– తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఎస్సీలను వర్గీకరించే అంశంపై బీజేపీ వైఖరి మార్చుకోకుంటే ఆ పార్టీని రాష్ట్రంలో భూస్థాపితం చేస్తామని తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ హెచ్చరించింది. శనివారం హైదరాబాద్‌లోని కార్యాలయంలో జేఏసీ చైర్మెన్ చెరుకు రాంచందర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఆ సమావేశాన్ని ఉద్దేశించి రాంచందర్ మాట్లాడుతూ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఇల్లును, బీజేపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామనీ, ప్రధాని మోడీని అడ్డుకుంటామని హెచ్చరించారు. సుప్రీంకోర్టు ఆర్టికల్ 341 ప్రకారం ఎస్సీ వర్గీకరణ చేయడానికి వీలుకాదని చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. కిషన్ రెడ్డి, మోడీలు మాలల, రాజ్యాంగ వ్యతిరేకులని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాలల పంతం – బీజేపీ అంతం అనే నినాదంతో ఆ పార్టీని ఓడిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో జేఏసీ కన్వీనర్ నల్లాల కనకరాజు తదితరులు పాల్గొన్నారు.