ అధికారులతో దాడులు చేయించింది ఆ పార్టీ. ఈ దాడులు జరిగిన మరుసటి రోజే కమలం ఖాతాలోకి అప్పనంగా సొమ్ములొచ్చి పడ్డాయనేది ప్రజలందరికీ తెలుసు. దీన్నిబట్టే బీజేపీకి, కార్పొరేట్‌ సంస్థలకు మధ్య ఎంత బలమైన బంధముందో విదితమవుతున్నది. ఇలాంటి వాస్తవాలన్నింటినీ మరుగుపరిచి, మసిపూసి మారేడుకాయ చేయటం మోడీకే చెల్లింది. ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ రూపంలో హస్తం పార్టీకి కొందరు గుత్తేదారులు వెనుక దర్వాజా ద్వారా నుంచి సొమ్ములు పంపుతున్నారన్నది ఆయన మెదక్‌లో చేసిన ఆరోపణ.
ఆ రకంగా వచ్చిన డబ్బు సంచులను ఆర్‌ఆర్‌ ఢిల్లీకి (కాంగ్రెస్‌ అధిష్టానం) పంపుతున్నారనేది పీఎం వాదన. ఈ ఆరోపణలు, వాదనల గురించి మాట్లాడాల్సి వస్తే… అసలు గత పదేండ్ల నుంచి కమలం పార్టీ చేసిందేమిటి..? సంపన్నులకు, పారిశ్రామికవేత్తలకు లక్షల కోట్ల మేర రాయితీలిచ్చి కార్పొరేట్ల గరిసెలను నింపింది మోడీ కాదా..? ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ అంటూ ఎద్దేవా చేస్తున్న ఆయన ‘ఒకే దేశం-ఒకే పన్ను’ పేరిట జీఎస్టీని తీసుకొచ్చి చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతీ సరుకు మీద పన్ను విధించింది వాస్తవం కాదా…? జీఎస్టీ ద్వారా వచ్చే పన్నులో 64 శాతం పేదలు, మధ్య తరగతి ప్రజానీకం నుంచే వసూలవుతుండగా, కేవలం మూడు శాతం మాత్రమే దేశంలోని టాప్‌ పది మంది ధనవంతుల నుంచి వస్తోన్నట్టు ఆక్స్‌ఫామ్‌ తన నివేదికలో స్పష్టం చేసింది. ‘కమల నాథులు’ మాత్రం దీనిపై నోరు విప్పరు గాక విప్పరు.
అదే మెదక్‌ సభా వేదిక నుంచి రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న అంశాలు, హామీల గురించి ప్రస్తావించని ప్రధాని… మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు మాత్రం శతవిధాలా ప్రయత్నించారు. అసందర్భ ప్రేలాపనలాగా… ‘ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను నేను బతికున్నంతకాలం ముస్లింలకు ఇవ్వబోను…’ అని బల్లగుద్ది మరీ చెప్పటం దేనికి సంకేతం. ఆయన అలా చెప్పటం ద్వారా దేశ ప్రజలకు ఏం సందేశం ఇవ్వదలిచారు…? ఆ రిజర్వేషన్లకు సంబంధించి గతంలో సుప్రీంకోర్టు తీర్పులు, వివిధ కమిషన్ల సిఫారసులు, వీటన్నింటికీ మించి అత్యున్నతమైన రాజ్యాంగం, దాని దిశా నిర్దేశంలో నడిచే పార్లమెంటు… ఇలా అనేక వ్యవస్థలున్నప్పుడు వాటిని కాదని ఓట్ల కోసం ఏకోన్ముఖంగా అడ్డగోలు వ్యాఖ్యలు చేయటం ప్రధానికే చెల్లింది.
ఇలాంటి టక్కుటమారా గజకర్ణ గోకర్ణ విద్యలకు చైతన్య వంతమైన తెలంగాణ సమాజం లొంగబోదనే విషయాన్ని బీజేపీ పరివారం గ్రహిస్తే మంచిది. సాయుధ రైతాంగ పోరాట వారసులుగా ఆ చైతన్యాన్ని మనం ఇప్పుడు ప్రదర్శించాల్సిన తరుణం ఆసన్నమైంది.

Spread the love