చెరువులను కాపాడుకుందాం

Editorial ‘నీరు సమస్త ప్రకృతికి చోదక శక్తి’ అనే నానుడి అందరికి తెలిసే ఉంటుంది. అంత ప్రాధాన్యత కలది నీరు. రాష్ట్రంలో చెరువులు, జలశాయాల పరిరక్షణపై మరోసారి ఉన్నతన్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. పటిష్టమైన చర్యలు తీసుకోవడం ద్వారా భూఆక్రమణలను అడ్డుకోవడంతోపాటు తాగునీటి అవసరాలు తీరేలా వ్యవస్తీకృత మార్పులు అవసరమని వ్యాఖ్యానించింది. హైదరాబాద్‌ నగర శివార్లల్లోని జల్పల్లి, ఉమ్డాసాగర్‌తో పాటు ఇతర చెరువుల పరిరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలంటూ సర్కారుకు హైకోర్టు నోటీసులిచ్చింది. మెట్రో ప్రాజెక్టు రావడం, భూముల ధరలు పెరగడంతో చెరువులపై దురాక్రమణ దారుల కన్నుపడిందనీ, వాటిని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాని దేనంటూ కర్తవ్యభోధ చేసింది. నీటి వనరుల ఆక్రమణ సామాజిక దురాచారమంటూ వ్యాఖ్యానించింది. చెరువుల పరిరక్షణను అలక్ష్యం చేస్తే పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను ఉల్లంఘించడమేనని పేర్కొంది. రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్‌ చైర్మెన్‌ చెరువులపై రాసిన లేఖను ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్‌)గా స్వీకరించిన హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. హైకోర్టు చేసిన కీలక కామెంట్లు చెరువుల ప్రాధాన్యాన్ని చెప్పకనే చెబుతున్నాయి.
నిజానికి చెరువుల చరిత్ర అంతా ఇంతా కాదు. వీటి నిర్మాణం శాతవాహనుల కాలం నుంచే ఉంది. కాకతీయులు దీన్ని మరింతగా ప్రొత్సహించారు. దీంతో రామప్ప, పాకాల, లక్నవరం, ఘనపురం, బయ్యారం తదితర ప్రాచీన చెరువులు నేటికి మనుగడలో ఉన్నాయంటే వారి పుణ్యమే. కాకతీయుల సంప్రదాయాన్ని కుతుబ్‌షాహీలు, ఆసఫ్‌జాహీలు సైతం కొనసాగించారు. కాగా ప్రస్తుతం పరిస్థితులు మారాయి. ఆధునికకాలం. అడుగడుగునా సాంకేతికత పెరుగుతున్న సమయం. అనేక అంశాల్లో తీవ్రమైన మార్పులే చోటుచేసుకుంటున్న సందర్భం. సాధారణంగా చెరువులు గ్రామీణ ఉపాధి, పేదరిక నిర్మూలన, వ్యవసాయాభివృద్ధికి తోడ్పాటు నందిస్తాయనడంలో సందేహామే లేదు. గత ప్రభుత్వాలు చెరువుల నిర్వహణపై నిర్లక్ష్యంగా ఉండటంతో ఇక్కట్లు తప్పడంలేదు. వాటి బాగోగులను పట్టించుకోక పోవడంతో ఆ ప్రభావం పలు రూపాల్లో ప్రజలపై పడుతున్నది. జీవన ప్రమాణాలు పడిపోవడానికి కారణమవుతున్నది. చెరువుల నిర్వహణా వ్యవస్థలు సరిగ్గా లేక చెత్తాచెదారం పేరుకుపోవడం, ఆక్రమణలకు గురికావడంతో అవి ధీనస్థితికి చేరాయి. ఆక్రమణకు గురికావడమే గాక భూగర్భజలాలు తగ్గిపోవడంతో పాటు సాగు, తాగునీటి ఎద్దడి తలెత్తుతున్నది. ఇది ప్రధానంగా సాధారణ గ్రామీణ ప్రజలు, రైతులు, వ్యవసాయ కూలీలు, ఇతరులపై అధికంగా ఉంటున్నది. ఇది ఇటు ప్రభుత్వాలు,అటు ప్రజలకు గుదిబండగా మారుతున్నది. సర్కార్లు చెరువులు, జలాశాయాల్లో పూడికతీత పనులు చేయక పోవడమూ ఇబ్బందులకు మూలమే. కోట్లాది రూపాయలు ఖర్చుపెట్డినా ఫలితాలు సున్నానే. దీంతో గ్రామాలు కరువు నిలయాలుగా అవతారమెత్తాయి.
కరువు గ్రామీణ పేదల జీవితాలను చిధ్రం చేస్తున్నది. రైతుల ఆత్మహత్యలు వలసలు, విపరీతంగా జరుగుతు న్నాయి. ఇటు దేశంలోనూ, అటు గల్ఫ్‌ దేశాలకు కార్మికులు, కూలీలు వలసెళ్తున్నారు. రాష్ట్రంలో అధికారిక లెక్కల ప్రకారం 46,531 చెరువులున్నాయి. వీటిలో వేలాది చెరువుల ఎఫ్‌టీఎల్‌ను పాతరేసి భూబకాసురులు ఆక్రమించుకున్నారు. ఆయా చోట్ల ఇండ్లు వెలుస్తున్నాయి. ఇంకొన్ని చోట్ల రోడ్లు వేస్తున్నారు. ఎవరికివారే యమునా తీరే అన్నట్టుగా ఉంది పరిస్థితి.
మిషన్‌ కాకతీయ పేరుతో బీఆర్‌ఎస్‌ సర్కారు హడావిడి చేసి రూ.వేల కోట్లు కుమ్మరించి కొంత పూడిక తీసినా, ప్రయోజనం అంతంతే. కార్యకర్తలకు ప్రజాధనాన్ని ఫలహారంగా బిల్లుల రూపంలో పంచి రాజకీయ లబ్ధి పొందారే తప్ప, సాధారణ పేదలకు ఒరిగిందేమీ లేదు. దీంతో భూగర్భజలాలు అధ:పాతాళానికి పడిపోయాయి. అది వర్షాభావ పరిస్థితులు ఏర్పడి కరువుకు మార్గం సుగమమం చేస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల్లో పగుళ్లురావడం, సీపేజీలు ఏర్పడటంతో గత ఏడాది సెప్టెంబరులో చినుకుల పలకరింపు ఆశించినంతగా లేకపోవడం తెలిసిందే. చెరువులను చెర బట్టే అక్రమార్కులపై క్రిమినల్‌ కేసులు పెట్టి కఠినంగా శిక్షించకపోతే తప్పిదం సర్కారుదే అవుతుంది. తాజా నిర్ణయాల మూలంగా జలాశయాల్లో పూడిక తీత వ్యవహారాన్ని చక్కబెట్టేందుకు వెళ్లారు. రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ అధికారులు రాజస్థాన్‌లో అధ్యయనానికి వెళ్లారు. వచ్చిరాగానే తాగు, సాగునీటి వనరులను బాగుచేసి నీటిని ఒడిసిపట్టే ప్రాథమిక బాధ్యత వారితోపాటు సర్కారుది. ఈ గ్రహం మీద మాయాజాలం అంటూ ఉంటే, అది నీటిలోనే అనేది వేరేగా చెప్పాలా!

Spread the love