చేవెళ్లలో గులాబీ జెండా ఎగరడం ఖాయం

– ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలతో సమీక్షలో కేటీఆర్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
చేవెళ్లలో మరోసారి గులాబీ జెండా ఎగరడం ఖాయమని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడింట్‌ కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. శనివారం హైదరాబాద్‌లో చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌ అభ్యర్థిత్వానికి చేవెళ్ల ప్రజల నుంచి సానుకూల స్పందన లభించడంతోపాటు అన్ని వర్గాల నుంచి మద్దతు వస్తున్నదని తెలిపారు. 30 ఏండ్ల పాటు బడుగు, బలహీన వర్గాలతో పాటు సమాజంలోని అన్ని వర్గాల కోసం పనిచేసిన కాసాని జ్ఞానేశ్వర్‌కి, ఈ ఎన్నికల్లో గెలుపు తథ్యమన్నారు. ఆయన రాజకీయాల్లో అంచలంచెలుగా ఎదిగారని వివరించారు. సుదీర్ఘ అనుభవం కలిగిన రాజకీయ నాయకుడని తెలిపారు. ఈ సమావేశంలో నియోజక వర్గంలో అనుసరించాల్సిన వ్యూహాల పైన ప్రజల్లోకి తీసుకు వెళ్లాల్సిన అంశాల పైన చర్చించారు. పార్టీకి, నాయకత్వానికి నమ్మకద్రోహం చేసి వెళ్లిన రంజిత్‌ రెడ్డితో పాటు మహేందర్‌ రెడ్డిల వైఖరిని ప్రజలు అసహ్యించుకుంటున్నారని తెలిపారు. వారికి పార్టీ ఏం తక్కువ చేసిందని ప్రశ్నించారు.

Spread the love