విస్తారంగా వర్షాలు

విస్తారంగా వర్షాలు– 715 ప్రాంతాల్లో వర్షపాతం నమోదు
– వచ్చే వారం రోజులు వానలే
– ఎల్లో హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ
– రిజర్వాయర్లలోకి ఇంకా చేరని నీరు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలో వచ్చే వారం రోజులపాటు విస్తారంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆదివారం ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు 715 ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. వికారాబాద్‌ జిల్లా తాండూర్‌లో అత్యధికంగా 5.28 సెంటీమీటర్ల వర్షం కురిసింది. జులై 7వ తేదీ వరకు రాష్ట్రంలో ఇదే తరహాలో వర్షాలు పడనున్నాయి. ఉత్తర ఒడిశా-గ్యాంగ్‌టక్‌ పశ్చిమ బెంగాల తీరాలకు ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతంపై ఏర్పడిన ఆవర్తనం తాజాగా తూర్పు జార్ఖండ్‌ ఆ పరిసరాల్లో సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. దీనివల్ల తెలంగాణలో కింది స్థాయి గాలులు పశ్చిమ, నైరుతి దిశల నుంచి వీస్తాయని అంచనా వేసింది. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉన్నాయనీ, దీనివల్ల భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొన్ని చోట్ల, ఆదిలాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసినట్టు వాతావరణ శాఖ వివరించింది. రానున్న వర్షాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఎల్లో హెచ్చరికలు జారీ చేస్తున్నట్టు తెలిపారు. అయితే హైదరాబాద్‌, ఆ పరిసర ప్రాంతాల్లోనూ తేలికపాటి నుంచి ఒకమోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. ఒక మోస్తరు వర్షాలు కురిస్తే వ్యయసాయానికి అనుకూలంగా ఉంటాయనీ, భారీ వర్షాలైతే నష్టం తప్పదని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు కొమరంభీం, మంచిర్యాల, కామారెడ్డి జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. అదే సమయంలో కరీంనగర్‌, సంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్‌, మహబూబాబాద్‌, ఖమ్మం, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌, సూర్యాపేట, హైదరాబాద్‌ జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. నారాయణ్‌పేట్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, గద్వాల్‌, నల్గొండ జిల్లాల్లో అధిక వర్షాలు కురిసినట్టు వ్యవసాయశాఖ తెలిపింది. మిగిలిన జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా వార్షిక సగటు వర్షపాతం 919.0 మిల్లీమీటర్లు కాగా, నైరుతీ రుతుపవనాల వల్ల ఇప్పటి వరకు 720.4 మి.మీ., వర్షపాత మోదైంది. ప్రస్తుత వర్షాకాలంలో ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 38,606 ఎకరాల్లో మాత్రమే వరినాట్లు వేశారు. జొన్నలు 19,870 ఎకరాలు, సజ్జలు 124 ఎకరాలు, మొక్కజొన్న 35,808 ఎకరాల్లో వేశారు. ఈ వారంలో కురిసే వర్షాలపైనే ఆయా పంటల భవిష్యత్‌ ఆధారపడి ఉంటుందని వ్యవసా యరంగ నిపుణులు చెప్తున్నారు. వర్షాలు సాధారణంగా కురిస్తే సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు వ్యవసాయశాఖ అంచనా వేస్తున్నది.
రాజధానిలో..
హైదరాబాద్‌కు తాగునీటిని అందించే రిజర్వాయర్లలో కూడా పూర్తిస్థాయి సామర్థ్యంతో నీరు లేదు. ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌, సింగూర్‌, మంజీరా, అక్కంపల్లి, నాగార్జునసాగర్‌, శ్రీశైలం, శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వాయర్ల పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 39.783 టీఎమ్‌సీలు కాగా, ప్రస్తుతం ఈ మొత్తం రిజర్వాయర్లలో 19.025 టీఎమ్‌సీల నీరు మాత్రమే నిల్వ ఉంది. గత ఏడాది ఇదే సమయానికి ఈ రిజర్వాయర్లలో 23.392 టిఎమ్‌సీల నీరు ఉన్నట్టు హైదరాబాద్‌ వాటర్‌బోర్డ్‌ అధికారులు తెలిపారు. భారీ వర్షాలు కురిస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించి, యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించింది. సహాయక బృందాలను అప్రమత్తం చేసింది. ఎక్కడైనా వాగులు, వంకలు పొంగితే తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించింది.

Spread the love