చిత్తశుద్ది లేని బ్లింకెన్‌ పర్యటన

Editorial హాలీవుడ్‌ సినిమాల్లో అనకొండ మాదిరి చైనాను మింగివేయాలన్నంత కసి ఉంది.మాయ కొండచిలవల గురించి ఇతరులకంటే సృష్టించిన తమకే నిజానిజాలేమిటో తెలుసు గనుక అమెరికన్లు వాస్తవాలను మింగలేక కక్కలేకుండా ఉన్నారు. బీజింగ్‌తో పూర్తి స్థాయి పోరుకు దిగితే కొన్ని అమెరికా కార్పొరేట్లకు కోపం, లేకపోతే మరికొన్నింటికి ఆగ్రహం.పెట్టుబడిదారీ వ్యవస్థ చరిత్రలో ఇలాంటి పరిస్థితి గతంలో లేదు. శ్వేతసౌధంలో గాడిద(డెమోక్రాట్లు)-ఏనుగు(రిపబ్లికన్లు) పార్టీ నేతలు ఎవరున్నా దారీ తెన్నూ తేల్చుకోలేని డోలాయమానంలో పడ్డారు. పర్యవసా నాలను ఊహించలేక డోనాల్డ్‌ ట్రంప్‌ 2018లో చైనాతో ప్రారంభించిన వాణిజ్య పోరును గెలవలేక, గౌరవప్రదంగా ముగించలేక అమెరికా పాలకవర్గం సతమతమౌతున్నది. ఏం చేస్తారో చేసుకోండి అన్నట్లుగా చైనా తనపని తాను చేసుకుపోతున్నది. ఈ పూర్వరంగంలో శుక్రవారం వరకు జరిపే పర్యటన నిమిత్తం అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ బుధవారం నాడు చైనా గడ్డపై కాలుమోపాడు. రెండు దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా తమ భవిష్యత్‌ గురించి చైనాలో ఉన్న అమెరికా కంపెనీలు ఆందోళన వెల్లడిస్తూ ఈ సందర్భంగా ఒక నివేదికను వెల్లడించాయి. చైనా మార్కెట్‌ ఆకర్షణ వారిని అక్కడే ఉండాలని కట్టిపడేస్తున్నది. నవంబరులో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో నువ్వా నేనా అన్నట్లుగా జో బైడెన్‌-డోనాల్డ్‌ ట్రంప్‌ పోటీ పడుతున్నారు.తమ కార్పొరేట్లకు రాయితీలు సాధించేందుకు ఒక వైపు ఒత్తిడి మరోవైపు తెగేదాకా లాగేందుకు సిద్ధం కాని స్థితిలో బ్లింకెన్‌ పర్యటన సాధించేదేమీ ఉండదనే విశ్లేషణలు ముందే వెలువడ్డాయి. కాపురం చేసే కళ కాళ్ల గోళ్లపుడే బయటపడుతుందన్న సామెత మాదిరి తమ ఓటర్లను ప్రసన్నం చేసుకొనేందుకు తప్ప చైనాతో వివాద పరిష్కారానికి సిద్దంగా లేనట్లు బ్లింకెన్‌ పర్యటనకు ముందు అమెరికా చర్యలున్నాయి.చైనాతో అమీతుమీ తేల్చుకొనేందుకే ఉన్నాం అన్నట్లుగా కనిపించేందుకు రెండు ప్రధాన పార్టీలు చూస్తున్నాయని న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక పేర్కొన్నది. రెండు దేశాల మధ్య ఉక్రెయిన్‌ వివాదం, మధ్య ప్రాచ్య ఉద్రిక్తతలు, తైవాన్‌, దక్షిణ చైనా సముద్ర అంశాల మీద ఏకాభిప్రాయం లేదని ఎపి వార్తా సంస్థ విశ్లేషించింది. వీటిలో ఏ ఒక్కదాని మీద రెండుదేశాల మధ్య సయోధ్య కుదిరే అవకాశమే లేదు.
అమెరికా తప్పుడు అంచనాలు, వైఖరితో వివాదాలు మరింతగా పెరుగుతున్నాయి తప్ప తగ్గటం లేదు. నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరించినట్లుగా అమెరికా తీరు ఉంది.తాజాగా చైనా సముద్ర రవాణా,నౌకా నిర్మాణ సంబంధిత అంశాలపై దర్యాప్తు జర పాలని నిర్ణయించింది.రష్యాకు ఇస్తున్న మద్దతును ఉపసంహరించుకొనేందుకుగాను ప్రపంచ ద్రవ్య వ్యవస్థ నుంచి కొన్ని చైనా బాంకులను దూరం చేయాలన్న సూచనలను కూడా వెల్లడించింది. రష్యా పారిశ్రామిక పునాది పునర్‌నిర్మాణానికి, మిలిటరీ ఉత్పత్తులకు అవసరమైన చిప్స్‌ మొదలు ఖండాంతర క్షిపణులకు కావాల్సిన ఇంజన్లను చైనా సరఫరా చేస్తున్నదని అమెరికా ఆరోపిస్తున్నది. దక్షిణ చైనా సముద్ర వివాదం పేరుతో జపాన్‌, ఆస్ట్రేలియాలను ఫిలిప్పీన్సుకు మద్దతుగా సమీకరించేందుకు పూనుకున్నది. మానవ హక్కులపై తప్పుడు ప్రచారం, తైవాన్‌కు ఆయుధ సరఫరా సరేసరి. ఈ అంశాలపై అమెరికాకు ఓటమే తప్ప విజయం కనుచూపు మేరలో కనిపించటం లేదు. స్వజనాన్ని, బయటివారినీ ఎంతకాలమో మభ్యపెట్టే అవకాశమూ కనిపించకపోవటంతో ఒత్తిడి, గారడీలకు పాల్పడుతున్నది.
చైనా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోనుందని అమెరికా, ఇతర పశ్చిమదేశాల మీడియా, ఆర్థికవేత్తలు చెప్పిన జోస్యం ఒక్కటీ నిజమయ్యే దాఖాలు లేవు. ఒకవైపు పతనం కానుందని చెబుతూనే తమకు ప్రధాన పోటీదారుగా ఉందని, చైనాను అదుపు చేయాలని అమెరికా అంటున్నది. కూలిపోయేదానితో జగడమెందుకు? ఒక వైపు తమను అణచివేయాలని చూస్తున్న అమెరికా మరోవైపు తన పాటలకు అనుగుణంగా నృత్యం చేయాలని కోరుకుంటున్నదని ఇదెలా సాధ్యమని చైనా ప్రశ్నిస్తున్నది.ఆంక్షలతో నిమిత్తం లేకుండా రష్యాతో సహా అన్ని దేశాలతో తాము సాధారణ ఆర్థిక, వాణిజ్య సంబంధాలను కొనసాగిస్తామని, తమ హక్కుల్లో జోక్యం చేసుకోవద్దని పదే పదే స్పష్టం చేస్తున్నది. తమ మీద రుద్దిన వాణిజ్య, సాంకేతిక పరిజ్ఞాన బదిలీపై ఆంక్షలను ఎత్తివేయాలని, దక్షిణ చైనా సముద్రం, తైవాన్‌ అంశంలో జోక్యం చేసుకోవద్దని, ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలను పాటించాలని ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తున్నది. వీటి మీద రాజీపడేందుకు అమెరికా పాలకవర్గం సిద్ధంగా ఉందా ?

Spread the love