చారిత్రాత్మక కట్టడాల పునరుద్ధరణకు చర్యలు

చారిత్రాత్మక కట్టడాల పునరుద్ధరణకు చర్యలు–  జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రోస్‌
–  ఆరు పురాతన కట్టడాల పరిశీలన
నవతెలంగాణ-సిటీబ్యూరో
చారిత్రాత్మక కట్టడాల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నట్టు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రోస్‌ తెలిపారు. శనివారం హైదరాబాద్‌ పాతబస్తీలోని ఆరు పురాతన కట్టడాలను ఆయన సందర్శించారు. చెత్త బజార్‌ కమాన్‌, హుస్సేనీ ఆలం కమాన్‌, షేక్‌ ఫాయిజ్‌ కమాన్‌, దేవన్‌ దేవిడి కమాన్‌, డబీర్‌ పుర కమాన్‌, రాణిగంజ్‌ కమాన్‌ల పునరుద్ధరణ పనులను చేపట్టేందుకు ఇ.ఎన్‌.సీ జియాఉద్దీన్‌తో కలిసి కమిషనర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ హైదరాబాద్‌లో గల చారిత్రాత్మక కట్టడాలు పర్యాటకులను ఆకట్టుకునే విధంగా పునరుద్ధరణ పనులు చేపట్టనున్నట్టు తెలిపారు. గతంలో చార్మినార్‌ పెడెస్టేరియన్‌ ప్రాజెక్ట్‌ ద్వారా సుమారు రూ. 60 కోట్లతో 13 పనులు చేపట్టామని, అందులో ఆరు పనులు పూర్తి కాగా మిగతావి వివిధ అభింవృద్ధి దశలో ఉన్నాయన్నారు. హైదరాబాద్‌ వారసత్వ సంపదను భావితరాల వారికి అందించాలనే నేపథ్యంలో మూడు పురాతన హెరిటేజ్‌ భవనాల పునర్నిర్మాణం, పరిరక్షణకు రూ. 18 కోట్ల వ్యయంతో మోజంజాహి మార్కెట్‌, మౌలాలి కమాన్‌, క్లాక్‌ టవర్‌ పనులు ప్రారంభించామన్నారు. అదేవిధంగా రూ. 30 కోట్ల వ్యయంతో చేపట్టిన ముర్గీ చౌక్‌ పునర్నిర్మాణ పనులు, రూ. 30 కోట్ల వ్యయంతో చేపట్టిన సర్దార్‌ మహల్‌ పునరుద్ధరణ పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను కమిషనర్‌ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ కమిషనర్‌ ఉపేందర్‌ రెడ్డి, జోనల్‌ కమిషనర్‌ వెంకన్న, డిప్యూటీ కమిషనర్‌ నాయక్‌, చార్మినార్‌ జోన్‌ ఎస్‌.ఇ మహేశ్వర్‌ రెడ్డి, కులీకుతుబ్‌ షా అర్భన్‌ డెవలప్మెంట్‌ ఇ.ఇ శంకర్‌, మెడికల్‌ ఆఫీసర్‌ శ్రీకాంత్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love