కేంబ్రిడ్జ్ పేరుతో నడుస్తున్న పాఠశాల మూసివేత
నవతెలంగాణ – రాయికల్
పట్టణంలో “కేంబ్రిడ్జ్ స్కూల్” పేరుతో అనధికారంగా నిర్వహిస్తున్న పాఠశాలపై మండల విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకుని సోమవారం మూసివేశారు. గుర్తింపు లేకుండా చిన్నారులకు విద్యాబోధన నిర్వహిస్తున్నట్లు గుర్తించి ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. గతంలో రాయికల్‌లో నడిచిన ఈ పాఠశాల ప్రస్తుతం రామాజిపేట్‌లో గుర్తింపుతో కొనసాగుతున్నప్పటికీ, పాత భవనంలో మళ్లీ అనధికారంగా తరగతులు నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
సుమారు 25 మంది నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ విద్యార్థులతో బోధన జరుగుతున్నట్లు తనిఖీలో తేలింది. ఈ నేపథ్యంలో మండల విద్యాధికారి ఆదేశాలతో సిబ్బంది తనిఖీ చేసి వెంటనే పాఠశాలను సీజ్ చేశారు. చిన్నారుల భద్రత, విద్యా ప్రమాణాల దృష్ట్యా ఈ చర్యలు తీసుకున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి రాఘవులు నవతెలంగాణతో ఫోన్ ద్వారా మాట్లాడుతూ గుర్తింపు లేని పాఠశాలలు నడపడం చట్టవిరుద్ధమని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను గుర్తింపు పొందిన పాఠశాలల్లోనే చేర్పించాలని సూచించారు.



