కల్తీ.. కల్తీ!

Forgery.. Forgery!‘కొద్దికొద్దిగా మనం కోల్పోతాం, ఆరోగ్యాన్నీ, ఆయువును, తాజా తాజాగా కనపడే ఆహార పదార్థాల మెరుపు సోయగాల వలలకు, కొద్ది కొద్దిగా మన దేహాలను విడిపోతాం’ ఇది కల్తీలపై కవిత్వం పంక్తి. నిజంగా మనం కొద్ది కొద్దిగానే కోల్పోతున్నాం. ఎవ్వరమూ దీనిపై బెంగపడటం లేదు. రందీ లేదు, రాద్ధాంతమూ లేదు. మన యోగక్షేమాల కోసం నిరంతరం పనిచేస్తున్న ప్రభుత్వాలకూ దీనిపై పెద్ద పట్టింపూ లేదు. ఇంతకన్నా జాతీయ అంతర్జాతీయ, శాస్త్ర సాంకేతిక అంశాలు పెద్దవేవో వాటి కుంటాయి కదా. వాటికోసం తలమునకలై వుంటారు వారు. పోతే వ్యక్తులుగా పోతాం. వ్యవస్థ కదా ముఖ్యం అంటారు వాళ్లు. వ్యవస్థలో మనుషులుంటారో లేదో ఆ నాయక మన్యులకే తెలియాలి మరి! మొత్తానికి కల్తీ మాత్రం మన ఆహారానికి మాత్రమే పరిమితమైపోలేదు. అది ప్రభుత్వ విధానాలకు, రాజకీయాలకు, వారి చిలక పలుకులకూ ఎగబాకి ఇక అందులోంచి బయటపడలేనంతగా విస్తరించింది. కుడితిలో పడ్డ ఎలుకలా, కల్తీలో పడ్డ మనుషులమై కొట్టుకుంటున్నాము. తిండి కల్తీ, తీపి కల్తీ, మాట కల్తీ, మనసు కల్తీ, పాలు కల్తీ, నీళ్లు కల్తీ, గాలి కల్తీ, మందు కల్తీ, విందు కల్తీ, కల్తీ కానిదేమున్నది?
‘స్వచ్ఛభారత్‌’ అని ఎంత గొప్పగా గాంధీబొమ్మను వేసి పిలుపునిచ్చామో! పాపం ఆ గాంధీని చంపినట్లే స్వచ్ఛతనూ చేశాం. స్వచ్ఛత అట్లా ఉంచండి, స్వస్థత కూడా గాలికొదిలేసాం. ప్రజల ప్రాణాలంటే ఎంత తేలికయి పోయింది! ప్రజలు బతకటం కోసం, ఆరోగ్యంగా జీవించడం కోసం, ఆహారం తీసుకుంటారు. ఇక అనారోగ్య భారిన పడితే ఔషధాలను వేసుకుం టారు. ఇవి రెండూ కల్తీగా మారి పోయాక జనం ఇంకేం చేస్తారు. కొద్దికొద్దిగా కోల్పోవడం తప్ప. యూరియా, కాస్టిక్‌ సోడా, కూరగాయల నూనెల వంటి హానికరమైన పదార్థాలను కలిగివున్న సింథటిక్‌, పాలతో పాలను కల్తీ చేసాక అల్సర్లు, క్యాన్సర్లు, కిడ్నీలు పోవడాలు తప్ప ఇంకేం జరుగుతుంది! తాజాగా కూరగాయలు కనపడేందుకు సింథటిక్‌ షీన్‌తో, స్ప్రేలతో, సిలికాన్‌లో, ఆక్సిటోసిన్‌తో కార్బైడ్‌లతో ముంచెత్తాక, ఆరోగ్యం కుళ్లి కంపు కొట్టదూ!
