మేడిగడ్డ నివేదికలో తొందరపాటు అంశాలున్నాయి

–  ఎన్‌డీఎస్‌ఎ కు రజత్‌ కుమార్‌ లేఖ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి -హైదరాబాద్‌
మేడిగడ్డ ఆనకట్టకు సంబంధించి జాతీయ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ లేవనెత్తిన అంశాలు, ఆరోపణలపై తగిన వివరాలతో రాష్ట్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. నివేదికకు సంబంధించి వివరణ ఇస్తూ నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ కుమార్‌ జాతీయ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ చైర్మెన్‌కు లేఖ రాశారు. ”నివేదికలో చాలా వరకు సంబంధం లేని అంశాలున్నాయి. వాస్తవాలను పూర్తిగా పరిగణనలోకి తీసుకోలేదు. రాష్ట్ర అథారిటీ ఇచ్చిన వివరాలను పూర్తిగా పరిశీలించలేదు. నివేదికలో తొందరపాటు అంశాలున్నాయి. విచారణ పూర్తికాకుండా కుంగుబాటుకు సరైన కారణాలు నిర్ధారించలేం. ప్రస్తుత స్థితిలో కేంద్ర అథారిటీతో అంగీకరించలేం. క్వాలిటీ కంట్రోల్‌ సరిగా లేదన్న అభిప్రాయంతో ఏకీభవించలేం” అని రజత్‌ కుమార్‌ లేఖలో పేర్కొన్నారు.
కుంగిన ఆనకట్టను పరిశీలించిన అనంతరం జాతీయ అధారిటీ ఇచ్చిన నివేదికపై నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ కుమార్‌ సమీక్ష నిర్వహించారు. ఈఎన్సీలు, ఇంజినీర్లతో సమావేశమైన ఆయన నివేదికలోని అంశాలపై చర్చించారు. అనంతరం అథారిటీ చైర్మన్కు లేఖ ద్వారా వివరణ ఇచ్చారు.
మేం సిద్ధం: ఎల్‌ అండ్‌ టీ
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డిజైన్లు, నాణ్యతా ప్రమాణాలకు లోబడే మేడిగడ్డ ఆనకట్టను నిర్మించామని, ఏడో బ్లాక్‌ దెబ్బతిన్న కొంత భాగాన్ని పునరుద్ధరించేందుకు కట్టుబడి ఉన్నామని లార్సెన్‌ అండ్‌ టుబ్రో సంస్థ ప్రకటించింది. ఆనకట్ట పునరుద్ధరణ పనులకు సంబంధించి ఆ సంస్థ శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డిజైన్లు, నాణ్యతా ప్రమాణాలకు లోబడి ఆనకట్ట నిర్మించి 2019లో అప్పగించినట్టు పేర్కొంది. మేడిగడ్డ ఆనకట్ట ఐదు సార్లు వరద సీజన్లను ఎదుర్కొందని తెలిపింది. మేడిగడ్డ అంశం ప్రస్తుతం సంబంధిత అధికార వర్గాల పరిశీలన, విచారణ, చర్చల్లో ఉందని ఎల్‌అండ్‌ వివరించింది. తదుపరి కార్యాచరణపై అధికారులు నిర్ణయానికి వచ్చిన వెంటనే దెబ్బతిన్న భాగాన్ని పునరుద్ధరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపింది.

Spread the love