– 9న అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్
– కమిటీ చైర్మెన్‌కు ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ
– ప్రతిపక్ష సభ్యులు అసమ్మతి నోటు
– ఎవరూ లేనప్పుడు ముసాయిదా ఆమోదానికి యత్నం: మహువా
– కమిటీ ముసాయిదా నివేదిక ఏదీ సభ్యులకు అందలేదు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
టీఎంసీకి చెందిన మహువా మొయిత్రాపై ‘క్యాష్ ఫర్ క్వెరీ’ ఆరోపణలపై విచారణ చేస్తున్న లోక్‌సభ ఎథిక్స్ కమిటీ సభ్యుడు, కాంగ్రెస్ ఎంపీ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, నవంబర్ 9న జరగాల్సిన తదుపరి సమావేశాన్ని వాయిదా వేయాలని కోరారు. ఈ మేరకు ప్యానెల్ చైర్మెన్ వినోద్ సోంకర్‌కు లేఖ ఆయన రాశారు.
నవంబర్ 9న అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేయబోతున్నానని, తదుపరి సమావేశాన్ని రీషెడ్యూల్ చేయాలని లేఖలో అభ్యర్థించారు. ఎథిక్స్ కమిటీ సమావేశం నవంబర్ 7న నిర్వహించాలని తొలుత షెడ్యూల్ చేశారు. అయితే దాన్ని 9కి వాయిదా వేశారు. కనుక తాను అదే రోజు నామినేషన్ దాఖలు చేయనున్న నేపథ్యంలో సమావేశ తేదీని మరో రోజుకు మార్చాలని కోరారు.
ఎవరూ లేనప్పుడు ముసాయిదా ఆమోదానికి ప్రయత్నం: మహువా
కాంగ్రెస్ సభ్యుడిని సమావేశానికి దూరంగా ఉంచి, నివేదికను మెజారిటీతో ఆమోదించడానికి కమిటీ సమావేశాన్ని వాయిదా వేసినట్లు టీఎంసీ ఎంపీ మహువా పేర్కొన్నారు. కమిటీ ముసాయిదా నివేదిక ఏదీ సభ్యులకు అందజేయలేదని, మెజారిటీతో నివేదికను ఆమోదించేందుకు బీజేపీ నేతలు తమ హాజరయ్యేలా అనువైన రోజు నాడే సమావేశం నిర్వహిస్తున్నారని ఆమె విమర్శించారు. ”కాంగ్రెస్ ఎంపీ నామినేషన్ తేదీ రోజున సమావేశం నిర్వహిస్తే, ఆయన సమావేశానికి హాజరుకాలేరు” అని మహువా పేర్కొన్నారు.
ప్రతిపక్ష సభ్యుల అసమ్మతి నోటు
ప్రతిపక్ష సభ్యులు కమిటీకి అసమ్మతి నోట్లు సమర్పించాలని భావిస్తున్నారు. కాంగ్రెస్ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వి.వైతిలింగం అసమ్మతి నోట్లు సమర్పించ నున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
బీఎస్పీ ఎంపీ డానిష్ అలీ కూడా తన అసమ్మతి నోట్‌ను సమర్పించనున్నారు. 15 మంది సభ్యుల కమిటీలో బీజేపీ నుంచి ఏడుగురు, కాంగ్రెస్ నుంచి ముగ్గురు, బీఎస్పీ, శివసేన, వైసీపీ, సీపీఎం, జేడీయూ నుంచి ఒక్కొక్కరు చొప్పున సభ్యులుగా ఉన్నారు. మహువా ప్రయాణాలు, హౌటల్ బస, టెలిఫోన్ కాల్స్ గురించి ఎథిక్స్ కమిటీ చైర్మన్ సోంకర్ వ్యక్తిగత, అసభ్యకరమైన ప్రశ్నలు అడిగారని ఆరోపిస్తూ నవంబర్ 2 సమావేశం నుండి ప్రతిపక్ష సభ్యులు వాకౌట్ చేశారు.