– విభజించు – పాలించు పాలసీతో దేశ సమగ్రతకు ముప్పు
– రైతులు, కూలీలు, కార్మికులకు వ్యతిరేకంగా మోడీ విధానాలు
– అందుకే బీజేపీని ఓడించాలి : ఎస్‌వీకే వెబినార్‌లో అఖిల భారత కిసాన్ సభ అధ్యక్షులు డా. అశోక్ ధావలే
హైదరాబాద్ : దేశాన్ని కార్పొరేట్లకు అమ్మేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని అఖిల భారత కిసాన్ సభ అధ్యక్షులు డా. అశోక్ ధావలే అన్నారు. అందులో భాగంగానే ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా బడా వ్యాపారుల పరం చేస్తుందని చెప్పారు. బ్రిటీష్ వారు అమలు చేసిన విభజించు – పాలించు పాలసీని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నదనీ, దీనివల్ల దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లుతుందన్నారు. ”బీజేపీని ఓడించాలని కిసాన్ మోర్చా ఎందుకు పిలుపునిచ్చింది” అనే అంశంపై సుందరయ్య విజ్ఞాన కేంద్రం శనివారం నిర్వహించిన వెబినార్‌లో అశోక్ ధావలే మాట్లాడారు. దేశంలో రైతులు, రైతు కూలీలు, కార్మికులు, మహిళలు, దళితులు, ఆదివాసీలు, బీసీలు, విద్యార్ధులకు వ్యతిరేకంగా బీజేపీ విధానాలున్నాయనీ, అందుకే త్వరలో జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికలతో పాటు సాధారణ ఎన్నికల్లో కూడా బీజేపీని ఓడించాలని సంయుక్త కిసాన్ మోర్చా, అఖిల భారత కిసాన్ సభ పిలుపునిచ్చిందని చెప్పారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు కట్టబట్టేందుకు మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు నల్ల చట్టాలను దేశ రైతాంగం సమిస్టిగా ఏకతాటిపైకి వచ్చి తిప్పికొట్టిందన్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో రోడ్లపై 380 రోజులు రైతులు ఆందోళన చేయడంతో మోడీ ఆ చట్టాలను వెనక్కి తీసుకున్నారని గుర్తుచేశారు. ఆ ఉద్యమంలో 750 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. అమరులకు నివాళులర్పించారు.
మోడీ అధికారం చేపట్టిన తర్వాత దేశంలో లక్షకు పైగా రైతులు, రైతు కూలీలు ఆత్మహత్య చేసుకున్నారని నేషనల్ క్రై రికార్డ్సు బ్యూరో ప్రకటించిందనీ, ప్రపంచ ఆకలి సూచి-2023లో బారత దేశం 111వ స్థానంలో ఉందని ఆయన పేర్కొన్నారు. రైతుల ఆత్మహత్యలకు మోడీ ప్రభుత్వ విధానాలే కారణమని చెప్పారు. రైతులు పండించే ప్రతి పంటకు ఎమ్మెస్పి ఇవ్వాలన్న స్వామినాథన్ కమిషన్ సిపార్సులను మోడీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు, డీజిల్ రేట్లు విపరీతంగా పెంచడంతో రైతుకు సాగు భారంగా మారిందన్నారు. ప్రతి పంటకు ఎమ్మెస్పి ప్రకటించాలనీ, రైతులు, రైతు కూలీలకు ప్రతి నెలా పెన్షన్ ఇవ్వాలని, రైతు రుణాలు మాఫీ చేయాలని అశోక్ థావలే డిమాండ్ చేశారు. వరికి కేంద్రం ప్రకటించిన మద్దతుధర కంటే అధికంగా కేరళలో రైతులకు ఆరాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక,కర్షక వ్యతిరేక విధానాలకు నిరసనగా నవంబర్ 26,27,28 తేదీల్లో దేశ వ్యాప్తంగా మహా ధర్నాకు ఎస్‌కెఎంతో పాటు అన్ని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయని అశోక్ థావలే చెప్పారు.