ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఫలితాల విజయోత్సాహాలతో నరేంద్ర మోడీ అమితానందంలో తలమునకలైపోయారు. ఆ ఊపులోనే ఆయన ఇది కేవలం ఎన్నికల మార్పు మాత్రమే కాదు, ప్రజల ఆలోచనల్లోనే మార్పు అని చాలా దూకుడుగా ప్రకటించారు. కేరళంలో ఎల్‌డిఎఫ్ ఓడిపోయి, పశ్చిమ బెంగాల్ లోనూ బీజేపీ అధికార పీఠానికి ఎగబాకింది గనక ఎన్నికల విజయం ద్వారా లభించిన ఈ సైద్ధాంతిక పట్టును మరింత బలోపేతం చేసుకోవడానికి ఇదే సరైన సమయమన్నారు. అదే విధంగా మోడీకి తన సిద్ధాంత భావాల ఊట నుంచి మరో దిగులు కూడా పట్టుకున్నట్టు కనిపిస్తుంది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, దాని అత్యంత ప్రభావశీల సిద్ధాంతకర్త గోల్వాల్కర్ నుంచి వచ్చింది. కమ్యూనిజం తమ ప్రధాన సైద్ధాంతిక శత్రువు అని గోల్వాల్కర్ సుస్పష్టంగా ప్రకటించారు. వారికున్న సైద్ధాంతిక మూల బలమే కమ్యూనిస్టులకు ఫాసిస్టు తరహా స్వతస్సిద్ధ పోకడలను పసిగట్టగల శక్తినిస్తాయి. పెట్టుబడిదారీ అనుకూల భావనలను తెలియజెప్తాయి. ఆ విధంగా వారు అత్యంత విశాలమైన ప్రతిఘటనను నిర్మించే అవగాహన కలిగిస్తాయి. ఈ విషయం ఆరెస్సెస్ సంస్థాగత జ్ఞాపకాలలో చెరిగిపోకుండా వుంటుంది. కనుక ఎన్నికల ఫలితాల తర్వాత కనిపిస్తున్న ఈ అత్యుత్సాహ పరవశం అర్థం చేసుకోవడం కష్టమేం కాదు.
మార్క్స్ మహాద్భుత వివరణ
పెట్టుబడి చలన సూత్రాల గురించి- ప్రస్తుత తరం నయా ఉదారవాదుల వలె గాక మార్క్స్ అందించిన నిశిత అంతరావలోకనం – దాని తీరుతెన్నులను బహిర్గతం చేయడంలో కాలాతీతమైన ప్రాధాన్యత కలిగినవిగా రుజువైంది. పారిశ్రామిక పెట్టుబడి పుట్టుక గురించిన అధ్యాయం ముగిస్తూ మార్క్స్ ఇలా చెపాడు: పెట్టుబడి అనేది ఆమూలాగ్రం నఖశిఖ పర్యంతం రక్తంతో, మురికితో తడిసి వుంటుంది.” దీనికి ఆయన తన సమకాలికుడైన ఒక కార్మిక నాయకుడు రాసిన పాద పీఠిక జత చేశారు (ఎందుకంటే మార్క్స్ తన విశ్లేషణలను విలువ కట్టడానికి ఉద్దేశపూర్వకంగానే కార్మికుల రచనలు, అనుభవాల నుంచి తీసుకునేవారు.) టి.జె.డన్నింగ్ అనే కార్మిక నేత ఇచ్చిన ఆ పాద పీఠిక ఇలా వుంది: తగినంత లాభం వస్తుందంటే పెట్టుబడి ఎంతకైనా తెగిస్తుంది. 10 శాతం లాభం వస్తుందంటే అది ఎక్కడికైనా వెళుతుంది. ఇరవై శాతం వస్తుందంటే మరింత హడావుడి పడుతుంది. యాభై శాతం లాభం వస్తే మరింత తెగిస్తుంది. వంద శాతం లాభం కోసమైతే మానవ సూత్రాలన్నిటినీ కాలరాయడానికి సిద్ధమైపోతుంది. అదే మూడు వందల శాతం లాభం వస్తుందంటే పెట్టుబడి ఎలాంటి నేరం చేయడానికైనా వెనుకాడదు. ఆఖరుకు తన యజమానిని ఉరి తీయడానికి కూడా సంకోచించదు.”
