రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమం కింద చేపడుతున్న మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి సూచించారు. సోమవారం, హైదరాబాదు నుంచి సంబంధిత ఉన్నతాధికారులతో కలిసి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్య ఎన్నికల అధికారి మాట్లాడుతూ కొన్ని రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ మ్యాపింగ్ 95 శాతానికి పైగా పూర్తయిందని, తెలంగాణలో కూడా అదే స్థాయిలో పురోగతి సాధించేందుకు సమన్వయంతో కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈఆర్ఓలు, ఏఈఆర్వోలు తమ పరిధిలోని బూత్ లెవెల్ అధికారులు (బిఎల్ఓలు), సూపర్వైజర్లకు స్పష్టమైన దిశానిర్దేశం అందిస్తూ క్షేత్రస్థాయిలో పనులను క్రమబద్ధంగా పర్యవేక్షించాలని ఆదేశించారు.బూత్ స్థాయిలో రాజకీయ పార్టీల ఏజెంట్ల నియామకంపై ఇప్పటికే ఆయా పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించినందున, వారి సహకారాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తమ పరిధిలోని బిఎల్ఓలతో సమన్వయం పెంచుకుని మ్యాపింగ్ ప్రక్రియను స్వయంగా పర్యవేక్షించేందుకు ముందుకు రావడం ద్వారా మిగిలిన ప్రాంతాల్లో పనులను వేగంగా పూర్తి చేయవచ్చని తెలిపారు. ఈ ప్రక్రియలో ఖచ్చితత్వం, పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో భువనగిరి రెవెన్యూ డివిజనల్ అధికారి కృష్ణారెడ్డి ,భువనగిరి తాసిల్దార్ జగన్మోహన్ ప్రసాద్ , ఎలక్షన్స్ సెల్ సూపర్డెండ్ కృష్ణ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.



