Wednesday, August 19, 2026
E-PAPER
Homeక్రైమ్కల్తీ నెయ్యి ముఠా గుట్టురట్టు

కల్తీ నెయ్యి ముఠా గుట్టురట్టు

- Advertisement -

36 టన్నుల కల్తీ నెయ్యి, రసాయనాలు స్వాధీనం :
హైదరాబాద్‌ ‌నగర సీపీ సజ్జనార్‌
నవతెలంగాణ-సిటీబ్యూరో

​హైదరాబాద్‌ నగరంలో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ నెయ్యి తయారీ, విక్రయ ముఠాలపై హైదరాబాద్ కమిషనర్స్ టాస్క్ ఫోర్స్ (హెచ్‌-ఫాస్ట్‌), ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ సంయుక్తంగా దాడులు నిర్వహించారు. మంగళవారం హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఒకేసారి 130 ప్రాంగణాల్లో (39 తయారీ కేంద్రాలు, 91 విక్రయ దుకాణాలు) ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. దాదాపు 36 టన్నుల కల్తీ నెయ్యి, దానికి ఉపయోగించే ముడి పదార్థాలు, హానికర రసాయనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సంఘటనా స్థలంలో ఫుడ్ సేఫ్టీ ఇన్‌స్పెక్టర్లు శాంపిళ్లను సేకరించి ల్యాబ్‌కు పంపగా, స్వాధీనం చేసుకున్న సరుకును ఫుడ్ సేఫ్టీ అథారిటీకి అప్పగించారు. సుమారు 25.5 టన్నుల కల్తీ నెయ్యి, 8.7 టన్నుల ముడిసరుకులు, 1,200 లీటర్లు పామ్‌ ఆయిల్‌, 600 లీటర్లు డాల్డా, సువాసన ద్రవాలు, 30కేజీల స్టార్చ్‌, మిషనరీని స్వాధీనం చేసుకున్నారు. టీజీఐసీసీసీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జాయింట్‌ ‌సీపీ విజయ్‌‌కుమార్‌‌తో కలిసి సీపీ సజ్జనార్‌ మీడియాకు వివరాలు వెల్లడించారు.

కొందరు వ్యాపారులు కల్తీ నెయ్యిని తయారు చేస్తున్నట్టు సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ (హెచ్‌-ఫాస్ట్‌) , ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ సంయుక్తంగా దాడులు నిర్వహించారు. పాల ఘనపదార్థాలకు పామ్ ఆయిల్, వనస్పతి (డాల్డా), కృత్రిమ సువాసన రసాయనాలను కలిపి అసలు నెయ్యిలా తయారు చేస్తున్నారు. అసలు పాలు లేకుండానే, స్కిమ్డ్ మిల్క్ పౌడర్ (0% ఫ్యాట్), పామ్ ఆయిల్, వనస్పతి, స్టార్చ్, రసాయన సువాసనలు కలిపి పాలు, వెన్న లేకుండానే నెయ్యిని సృష్టిస్తున్నారు.
కల్తీ నెయ్యిని ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్ చేసి “100% ప్యూర్ నెయ్యి”, “ప్రీమియమ్ నెయ్యి”, ఫార్మ్ ఫ్రెష్ నెయ్యి, “నేచురల్ నెయ్యి” అనే పేర్లతో మార్కెట్లోకి వదులుతున్నారు. వీటిపై ఎలాంటి ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్ నంబర్, బ్యాచ్ నంబర్, తయారీ/ఎక్స్‌పైరీ తేదీలు ఉండటం లేదు. పూజా/దీపం నెయ్యిగా తయారు చేస్తున్నారు. రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు, స్వీట్ షాపులకు, ఆయుర్వేద మందుల దుకాణాలకు (దవాసాజ్), డెయిరీ షాపులు, స్టార్ హోటళ్లు, కేటరర్లకు విక్రయిస్తున్నారు. తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాలకు కూడా సరఫరా చేస్తున్నారు. మిల్క్ క్రీమ్‌ను మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి తెప్పిస్తున్నారు. నాసిరకం పదార్థాలతో అతి తక్కువ ఖర్చుతో తయారు చేసి, మార్కెట్‌లో అసలు నెయ్యి ధరలకు విక్రయిస్తూ భారీగా అక్రమ అర్జనకు పాల్పడుతున్నారు. పామ్ ఆయిల్, పామ్ కర్నెల్ ఆయిల్‌కు బీటా-కెరోటిన్, ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్, లాక్టిక్ యాసిడ్, మోనోగ్లిజరైడ్స్ వంటి రసాయనాలను కలిపి ల్యాబ్ పరీక్షల్లో దొరక్కుండా జాగ్రత్తపడుతున్నారు.

వీటిని తినడం వల్ల కొలెస్ర్టాల్‌ ‌పెరగడంతోపాటు గుండె జబ్బులు, పక్షవాతం వచ్చే అవకాశముందని హైదరాబాద్‌ సీపీ ‌తెలిపారు. జీర్ణక్రియ సమస్యలు, కాలేయం (లివర్), మూత్రపిండాల (కిడ్నీ) పై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. తక్కువ ధరకు లభించే బ్రాండ్ లేని, విడి నెయ్యి/పాల ఉత్పత్తులను కొనకూడదని, బ్రాండెడ్‌ ‌నెయ్యినే కొనుగోలు చేయాలని సీపీ సూచించారు. కల్తీ నెయ్యిని తయారు చేస్తున్న ముఠాలతోపాటు కొనుగోలుదారులు, విక్రయదారుల వివరాలను పూర్తి విచారణ అనంతరం వెల్లడిస్తామని సీపీ తెలిపారు.
ఎక్కడైనా కల్తీ నెయ్యి లేదా అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాలు తయారు చేస్తుంటే ఎమర్జెన్సీ నెంబర్ 112 లేదా హెచ్‌-‌ఫాస్ట్‌ హెల్ప్‌లైన్ నెంబర్ 8712661212 కు సమాచారం అందించాలన్నారు. ఈ సమావేశంలో టాస్క్ ఫోర్స్ డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, ఇన్‌స్పెక్టర్లు ఎన్. రంజిత్ కుమార్ గౌడ్, ఎమ్. అంజయ్య, సబ్‌ఇన్‌స్పెక్టర్లు రమ్య, అభిలాష్, శంకర్, కృష్ణ, అఖిల్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -