– కేంద్రమంత్రి అమిత్‌షాకి ఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్ లేఖ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
కేంద్రప్రభుత్వం భారతీయ న్యాయ సన్నిహిత-2023లో డ్రైవర్లకు విధించే శిక్షలను ఉపసంహరించుకోవాలని ఆలిండియా రోడ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ (ఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్) ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం కేంద్ర హౌం మంత్రి అమిత్‌షాకు ఆయన లేఖ రాసారు. ఈ చట్టంలోని సెక్షన్ 104(1) మరియు (2) ప్రకారం రవాణారంగంలో పనిచేసే డ్రైవర్లకు భద్రత కరువై, చేయని తప్పిదాలకు సుదీర్ఘకాలం జైళ్లలో మగ్గవలసి వస్తుందని పేర్కొన్నారు. ఈ శిక్షలు ఏమాత్రం మానవత్వం లేని విధంగా ఉన్నాయనీ, అనుకోకుండా జరిగే రోడ్డు ప్రమాదాల వల్ల లారీ, ట్రక్కు డ్రైవర్లు శిక్షలకు గురై, వారి కుటుంబ సభ్యులు రోడ్డున పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాలకు శాస్త్రీయ ప్రమాణాలను నిర్దేశించకుండా, కేవలం డ్రైవర్లను మాత్రమే బాధ్యుల్ని చేయడం సరికాదన్నారు. రహదారుల భద్రత, సిగల్స్ ఏర్పాటు, రహదారి సూచిక బోర్డులు వంటి ఇతర భద్రతా చర్యలు ఏవీ తీసుకోకుండా, నేరాల్ని డ్రైవర్లపైకి నెట్టేసేలా ఈ చట్టంలో శిక్షలు ఉన్నాయని వివరించారు. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు ఉంటాయనీ, అక్కడి ప్రజలు డ్రైవర్లపై దాడులు చేస్తారనే భయంతో వారు పారిపోతారే తప్ప, నేరం నుంచి తప్పించుకొనేందుకు కాదని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం తక్షణం ఈ శిక్షల్ని ఉపసంహరించుకోవాలని కోరారు.