సిటీ కల్చర్‌ మాత్రమే కాదు, ఈరోజు పట్టణాలు, ఊర్లలోకి కూడా హోటళ్లు కర్రీ పాయింట్‌లు విరివిగా వచ్చేసాయి. అందుల్లో కలర్‌ఫుల్‌గా నోరూరించే వంటకాలతో ఎన్నిరంగులు, రసాయనాలు పొట్ట నిండుతు న్నాయో! సిటీ మార్కెట్లలో కూరగాయలు చూడండి నిగనిగలాడతాయి, పండ్లు అంతే! వ్యాక్స్‌ లేకుండా యాపిల్‌ దొరుకుతుందా! క్రిమ్సన్‌ రంగుతో పుచ్చకాయలు ఎంత ఎరుపుతో దర్శనమిస్తాయో! ఆఖరికి కొబ్బరి బోండాలకూ, చెట్లకూ సూదిమందులిచ్చాక, మన ఆరోగ్యానికిక సూదిమందు అవసరముండదు. బియ్యానికి పాలిష్‌, పప్పులకు రంగు, టీపొడిలో కలిసే పొడులెన్నో.., ఇక నూనెలు రసాయన సమ్మేళనాలే కదా! జంతుచర్మాల భట్టీల దందాలనెన్ని సార్లు పట్టుకోలేదు! ఇవన్నీ మీకందరికీ తెలుసు. కానీ వీటిని అరికట్టే ప్రభుత్వ యంత్రాంగం ఏమి చేస్తున్నట్టు?
ఇవన్నీ పక్కన పెడితే, ఇంకో భయంకర విషయం ఫార్మా కంపెనీలు చేస్తున్న కల్తీ. దీని గురించి పెద్దకథే రాయొచ్చు. కానీ ఒక్క కథే చెబుతాను. కోవిడ్‌కాలంలో ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌, బీహార్‌ ఆసుపత్రులలో కరోనా లక్షణాలతో వచ్చి చేరిన రోగులకు ‘రెమిడెసివిర్‌’ అనే కాడిలా కంపెనీ మందును ఇచ్చారు. రోగులు మరింత అస్వస్థతకు గురై చనిపోవటం జరిగింది. వైద్యులు ఫిర్యాదు చేశారు. ఇక్కడ వాడటానికి ముందే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లూ.హెచ్‌.ఓ) వాడకూడదనీ చెప్పింది. అయినా ప్రభు త్వాలు పట్టించుకోలేదు. కనీసం మన ల్యాబ్‌ల్లో పరీక్షా చేయలేదు. ఆ ఫార్మా కంపెనీపై ఎలాంటి చర్యా తీసుకోలేదు. కానీ కేంద్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్న పార్టీ మాత్రం ఆ కంపెనీ నుంచి రూ.18 కోట్లు ఎన్నికల బాండ్ల రూపంలో చందామాత్రం తీసుకున్నది. ఇదొక్కటే కాదు, అనేకమైన, ఫార్మా కంపెనీలు కల్తీ మందులతో ప్రజల ప్రాణాలకు ముప్పును తెస్తున్నాయి. వీటిని అరికట్టాల్సిన ప్రభుత్వాలు స్వార్థపూరితంగా నిర్లక్ష్యం వహిస్తున్నాయన్నది వాస్తవంగా కనపడుతున్న సత్యం. అంటే ఎన్నికల బాండ్లు కేవలం ఎన్నికలకు సంబంధించినవే కాదు. అవి మన జీవితాలకూ, ప్రాణాలకూ సంబంధమున్న వని గుర్తించాలి.
ఇక మన ప్రభుత్వాల అలసత్వానికి నిదర్శనంగా అంతర్జాతీయ కంపెనీలూ దేశప్రజల ఆరోగ్యాన్ని గంగలో కలుపుతున్నాయి. పసిపిల్లల ఆహార పదార్థాలను, సిర్‌లాక్‌ మొదలైనవి తయారు చేసే నెస్లే కంపెనీ, మన లాంటి పేద, మధ్య తరగతి దేశాల పిల్లలకు అమ్మే ఉత్పత్తుల్లో కృత్రిమ తీపిని కలిపి (యాడెడ్‌ సుగర్‌) సరఫరా చేస్తోంది. ఇది పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. వివక్షతేమంటే, యూరప్‌కు అమ్మే ఉత్పత్తిలో యాడెడ్‌ సుగర్‌ను జోడించడం లేదు. మరి ప్రభుత్వం భావితరాల ఆరోగ్యాల్ని గాలికొదిలేసిందా! ఎవరు అడ్డుకట్టవేయాలి? పాలకులకు బాధ్యత లేదా? ప్రజల ఆరోగ్యం కోసం ప్రజలే ప్రశ్నించాలి.ప్రభుత్వాలను నిలదీయాలి.

Spread the love