మళ్లీ ఊచకోత

Massacre again– హెడ్‌, అభిషేక్‌, షాబాజ్‌ విధ్వంసం
– క్యాపిటల్స్‌పై సన్‌రైజర్స్‌ ఘన విజయం
– హైదరాబాద్‌ 266/7, ఢిల్లీ 199/10
ఊచకోత.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బ్యాటింగ్‌ విశ్వరూపం వర్ణించేందుకు ఈ పదం సరిపోదు!. పవర్‌ప్లేలో పవర్‌ఫుల్‌ బ్యాటింగ్‌ చేసిన ట్రావిశ్‌ హెడ్‌ (89), అభిషేక్‌ శర్మ (46) సరికొత్త రికార్డులు నమోదు చేశారు. తొలి ఆరు ఓవర్లలోనే 125 పరుగులు చేసిన సన్‌రైజర్స్‌..ఫిరోజ్‌ షా కోట్ల మైదానంలో అత్యధిక పరుగుల చేసిన జట్టుగా నిలిచింది. షాబాజ్‌ అహ్మద్‌ (59 నాటౌట్‌) అర్థ సెంచరీతో మెరవటంతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 266/7 పరుగుల భారీ స్కోరు సాధించింది.ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్‌ 199 పరుగులకు కుప్పకూలగా.. హైదరాబాద్‌ 67 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
నవతెలంగాణ-న్యూఢిల్లీ
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఎదురులేదు. భారీ స్కోర్ల మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 67 పరుగుల తేడాతో గెలుపొందిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సీజన్లో ఐదో విజయంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. ధనాధన్‌ దంచుడు మంత్రతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌ రికార్డు 266/7 పరుగులు చేసింది. ఓపెనర్లు ట్రావిశ్‌ హెడ్‌ (89, 32 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్స్‌లు), అభిషేక్‌ శర్మ (46, 12 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్‌లు), షాబాజ్‌ అహ్మద్‌ (59 నాటౌట్‌, 29 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) అదరగొట్టారు. రికార్డు ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్‌ 19.1 ఓవర్లలో 199 పరుగులకు కుప్పకూలింది. జేక్‌ ఫ్రేసర్‌ (65, 18 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్స్‌లు), అభిషేక్‌ పోరెల్‌ (42, 22 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌), రిషబ్‌ పంత్‌ (44, 35 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) పోరాడినా ఫలితం దక్కలేదు. సన్‌రైజర్స్‌ పేసర్‌ నటరాజన్‌ (4/19)తో సూపర్‌ ప్రదర్శన చేశాడు. ట్రావిశ్‌ హెడ్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు.
హైలైట్స్‌ తరహా ఇన్నింగ్స్‌ : టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన సన్‌రైజర్స్‌కు ఓపెనర్లు కలల ఆరంభం అందించారు. ట్రావిశ్‌ హెడ్‌ (89), అభిషేక్‌ శర్మ (46) తొలి వికెట్‌కు 6.2 ఓవర్లలోనే 131 పరుగులు జోడించారు. ఆరు సిక్సర్లు, 2 ఫోర్లతో అభిషేక్‌ రికార్డు అర్థ సెంచరీ ముంగిట నిలిచాడు. కానీ కుల్దీప్‌ మాయకు వికెట్‌ కోల్పోయాడు. ట్రావిశ్‌ హెడ్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఏడు ఫోర్లు, ఐదు సిక్సర్లతో 16 బంతుల్లోనే అర్థ సెంచరీ బాదిన హెడ్‌..పవర్‌ప్లేలో విధ్వంసానికి సరికొత్త నిర్వచనం ఇచ్చాడు. ఓపెనర్ల విధ్వంసంతో సన్‌రైజర్స్‌ రికార్డు స్కోరుకు గట్టి పునాది వేసుకుంది. అరాచక హిట్టింగ్‌తో దూసుకెళ్తున్న సన్‌రైజర్స్‌కు కుల్దీప్‌ యాదవ్‌ బ్రేక్‌ వేశాడు. అభిషేక్‌, హెడ్‌, మార్‌క్రామ్‌, నీతీశ్‌ కుమార్‌ వికెట్లతో క్యాపిటల్స్‌కు ఊరట అందించాడు. ఓకే ఓవర్లో అభిషేక్‌, మార్‌క్రామ్‌ను కుల్దీప్‌ అవుట్‌ చేయగా.. హెడ్‌, క్లాసెన్‌లు సైతం వరుస బంతుల్లోనే నిష్క్రమించారు. దీంతో మిడిల్‌ ఓవర్లలో సన్‌రైజర్స్‌ రన్‌రేట్‌ కాస్త తగ్గింది. అయినా, నితీశ్‌ కుమార్‌ (37)తో కలిసి షాబాజ్‌ అహ్మద్‌ (59 నాటౌట్‌) కీలక భాగస్వామ్యం నమోదు చేశాడు. రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 28 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించిన షాబాజ్‌ డెత్‌ ఓవర్లలో చెలరేగాడు. అబ్దుల్‌ సమద్‌ సైతం తోడవటంతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 266 పరుగులు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలర్లలో అక్షర్‌ పటేల్‌ (1/29) ఆకట్టుకున్నాడు.
