ప్రముఖుల నామినేషన్లు

Celebrity nominations– బడా నేతలు, మంత్రుల ర్యాలీలు
– ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ఘర్షణ
– ఆలస్యమైందని పరిగెత్తిన రాజగోపాల్‌రెడ్డి
నవతెలంగాణ- విలేకరులు
నామినేషన్ల ప్రక్రియలో భాగంగా గురువారం అన్ని రాజకీయ పార్టీల్లో ప్రముఖ నేతలు, మంత్రులు నామినేషన్లు వేశారు. నామినేషన్లకు శుక్రవారం చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. సీపీఐ(ఎం) అభ్యర్థులు, సిరిసిల్లలో మంత్రి కేటీఆర్‌, సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు తదితరులు ఉన్నారు. నామినేషన్ల ర్యాలీ సందర్భంగా ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు రాళ్లు రువ్వుకున్నారు. ఉద్రిక్తత ఏర్పడటంతో పోలీసులు లాఠీచార్జి చేశారు
.ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్క, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి లింగాల కమల్‌రాజ్‌ నామినేషన్‌ దాఖలు చేశారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 168 నామినేషన్లు
నల్లగొండ ఉమ్మడి జిల్లాలో ఒక్క రోజే 168 నామినేషన్లు పడ్డాయి. ఆలస్యంగా ఆర్వో కార్యాలయానికి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి పరుగులు పెట్టారు. నల్లగొండ నియోజకవర్గానికి సంబంధించి కంచర్ల భూపాల్‌ రెడ్డి(బీఆర్‌ఎస్‌), నూనె కోటి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి (కాంగ్రెస్‌) నామినేషన్‌ వేశారు. మునుగోడులో కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి (బీఆర్‌ఎస్‌), కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (కాంగ్రెస్‌) నామినేషన్లు దాఖలు చేశారు. సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మంత్రి గుంట కండ్ల జగదీశ్‌రెడ్డి(బీఆర్‌ఎస్‌), కాంగ్రెస్‌ నుంచి రామిరెడ్డి దామోదర్‌ రెడ్డి, పటేల్‌ రమేష్‌ రెడ్డి, ముషం రవికుమార్‌ నామినేషన్లు వేశారు. హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్‌ నుంచి ఎంపీ నలమాద ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి రెండు సెట్ల నామినేషన్లు వేశారు.
హైదరాబాద్‌లోని కంటోన్మెంట్‌ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి లాస్య నందిత నామినేషన్‌ వేశారు కాంగ్రెస్‌ అభ్యర్థి డాక్టర్‌ వెన్నెల (గద్దర్‌ కుమార్తె) కూడా నామినేషన్‌ దాఖలు చేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో మంత్రి సబితాఇంద్రారెడ్డి తరపున ఆ పార్టీ నాయకులు నామినేషన్‌ వేశారు.
హంగూ ఆర్భాటాల్లేకుండా కేటీఆర్‌ నామినేషన్‌
బీఆర్‌ఎస్‌కు కంచుకోటలా ఉన్న సిరిసిల్లలో ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు. కేటీఆర్‌ ముఖ్య నేతలతో కలిసి జిల్లా కేంద్రంలోని ఆర్డీవో ఆఫీసుకు వెళ్లి నామినేషన్‌ దాఖలు చేశారు.
సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు
సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఏడోసారి మంత్రి హరీశ్‌రావు నామినేషన్‌ వేశారు. వనపర్తి నియోజకవర్గంలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో మంత్రి నామినేషన్‌ దాఖలు చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురి బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. బీఆర్‌ఎస్‌ సనత్‌నగర్‌ అభ్యర్థి మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సికింద్రాబాద్‌లోని జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్‌ కార్యాలయంలో నామినేషన్‌ పత్రాలను సమర్పించారు.
పొంగులేటి నామినేషన్‌పై ఉత్కంఠ..
అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థిగా పొంగులేటి గురువారం నామినేషన్‌ దాఖలు చేయాలని నిర్ణయించారు. అదేరోజు ఐటీ దాడులు చేయడం, పొంగులేటిని గృహ నిర్బంధంలోనే ఉంచడంతో నామినేషన్‌పై ఉత్కంఠ నెలకొంది. చివరకు ఎన్నికల కమిషన్‌ జోక్యంతో ఉదయం 10 గంటల తర్వాత నామినేషన్‌ కోసం పొంగులేటిని అనుమతించారు. ఆయన కుటుంబసభ్యులను మాత్రం ఇంట్లోనే ఉంచారు. భారీ ర్యాలీగా వెళ్లి ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నామినేషన్‌ ప్రక్రియ పూర్తి చేసిన శ్రీనివాసరెడ్డి ఆ తర్వాత 2.30 సమయంలో తిరిగి ఇంటికి చేరుకున్నారు. నామినేషన్‌ సమయంలోనూ ఐటీ అధికారులు వెంటే ఉన్నారు.

Spread the love