అఫ్గాన్‌ జిలేబి!

Afghan Jelebi!– ఆస్ట్రేలియాపై 21 రన్స్‌తో అద్భుత విజయం
– ఏడు వికెట్లతో నిప్పులు చెరిగిన నయిబ్‌, నవీన్‌
– సూపర్‌8లో అఫ్గనిస్థాన్‌ సూపర్‌ విక్టరీ
– ఐసీసీ 2024 టీ20 ప్రపంచకప్‌
అఫ్గనిస్థాన్‌ అదరగొట్టింది. అగ్రజట్టు, మాజీ చాంపియన్‌ ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. బ్యాట్‌తో, బంతితో, ఫీల్డింగ్‌లోనూ కంగారూలపై తిరుగులేని పైచేయి సాధించింది. అఫ్గాన్‌ పేసర్లు గుల్బాదిన్‌ నయిబ్‌ (4/20), నవీన్‌ ఉల్‌ హాక్‌ (3/20) నిప్పులు చెరగటంతో 149 పరుగుల ఛేదనలో ఆస్ట్రేలియా చేతులెత్తేసింది. 19.2 ఓవర్లలో 127 పరుగులకే కుప్పకూలింది. 21 పరుగుల తేడాతో అఫ్గనిస్థాన్‌ సూపర్‌ విక్టరీ నమోదు చేసింది. ఈ విజయంతో సెమీఫైనల్‌ ఆశలను అఫ్గాన్‌ సజీవంగా నిలుపుకోగా.. ఆస్ట్రేలియా అవకాశాలను దారుణంగా దెబ్బతీసింది.
నవతెలంగాణ-కింగ్స్‌టౌన్‌
అగ్రజట్టు ఆస్ట్రేలియాపై అఫ్గనిస్థాన్‌ అద్భుత సాధించింది. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ సూపర్‌8 దశ గ్రూప్‌-1 మ్యాచ్‌లో ఆదివారం కింగ్స్‌టౌన్‌లో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. 148 పరుగుల స్కోరును విజయవంతంగా కాపాడుకున్న అఫ్గనిస్థాన్‌ 21 పరుగుల తేడాతో మెరుపు విజయం నమోదు చేసింది. ఛేదనలో ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ (59, 41 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్థ సెంచరీతో పోరాడినా.. ఫలితం దక్కలేదు. ట్రావిశ్‌ హెడ్‌ (0), డెవిడ్‌ వార్నర్‌ (3), మిచెల్‌ మార్ష్‌ (12), టిమ్‌ డెవిడ్‌ (2), మార్కస్‌ స్టోయినిస్‌ (11) విఫలమయ్యారు. అఫ్గాన్‌ పేసర్లు నయిబ్‌, నవీన్‌ 8 ఓవర్లలో 40 పరుగులకే ఏడు వికెట్లు పడగొట్టి ఆసీస్‌ పతనాన్ని శాసించారు. అంతకుముందు ఓపెనర్లు రహ్మనుల్లా గుర్బాజ్‌ (60, 49 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), ఇబ్రహీం జద్రాన్‌ (51, 48 బంతుల్లో 6 ఫోర్లు) అర్థ సెంచరీలతో తొలుత బ్యాటింగ్‌ చేసిన అఫ్గనిస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 148 పరుగులు చేసింది. ఆసీస్‌ పేసర్‌ పాట్‌ కమిన్స్‌ (3/28) వరుసగా రెండో మ్యాచ్‌లో హ్యాట్రిక్‌ వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. అఫ్గాన్‌ పేసర్‌ గుల్బాదిన్‌ నయిబ్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు.
మాక్స్‌వెల్‌ పోరాడినా.. : 149 పరుగుల ఛేదనలో ఆస్ట్రేలియా చతికిల పడింది. పవర్‌ప్లేలోనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుంది. ట్రావిశ్‌ హెడ్‌ (0), డెవిడ్‌ వార్నర్‌ (3), మిచెల్‌ మార్ష్‌ (12) విఫలమయ్యారు. నవీన్‌, నబిలు పవర్‌ప్లేలో ఆసీస్‌ను కోలుకోలేని దెబ్బకొట్టారు. గ్లెన్‌ మాక్స్‌వెల్‌ (59) ఓ ఎండ్‌లో ఒంటరి పోరాటం సాగించాడు. సహచరుల మద్దతు కొరవడినా పరుగుల వేటలో దూసుకెళ్లాడు. మాక్స్‌వెల్‌ క్రీజులో ఉండగా ఆసీస్‌ మ్యాచ్‌ రేసులో నిలిచింది. మిడిల్‌ ఓవర్లలో బంతి అందుకున్న గుల్బాదిన్‌ నయిబ్‌.. మ్యాచ్‌ గమనాన్ని శాసించాడు. నాలుగు వికెట్ల ప్రదర్శనతో ఆసీస్‌ ఆశలను ఆవిరి చేశాడు. మాక్స్‌వెల్‌, స్టోయినిస్‌ (11), టిమ్‌ డెవిడ్‌ (2), పాట్‌ కమిన్స్‌ (3)లను అవుట్‌ చేసిన నయిబ్‌ అఫ్గాన్‌ విజయానికి బాటలు పరిచాడు. స్లో బాల్స్‌తో మ్యాజిక్‌ చేసిన నయిబ్‌, నవీన్‌లు ఆసీస్‌ బ్యాటర్ల ఆట కట్టించారు. 19.2 ఓవర్లలోనే పది వికెట్లు కోల్పోయిన ఆసీస్‌ 127 పరుగులే చేసింది.
