పేరుకుపోయిన చెత్త..?

పేరుకుపోయిన చెత్త..?– చుట్టూ అధికారులే..! అయినా పడకేసిన పారిశుద్ధ్యం .!
– బీఆర్‌ఎస్‌ మండల నాయకులు కొమ్ము వీరబాబు
నవతెలంగాణ-తిరుమలాయపాలెం
మండల కేంద్రంలో తిరుమలాయపాలెం గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి, కార్యదర్శిల అలసత్వం ఆ గ్రామ ప్రజల పాలిట శాపంగా మారింది. చుట్టూ అధికారులు ఉన్న మండల కేంద్రంలోనే పారిశుద్ధ్యం పడకేస్తే మిగతా గ్రామాల పరిస్థితి ఏంటా అనే సందేహాలు ప్రజల్లో లేకపోలేదు.! తిరుమలాయపాలెం గ్రామ వీధులలో చెత్త పేరుకుపోవడంతో స్థానిక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని వీధులో డ్రెయినేజీ వ్యవస్థ లేకపోవడంతో ఇండ్ల నుండి వచ్చే మురుగు నీరు రోడ్లపైకి చేరుతుందని, ఆర్‌ అండ్‌ బీ రోడ్ల పక్కన ఉన్న ఇండ్ల వారి పరిస్థితి దారుణంగా ఉందని, కాలువల నుండి వచ్చి దొమలతో డెంగ్యూ, మలేరియా రోగాల బారిన పడుతున్నామని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికార యంత్రాంగం వర్షాకాలంలో పారిశుధ్య నిర్వహణ పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ప్రత్యేక అధికారులు ఉన్నా కూడ గ్రామాల పరిస్థితి ఇంత దారుణంగా ఉండటం చర్చనీయాంశంగా మారిందని, అవసరమైన అభివద్ధి కార్యక్రమాలు చేపట్టడంలో గ్రామ కార్యదర్శి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చెత్తను స్వీకరించే ట్రాక్టర్‌ను మూలన నిరుపయోగంగా ఉంచుతున్నరని, అందుకే ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయి ప్లాస్టిక్‌ బాటిళ్లు, ప్లాస్టిక్‌ కవర్లు వంటి చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు. తిరుమ లాయపాలెం మండల కేంద్రం అయినందున ఉన్నతాధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని బీఆర్‌ఎస్‌ మండల పార్టీ నాయకులు కొమ్ము వీరబాబు డిమాండ్‌ చేశారు.

Spread the love