ఆ రెండు పోస్టులకు పోచారం, ఆకునూరి మురళి

– వ్యవసాయ కమిషన్‌ చైర్మెన్‌గా మాజీ స్పీకర్‌
– విద్యా కమిషన్‌ చైర్మెన్‌గా మాజీ ఐఏఎస్‌
– సీఎం రేవంత్‌ నిర్ణయం..అధిష్టానం ఆమోదముద్ర
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలో వ్యవసాయ కమిషన్‌, విద్యా కమిషన్లను ఏర్పాటు చేస్తామంటూ గతంలో ప్రకటించిన సీఎం రేవంత్‌.. అందుకనుగుణంగా చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. వాటికి చైర్మెన్లుగా ఆయా రంగాల్లో నిష్ణాణితులైన వ్యక్తులను నియమించాలని ఆయన యోచిస్తున్నారు. వ్యవసాయ కమిషన్‌కు మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డిని, విద్యా కమిషన్‌ చైర్మెన్‌గా మాజీ ఐఏఎస్‌ ఆకునూరి మురళిని ఎంపిక చేసేందుకు సీఎం ఇప్పటికే నిర్ణయించినట్టు సమాచారం. ఆ మేరకు ఆయన కాంగ్రెస్‌ అధిష్టానానికి సమాచారాన్ని చేరవేసి, ఒప్పించినట్టు తెలిసింది. ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్న ముఖ్యమంత్రి… పార్టీలో ఇటీవలి చేరికలు, అదే సమయంలో అంతర్గతంగా నెలకొన్న సమస్యలపై ఏఐసీసీ పెద్దలతో చర్చలు జరిపిన సంగతి విదితమే. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం పార్టీలో చేరిన మాజీ స్పీకర్‌, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించినట్టు సమాచారం. గతంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పని చేసిన ఆయన స్వయంగా వ్యవసాయదారుడనే విషయాన్ని రేవంత్‌ ఈ సందర్భంగా నొక్కి చెప్పారు. ఆయనకు ఆ రంగంలో ఉన్న అపార అనుభవం, రాజకీయంగా ఉన్న సీనియార్టీ రీత్యా మంత్రి పదవినిచ్చి గౌరవించాలనే భావన ఉన్నప్పటికీ…అదే ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా నుంచి ఎమ్మెల్యేగా ఉన్న సీనియర్‌ నేత సుదర్శన్‌రెడ్డిని కాదని, పోచారానికి మంత్రిపదవినవ్వటం నైతికంగా సరైంది కాదని సీఎం అభిప్రాయపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పని చేసిన సుదర్శన్‌రెడ్డి… తెలంగాణ వచ్చిన తర్వాత ప్రలోభాలకు లొంగకుండా కాంగ్రెస్‌నే అంటిపెట్టుకుని ఉన్నారని ఆయన గుర్తు చేశారు. అందువల్ల ఆయనకే మంత్రి పదవిని కట్టబెట్టాలని అధిష్టానాన్ని కోరారు. ప్రతిగా వ్యవసాయ కమిషన్‌ చైర్మెన్‌ పోస్టును పోచారానికి అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. దీంతోపాటు విద్యారంగంపై అపార అనుభవమున్న విశ్రాంత ఐఏఎస్‌ ఆకునూరి మురళిని విద్యా కమిషన్‌ చైర్మెన్‌గా నియమిస్తే ఆ రంగానికి న్యాయం జరుగుతుందంటూ సీఎం కాంగ్రెస్‌ అధిష్టానానికి వివరించారు. ఈ నేపథ్యంలో త్వరలోనే ఆయా కమిషన్లను ఏర్పాటు చేయనున్నారని ఉన్నతాధికారులు తెలిపారు.

Spread the love