విద్వేష ‘గ్యారంటీ’

Hate 'Guarantee'వ్యూహాలు, ఎత్తుగడలు ఫలించనప్పుడు సహనం కోల్పోతారు. భావదాడికి బదులు భౌతిక దాడికి దిగుతారు. యుద్ధాలకు కత్తులు నూరుతారు. అల్లర్లు సృష్టిస్తారు. మతం రంగు పులుముతారు. అన్యాయంతో రాజ్యమేలు తారు. మోడీ విద్వేష ప్రసంగాలను చూస్తే దేశంలో అలాంటి పరిస్థితి కొట్టచ్చినట్టు కనిపిస్తున్నది. ‘మోడీ గ్యారంటీ’ పేరుతో మూడోసారి అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూరుతున్న ప్రధాని విద్వేషమే ఎజెండాగా ప్రచారంలో ‘దూసుకెళ్తున్నారు.’ ఎవరైనా తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూపుతూ ముందుకు సాగుతారు. కానీ మోడీ మాత్రం దీనికి పూర్తి భిన్నం. ప్రజల మధ్య విద్వేషాలు పెంచడం, ప్రాంతాల ఐక్యతను దెబ్బతీయడం, మతాల పేరుతో చిచ్చుపెట్టడం! ఇంతకన్నా మోడీ- పరివారం ఏదైనా చేస్తే కదా చెప్పుకోవడానికి, ప్రజలకు వివరించడానికి?
ఇటీవల రాజస్థాన్‌లో ఎన్నికల సభలో పాల్గొన్న మోడీ ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే దేశ సంపదను ముస్లింలకు పంపిణీ చేస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆ పార్టీ నాయకులు అర్బన్‌ నక్సల్స్‌ మనస్తత్వం గలవారని ‘మన తల్లులు, సోదరిమణుల మెడలోని మంగళసూత్రాలను కూడా వదలరు’ అని అన్నారు. అంతటితో ఆగకుండా కాంగ్రెస్‌ వామపక్షాల కబంధ హస్తాలలో చిక్కుకుందని, దాని మెనిఫేస్టో అతి ప్రమాదకరంగా ఉందని వ్యాఖ్యానిం చారు. ఒక ప్రధాని ఎన్నికల సభలో మాట్లాడాల్సిన తీరు ఇదేనా? దేశంలో అత్యధిక మెజార్టీగల హిందువుల సంపదను ముస్లింలు ఏదో కాజేస్తారన్నట్టుగా మాట్లాడటం, వారిని శత్రువులుగా చిత్రీకరించడం చూస్తుంటే విద్వేషం తారాస్థాయికి చేరిందనడానికి ఇదో తార్కాణం.ఇది ఆయన నిరాశ నిస్పృహలకు నిదర్శనం.
పదేండ్లపాటు దేశాన్ని పాలించిన మోడీ తాను ప్రజలకు చేసిన అభివృద్ధి ఇది అని సూటిగా చెప్పలేక పోతున్నాడు. పెరిగిన నిరుద్యోగం, పెచ్చుమీరిన అసమానతలు, మణిపూర్‌ మంటలు, పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ భారం, వ్యవసాయ నల్లచట్టాలు, కార్మికుల శ్రమదోపిడీ, కార్పొరేట్లకు రాయితీ, ప్రభుత్వరంగ సంస్థల ప్రయివేటీకకరణ, ఇలా చెప్పుకుంటూపోతే మోడీ పాలనలో వైఫల్యాలే అన్నీ. అందుకే ఇండియా కూటమి నేతలు బీజేపీ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల మధ్య ఐక్యత, లౌకికతత్వం, సామరస్యతను పెంచేందుకు పోరాడుతున్నారు. వారిలా ముందుకు సాగితే నాలుగు వందల సీట్ల కల కల్ల అవడం ఖాయమనే భావనతో మోడీ మతాన్ని అడ్డం పెట్టుకుని సెంటిమెంట్‌ను రెచ్చగొడుతున్నాడు. ఆయన విద్వేషపూరిత ప్రసంగాల ధోరణి వెనుక ఉన్న ఎజెండా అంతా కూడా ఇలాగే ఉన్నది. ఇది మన రాజ్యాంగ స్ఫూర్తి, ఎన్నికల నిబంధనావళి, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకూ కూడా పూర్తి విరుద్ధం. ప్రధాని స్థాయిలో ఉన్న నేత స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను పెంపొందించాల్సింది పోయి విద్వేషపు పునాదులపై ‘సార్వత్రిక’ సమరం చేయడం పూర్తి అప్రజాస్వామిక చర్య.
మోడీకి ఒక ప్రాంతం, ఒక రాష్ట్రం, ఒక చోటు అనే తేడా ఏమీ లేదు. ఎక్కడ ప్రచారంలో పాల్గొన్నా మత ఆధారితంగానే మాట్లాడుతున్నాడు. విపక్షాలను టార్గెట్‌ చేస్తూ బీజేపీకి మతం ఒక రాజకీయ అస్త్రంగా ఉపయోగిస్తున్నాడు. అది బీహార్‌ అయినా, రాజస్థాన్‌ అయినా, ఉత్తరప్రదేశ్‌ అయినా, ఇండియా కూటమిలో ఉన్న వాళ్లపైనే దాడి ఎక్కుపెట్టాడు. వాస్తవానికి అయోధ్య ప్రాణ ప్రతిష్ట కార్యక్రమ ఆహ్వానంపై సీపీఐ(ఎం) నేత సీతారాం ఏచూరి పూర్తి క్లారిటీ ఇచ్చారు. మత ప్రాదికన చేసే కార్యక్రమాలకు హాజరు కాబోమని చెప్పారు. అయినా కూడా విపక్షాలపై మోడీ ‘రామ బాణం’ ఓట్ల లబ్దికి కాకపోతే దేనికి సంకేతం?
‘మసీదులు, చర్చిలు, ఆలయాలు లేదా ఇతర ఆరాధనా స్థలాలను ఎన్నికల ప్రచారా లకు వేదికలుగా ఉపయోగించరాదు.’ అని ఎన్నికల ప్రవర్తనా నియమావళి పేర్కొంటోం ది. కానీ అయోధ్యలో రాముడికి గుడి కట్టించి, ప్రాణప్రతిష్ట చేసిన వారికే ఓటు వేయాల్సిం దిగా మోడీ తన ప్రసంగాల్లో ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది ఎన్నికల ప్రవర్తనా నియమా వళిని ఉల్లంఘించడమే. ఆవే చేలోకి దిగిన తర్వాత దూడలు రెచ్చిపోవా? ఇంతకాలం ఆధిపత్య హిందూత్వ కార్యచరణను చాపకింద నీరులా తీసుకెళ్లిన కాషాయ నేతలు నేడు బహిరంగంగానే మతపరమైన ఎజెండాతో ముందుకు సాగుతున్నారు. మొదటి దశకే మోడీ రెచ్చిపోవడం చూస్తే ఆయన, ఆయన పార్టీ ఫ్రస్ట్రేషన్‌ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. దేశ ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిన సమయ మిది. తేడా వస్తే గనుక మోడీ ప్రజలకిచ్చే ‘గ్యారంటీ’ భవిష్యత్తులో విద్వేషమేనన్న సంగతి మరువకూడదు.

Spread the love