అయితే పారిశ్రామిక పెట్టుబడి తొలి రోజులలో లక్షణాలను పక్కన పెడితే నేరాలకు తెగించడం అనేది పెట్టుబడిదారీ విధానపు లక్షణంగా కొనసాగుతూనే ఉంటుంది. ప్రపంచీకరణ తొలి రోజులలోనే ఇది స్పష్టంగా కానవచ్చింది. ఒపెక్ దేశాలు చమురు ధరలను విపరీతంగా పెంచడంతో ద్రవ్య పెట్టుబడి ఆధిక్యతకు నేపథ్యంగా మారింది. అంతర్జాతీయ స్థాయిలో అది సంఘటిత రూపం తీసుకుంది.భౌతికంగా సరుకులను అమెరికా ద్రవ్య పెట్టుబడిగా మార్చింది గనక ఒపెక్ దేశాలు తీసుకొచ్చిన ముడి చమురు ధరల పెరుగుదల తాకిడిని తట్టుకోగలిగింది. ఆ విధమైన ద్రవ్యీకరణను ఆమోదించడం, దాన్ని ద్రవ్యం ఇతర సేవలతో సమ్మిళితం చేయడం సామ్రాజ్యవాద ఆధిపత్యంలోని నయా ఉదారవాద ప్రపంచీకరణ ప్రారంభ వాక్యమైంది. సిఐఎ ఇతర అమెరికా సంస్థలు ప్రతిభావంతులైన యువతను చేర్చుకుని అంతర్జాతీయ ద్రవ్య సంస్థల తరపున పనిచేసే విధంగా తర్ఫీదునిచ్చాయి. ఇందుకోసం ఒపెక్ దేశాలు మరికొన్ని వర్ధమాన దేశాలతో కలసి పనిచేశాయి.
పెర్కిన్స్ చెప్పిన లోగుట్టు
ఆర్థిక వ్యవస్థలతో మాయాజాలం చేసే ఈ క్రీడలలో మునిగితేలే కాల్బలం లాంటి ఈసిపా యిలు ద్రవ్య పెట్టుబడి ఆధిక్యతను నెలకొల్పే సాధనాలుగా పనిచేస్తారు. ఆయా దేశాల సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తారు. ఇదెలా జరుగుతుందో గుర్తు చేసుకుంటూ జాన్ పెర్కిన్స్ ఒక సస్పెన్స్ థ్రిల్లర్ వంటి పుస్తకం రాశారు. ”ది కన్ఫెషన్స్ ఆఫ్ ఎకనామిక్ హిట్‌మేన్” (ఒక దళారీ పశ్చాత్తాపం). దాంట్లో పెర్కిన్స్ ఈ వ్యవస్థను కార్పొరేటోక్రసీగా అభివర్ణిస్తారు. నిజానికి అది అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ప్రేరిత నయా ఉదారవాద ప్రపంచీకరణకు మరో పేరు మాత్రమే. నరేంద్ర మోడీ పెంచి పోషించే ఆశ్రితులలో అత్యంత ముఖ్యుడైన గౌతం అదానీ, అతని సన్నిహితులకు సంబంధించిన తాజాగా బయిటకొచ్చిన వ్యవహారం ఈ ప్రభుత్వం అసలు రంగును వెల్లడిస్తున్నది. అమెరికా న్యాయ విభాగం అదానీ గ్రూపుపై పెట్టిన అభియోగాలను ఇప్పుడు ఉపసంహరించుకున్నారు. ఈ ఉపసంహరణకు దారితీసిన పరిస్థితులు మాత్రం నేర విచారణను పచ్చిగా కొనుక్కునే తంతును తలపిస్తున్నాయి.
అమెరికాలో అదానీ బేరం
భారతీయ మహా కుబేరుడు గౌతం అదానీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌నకు వ్యక్తిగత లాయర్లలో ఒకరైన రాబర్ట్ గిఫ్రా జూనియర్‌ను నియమించుకున్న తర్వాతనే ఈ కేసు వెనక్కు పోయినట్టు న్యూయార్క్ టైమ్స్ వార్తా కథనం వెల్లడించింది. అదానీ తరపున గిఫ్రా ప్రయత్నం, గత నెల వాషింగ్టన్ లోని న్యాయశాఖ కేంద్ర కార్యాలయంలో సమావేశం జరిపిన విషయం ఇప్పుడు కొత్తగా బయిటకు వచ్చింది. ఈ సందర్భంగా గిఫ్రా ప్రాసిక్యూషన్‌కు సరైన సాక్ష్యాధారాలు లేవని, అసలు ఆ పరిధిలోకి రాదనీ చెప్పడానికి వంద వివరణాత్మక స్లైడ్లు ప్రదర్శించినట్టు ఆ భేటీతో సంబంధం వున్న వ్యక్తులు చెప్పారట. అదానీ గనక అమెరికా ఆర్థిక వ్యవస్థలో వెయ్యి కోట్ల డాలర్ల పెట్టుబడి పెట్టి 15 వేల మందికి ఉపాధి కల్పించేట్టయితే ఆ అభియోగాలను ప్రాసిక్యూటర్లు పసంహరించుకుంటారని కూడా మరో స్లైడ్ ద్వారా గిఫ్రా సూచించారట. ఈ ఉద్యోగాల కల్పన అనేది ట్రంప్ ఎన్నికల వాగ్దానాలలో ఒకటి. అదే విధంగా దీంతోపాటు అదానీపై సెక్యూరిటీలు ఎక్స్‌చేంజి కమిషన్ (సెక్) ఆర్థిక శాఖ తీసుకొచ్చిన సివిల్ కేసును కూడా పరిష్కరించడానికి అదే భేటీలో గిఫ్రా మరో ప్రతిపాదన చేశారు. ఇప్పటికైతే సెక్ తన పరిష్కారం ప్రకటించింది. ఆర్థికశాఖ కుదుర్చుకున్న ఒప్పందం కూడా ముందు ముందు బయిటకు రావచ్చు.