ఓపెనర్ల దూకుడు : టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన అఫ్గనిస్థాన్‌కు ఓపెనర్లు మంచి స్కోరు అందించారు. రహ్మనుల్లా గుర్బాజ్‌ (60), ఇబ్రహీం జద్రాన్‌ (51) అర్థ సెంచరీలతో కదం తొక్కారు. ఆసీస్‌ పేసర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న గుర్బాజ్‌, ఇబ్రహీం 15.5 ఓవర్లలో తొలి వికెట్‌కు 118 పరుగుల సెంచరీ భాగస్వామ్యం అందించారు. నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లతో 44 బంతుల్లో గుర్బాజ్‌ అర్థ సెంచరీ సాధించగా.. ఆరు ఫోర్లతో 46 బంతుల్లో ఇబ్రహీం ఫిఫ్టీ మార్క్‌ చేరుకున్నాడు. ఓపెనర్లు స్వల్ప విరామంలో నిష్క్రమించగా.. డెత్‌ ఓవర్లలో అఫ్గాన్‌ ఆశించిన స్కోరు చేయలేదు. కరీం జనత్‌ (13), అజ్మతుల్లా (2), రషీద్‌ ఖాన్‌ (2) నిరాశపరిచారు. మహ్మద్‌ నబి (10 నాటౌట్‌) చివర్లో రెండు బౌండరీలతో మెరిశాడు. ఆసీస్‌ పేసర్‌ పాట్‌ కమిన్స్‌ వరుసగా రెండో మ్యాచ్‌లో హ్యాట్రిక్‌ వికెట్లు పడగొట్టాడు. రషీద్‌ ఖాన్‌, కరీం జనత్‌, గుల్బాదిన్‌ నయిబ్‌లను అవుట్‌ చేసి టీ20 వరల్డ్‌కప్‌లో రెండో హ్యాట్రిక్‌ నమోదు చేశాడు. 20 ఓవర్లలో 6 వికెట్లకు అఫ్గాన్‌ 148 పరుగులు చేసింది. స్పిన్నర్‌ ఆడం జంపా (2/28) ఆకట్టుకున్నాడు.
సంక్షిప్త స్కోర్లు :
అఫ్గనిస్థాన్‌ : 148/6 (గుర్బాజ్‌ 60, ఇబ్రహీం 51, పాట్‌ కమిన్స్‌ 3/28, ఆడం జంపా 2/28)
ఆస్ట్రేలియా : 127/10 (మాక్స్‌వెల్‌ 59, గుల్బాదిన్‌ నయిబ్‌ 4/20, నవీన్‌ ఉల్‌ హాక్‌ 3/20)
వ్యూహాత్మక తప్పిదమా?!
సూపర్‌8 పోరులో అఫ్గాన్‌ను ఆసీస్‌ తేలిగ్గా తీసుకుందా? విజయంపై అతి విశ్వాసం ప్రదర్శించిందా? తెలియటం లేదు. కింగ్స్‌టౌన్‌ గ్రౌండ్‌లో ఈ వరల్డ్‌కప్‌లో ఇప్పటివరకు రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేసిన జట్టు విజయం సాధించలేదు. అయినా, టాస్‌ నెగ్గిన ఆసీస్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. నెమ్మదించిన పిచ్‌పై స్లో బాల్స్‌తో అఫ్గాన్‌ పేసర్లు అద్భుతం చేశారు. 2023 వన్డే వరల్డ్‌కప్‌లో సైతం ఆసీస్‌ను అఫ్గాన్‌ వణికించింది. 292 పరుగుల ఛేదనలో ఆసీస్‌ 91/7తో ఓటమి కోరల్లో నిలిచింది. మాక్స్‌వెల్‌ (201 నాటౌట్‌) అసమాన ఇన్నింగ్స్‌తో ఆసీస్‌కు విజయాన్ని కట్టబెట్టాడు. ఈ మ్యాచ్‌లోనూ మాక్స్‌వెల్‌ (59) మరోసారి ఆ ప్రదర్శన పునరావృతం చేసేలా కనిపించాడు. కానీ పాఠం నేర్చుకున్న అఫ్గాన్‌ బౌలర్లు స్లో బాల్స్‌తో మ్యాజిక్‌ చేశారు. వాంఖడేలో చేజారిన అద్వితీయ విజయాన్ని.. కింగ్స్‌టౌన్స్‌లో ఒడిసిపట్టుకున్నారు.

Spread the love