14 మంది సిబ్బంది సురక్షితం
మస్కట్ : ఒమన్ తీరంలో భారతీయ జెండాతో ప్రయాణం చేస్తున్న నౌక ప్రమాదానికి గురయింది. ఈ నౌకలో ఉన్న మొత్తం 14 మంది సిబ్బందిని రక్షించారు. ఈ విషయాన్ని ఒమన్‌లోని భారత రాయబార కార్యాలయం ఆదివారం వెల్లడించింది. ‘భారత జెండా కలిగిన ఎంఎస్‌వి విరాట్ 1 లో చేపట్టిన సహాయక చర్యలు విజయవంతంగా పూర్తయ్యాయి. నౌకలోని 14 మంది సిబ్బందిని రక్షించారు. సిబ్బంది క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నారు’ రాయబార కార్యాలయం ఒక సోషల్ మీడియా పోస్టులో తెలిపింది. రక్షించిన సిబ్బందిని ముంబయి వెళ్తున్న జబల్ అలీ 9 నౌకలోకి తరలించినట్లు తెలిపింది. ఇంజన్ వైఫల్యంతో ఎంఎస్‌వి విరాట్ 1 ప్రమాదానికి గురైనట్లు భావిస్తున్నారు. విరాట్ 1 50 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పు కలిగిన ఒక చిన్న నౌక. పర్షియన్ గల్ఫ్ దేశాలకు పరిమితంగా సామాగ్రిని, త్వరగా పాడైపోయే ఆహార పదార్థాలను తీసుకుని వెళ్లడానికి ఈ మార్గం చిన్న నౌకలు ప్రయాణం చేస్తుంటాయి. అయితే ప్రస్తుతం గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఈ ఘటన జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఒమన్ తీరంలోభారత్ నౌకకు ప్రమాదం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



