ప్రాజెక్టుల అప్పగింతపై కేంద్రం దుందుడుకు చర్యలు

On assignment of projects Measures taken by the Center– రేపు కేఆర్‌ఎంబీ, ఈఎన్సీల మధ్య చర్చ
– ముదురుతున్న వివాదం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాబాద్‌
నాగార్జునసాగర్‌ డ్యామ్‌, శ్రీశైలం డ్యామ్‌ల అప్పగింత వివాదం కొనసాగుతుండగానే కేంద్ర జలశక్తి శాఖ మరో ముందడుగేసింది. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో ఈ రెండు ప్రాజెక్టులపై వివాదం నెలకొన్న నేపథ్యంలో ఫిబ్రవరి ఒకటిన అప్పగింతపై హైదరాబాద్‌లో కీలక భేటి జరగనుంది. దీంతో రాజకీయవర్గాల్లో మరోసారి చర్చకు దారితీసింది. రెండు రాష్ట్రాల ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌(ఈఎన్సీ)లతోపాటు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) కేంద్ర జలశక్తి శాఖ లేఖలు రాసింది. ఈ సందర్భంగా ప్రాజెక్టుల అప్పగింత కోసం తీసుకోవాల్సిన చర్యలపై కేఆర్‌ఎంబీ చైర్మెన్‌, ఇతర ఉన్నతాధికారులు తెలుగు రాష్ట్రాల ఈఎన్సీల మధ్య చర్చలు జరగనున్నాయి. ఈమేరకు లేఖలో స్పష్టంగా ఏజెండాను పేర్కొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ రోజున ఏపీ సర్కారు నాగార్జునసాగర్‌ డ్యామ్‌పై ఉన్న దాదాపు 13 గేట్లను మా నీళ్లను మేమే తీసుకుంటామంటూ పోలీసులతో ఆక్రమించింది. అప్పట్లో తెలంగాణ ఆ చర్యను ఖండించింది. కేంద్ర జలశక్తి శాఖ సైతం ఏపీ చర్యను ప్రశ్నించింది. ఈనేపథ్యంలో పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు అక్కడ సీఆర్‌పీఎఫ్‌ దళాలను పెట్రోలింగ్‌ కోసం ఏర్పాటు చేసింది. ఈ చర్య మూలంగా నాగార్జునసాగర్‌ డ్యామ్‌ నిర్వహణపై తెలంగాణ సర్కారుకు ఉన్న ప్రస్తుత అధికారం ప్రశ్నార్థకమవుతున్నది. సాగర్‌తోపాటు శ్రీశైలం డ్యామ్‌ నిర్వహణ కూడా కేఆర్‌ఎంబీ చేతుల్లో పెట్టేందుకే కేంద్ర జలశక్తి శాఖ గురువారం ఈఎన్సీల సమావేశం ఏర్పాటు చేసింది. ప్రాజెక్టులపై పెత్తనం చేసేందుకే కేంద్రం ఈతరహా చర్యలకు పాల్పడుతున్నదనే విమర్శలు వస్తున్నాయి. డ్యామ్‌ల అప్పగింతతో పాటు మరో 15 అంశాలపై చర్చించి యాక్షన్‌ ప్లాన్‌ తయారుచేయాలని కేంద్ర జలశక్తి శాఖ ఆదేశించింది. సీఆర్‌పీఎఫ్‌ నిఘాను సైతం కొనసాగించాలని ఆదేశించింది. ఒకవేళ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలకు చెందిన ఇంజినీర్లు నాగార్జునసాగర్‌ డ్యామ్‌ను సందర్శించాలంటే కచ్చితంగా కేఆర్‌ఎంబీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. డ్యామ్‌కు ఏవైనా తప్పనిసరి మరమ్మతు పనులు చేయాలన్నా కేఆర్‌ఎంబీ అంగీకరించాల్సిందే. ప్రాజెక్టుల నిర్వహణ పూర్తిగా కేఆర్‌ఎంబీ చేయనుందని సమాచారం. ఇటీవల సీఎం సమీక్షలో ప్రాజెక్టుల నిర్వహణను ఏవరికీ అప్పగించలేదని రాష్ట్ర సాగునీటి శాఖ చెప్పిన విషయం విదితమే. కాగా నాగార్జునసాగర్‌ డ్యామ్‌ అప్పగింత వ్యవహారం మరోసారి రాజకీయ దుమారంలేపే అవకాశాలు లేకపోలేదు. ఈనేపథ్యంలో గురువారం జరిగే సమావేశం కీలకం కానుంది.

Spread the love