వెయ్యి కోట్ల డాలర్ల పెట్టుబడి పెట్టడం అనేది నేరపూరిత అభియోగాల పరిష్కారంలో ఎలాంటి ప్రభావం చూపబోవని తర్వాత ప్రాసిక్యూటర్లు చెప్పారు కానీ ఈ ప్రతిపాదనపై న్యాయశాఖకు సంబంధించిన ఒక సీనియర్ అధికారి మాత్రం సానుకూలంగా స్పందించారని ఆ భేటీతో సంబంధంగల వారు కొందరు వెల్లడించారు. ఇప్పుడు అమలు కాకుండా ఆగిన ఈ ప్రతిపాదన ట్రంప్ రాజకీయ ఆర్థిక విజయంగా చెప్పుకునే అవకాశమిచ్చేది. ఆయన మలి దఫా పదవీ కాలంలో న్యాయాన్ని ఏదో వాణిజ్య లావాదేవీగా మార్చుకుంటున్న తీరుకు ఉదాహరణ అయివుండేది. భారతీయులమైన మనకు సంబంధించి అంతే ప్రాధాన్యతగల మరో కోణం ప్రధానమంత్రికి అత్యంత ఆప్తుడైన మిత్రుడు అమెరికాలో న్యాయాన్ని కొనుక్కోవడం. మోడీ దేశ పౌరులకు పొదుపు పాఠాలు చెబుతున్న సమయంలోనే ఇది సంభవించడం. అదానీ అమెరికాలో పదిహేను వేల ఉద్యోగాలు కల్పించేందుకు వెయ్యి కోట్ల డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైపోయా రన్నమాట. మరి విదేశీ మారకద్రవ్యం పొదుపు చేయడం గురించి తను చెబుతున్న పాఠాలను అదానీ పాటించనందుకు….ప్రధానమంత్రి కాస్తయినా నిరసన తెల్పినట్టు ఎవరైనా ఎక్కడైనా విన్నారా?
మోడీ మాటల మర్మం
ఈ విషయంలో ప్రధానమంత్రి జరగాలని కోరుకుంటున్న ఆలోచనల మార్పు ఏమిటో అర్థం చేసుకోవడానికి రాకెట్ సైన్స్ ఏమీ అక్కర్లేదు. పెట్టుబడిని రంగంలో కి దించాలనీ, లావాదేవీలతో గట్టెక్కాలని ఆయన ప్రవచిస్తున్నారు. నేరం మాఫీ చేసుకోడానికి పెట్టుబడిని ప్రయోగించమని, లావాదేవీలు ప్రయోగించమని సలహా ఇస్తున్నారు. జన విశ్వాస్ చట్టం ద్వారా నేరపూరిత ఉల్లంఘనలు మసిపూసి మారేడుకాయ చేసే ప్రక్రియ ప్రభుత్వమే ప్రారంభిస్తున్నది. ఇందులో ఎలాంటి మతపరమై భావోద్వేగాలు బొత్తిగా లేవు. ఇది కేవలం పెట్టుబడికి సంబంధించిన మామూలు వ్యవహారం. లాభాల వెంపర్లాట. దీనిపై మోడీ వేడుకలు చేసుకోవచ్చు గానీ మార్క్స్ నిశితమైన అంతరావలోకనం మాత్రం ఇక్కడ ప్రస్ఫుటమవుతుంది. నిలదీసి ప్రశ్నిస్తుంది.
(మే 27 ‘పీపుల్స్ డెమోక్రసీ’ సంపాదకీయం )
అమెరికాలో అదానీ న్యాయ బేరం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