పవర్‌ఫుల్‌ ప్లే
టాస్‌ నెగ్గి తొలుత సన్‌రైజర్స్‌కు బ్యాటింగ్‌ అప్పగించి ఢిల్లీ క్యాపిటల్స్‌ వ్యూహాత్మక తప్పిదం చేసింది. ట్రావిశ్‌ హెడ్‌ (89), అభిషేక్‌ శర్మ (46) తొలి ఆరు ఓవర్లలోనే ఊచకోత కోశారు. పవర్‌ప్లేలో ప్రపంచ రికార్డులు బద్దలుకొట్టారు. నోకియా, లలిత్‌ యాదవ్‌, కుల్దీప్‌, ముకేశ్‌ కుమార్‌, ఖలీల్‌లను ఉతికారేసిన ఓపెనర్లు టీ20 క్రికెట్‌ చరిత్రలోనే పవర్‌ప్లేలో (125/0) అత్యధిక స్కోరు చేశారు. తొలి రెండు ఓవర్లలో అభిషేక్‌ రెండు బౌండరీలతో మెరువగా.. హెడ్‌ విరుచుకుపడ్డాడు. మూడు సిక్స్‌లు, మూడు ఫోర్లతో విధ్వంసం చేశాడు. నోకియా వేసిన నాల్గో ఓవర్లో నాలుగు ఫోర్లు, ఓ సిక్సర్‌ బాదిన హెడ్‌ క్యాపిటల్స్‌ బౌలర్లలో భయం పుట్టించాడు. బంతి కుల్దీప్‌కు అందించినా ఎటువంటి ఉపయోగం లేకపోయింది. కుల్దీప్‌పై అభిషేక్‌ మూడు సిక్సర్లు బాదగా.. అంతకుముందే రెండు సిక్సర్లు కొట్టాడు. ముకేశ్‌ కుమార్‌ను హెడ్‌ వదల్లేదు. నాలుగు ఫోర్లు, ఓ సిక్సర్‌తో దంచికొట్టాడు. పవర్‌ప్లేలో హెడ్‌ 26 బంతుల్లో 84 పరుగులు చేయగా..అభిషేక్‌ 10 బంతుల్లో 40 పరుగులు పిండుకున్నాడు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 50 మార్క్‌ను 16 బంతుల్లోనే చేరుకోగా.. ట్రావిశ్‌ హెడ్‌ సైతం 16 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించాడు. 4.6 ఓవర్లలోనే 100 పరుగులు చేసిన సన్‌రైజర్స్‌ టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా మూడెంకల స్కోరు చేసిన జట్టుగా నిలిచింది. తొలి ఆరు ఓవర్లలో 20.68 రన్‌రేట్‌తో చెలరేగిన హెడ్‌, అభిషేక్‌ సన్‌రైజర్స్‌ ఊచకోతను కొనసాగించారు.

Spread the love