ఆదిత్య ఎల్‌-1 రెండవ కక్ష్య పెంపు

– విన్యాసం విజయవంతం : ఇస్రో
బెంగళూరు : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సూర్యునిపై పరిశోధనకు ప్రయోగించిన ఆదిత్య ఎల్‌ -1 విజయవంతంగా దూసుకుపోతున్నది. ఆదిత్య ఎల్‌ 1 రెండవ భూకక్ష్య పెంపు విన్యాసాన్ని పూర్తి చేసినట్టు ఇస్రో ప్రకటించింది. షెడ్యూల్‌ ప్రకారం.. మంగళవారం తెల్లవారుజామున ఈ విన్యాసం పూర్తయిందని తెలిపింది. ఈ ఆపరేషన్‌ సమయంలో మారిషస్‌, బెంగళూరు, పోర్ట్‌బ్లెయిర్‌లోని ఐఎస్‌టీఆర్‌ఏసీ/ఇస్రో స్టేషన్లు ఉపగ్రహాన్ని ట్రాక్‌ చేశాయని ఇస్రో ఓ ప్రకటనలో వెల్లడించింది. దీంతో ఆదిత్య ఎల్‌-1 282కి.మీ 40,225కి.మీకి చేరుకుంది. అయితే నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకునేందుకు మరో మూడు సార్లు కక్ష్యను పెంచాల్సి వుంది. తదుపరి విన్యాసాన్ని సెప్టెంబర్‌ 10 తెల్లవారుజామున 2.30 గంటలకు షెడ్యూల్‌ చేసినట్లు తెలిపింది. సెప్టెంబర్‌ 18న చివరి విన్యాసం తర్వాత ఆదిత్య ఎల్‌-1 వర్తులాకార కక్ష్య అయిన లాంగ్రేంగియన్‌ పాయింట్‌ 1కి చేరేందుకు సిద్ధమవుతుంది. ఈ కక్ష్యలోకి ప్రవేశించడానికి నాలుగు నెలల వ్యవధి పట్టనుంది.

Spread the love