దక్షిణ డిస్కంపై సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారం : టీఎస్‌పీడీసీఎల్‌ ఖండన

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
విద్యుత్‌ సరఫరాపై ”ఎక్స్‌” వేదికగా కొన్ని గ్రూప్‌లు అసత్య ప్రచారం చేస్తున్నాయని టీఎస్‌ఎస్‌ పీడీసీఎల్‌ పేర్కొంది. వాటిని ఖండిస్తూ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. దీనికి తోడు ఆయా పోస్టింగులను కోడ్‌ చేస్తూ దక్షిణ డిస్కం ట్విట్టర్‌ హేండిల్‌కు వ్యతిరేకంగా ట్వీట్లు చేస్తున్నారని పేర్కొంది. మరికొంత మంది తమ సర్వీస్‌ వివరాలు పెట్టకుండా అసత్య ప్రచారమే పనిగా పోస్టింగులు పెడుతున్నారనీ, దీని వల్ల టీఎస్‌ఎస్‌ పీడీసీఎల్‌కు విద్యుత్‌ సరఫరాలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వినియోగదారులెవరో కనిపెట్టడంలో పలు సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపింది.ఇటీవల, హైదరాబాద్‌ (నాంపల్లి) డిస్ట్రిక్ట్‌ క్రిమినల్‌ కోర్ట్‌లో ఎంసీబీ ట్రిప్పింగ్‌ వల్ల ఏర్పడ్డ అంతర్గత సమస్య వల్ల సరఫరాలో అంతరాయం కలిగితే, ”కోర్టులో క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేస్తుండగా పవర్‌ కట్‌…చీకటిలోనే వాదనలు విన్న జడ్జి” అని ”ఎక్స్‌” లో అసత్య సమాచారంతో కొందరు పోస్ట్‌ చేశారు. దీనికి స్పందనగా టీఎస్‌ఎస్‌ పీడీసీఎల్‌ ట్విట్టర్‌ ద్వారా విద్యుత్‌ అంతరాయానికి కారణాలు చెప్తూ ఆ అసత్య వార్తను ఖండించింది. దీనిపై పోలీసులకూ ఫిర్యాదు చేసింది. గతంలో కూడా, అసెంబ్లీలో విద్యుత్‌ అంతరాయమని అసత్య ప్రచారం చేశారనీ, వాస్తవానికి అక్కడ ఎలాంటి విద్యుత్‌ అంతరాయం లేదని స్పష్టం చేసింది. దానిపై కూడా పోలీస్‌ కంప్లైంట్‌ నమోదు చేసింది.గత కొద్ది రోజులుగా టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ ట్విట్టర్‌ ద్వారా నమోదయ్యే సరఫరా ఫిర్యాదుల్లో 20 నుంచి 30 మాత్రమే నిజమైనవి ఉంటున్నాయని వివరించింది. సమస్యలు ఎదుర్కొనే వారు తమ సర్వీస్‌ నెంబర్‌, ఏరియా వంటి పూర్తి వివరాలతో ఫిర్యాదు చేస్తున్నారు. కానీ గత కొద్దీ రోజులుగా కావాలని విద్యుత్‌ సంస్థను, ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని కొన్ని గ్రూపులు అసత్య ఫిర్యాదులు, అసత్య ప్రచారమే పనిగా పెట్టుకున్నాయి. ఫేక్‌ అకౌంట్స్‌ సృష్టించుకుని గత రెండు రోజులుగా లెక్కలేనన్ని అస్పష్టమైన/తప్పుడు వివరాలతో ట్వీట్లు చేస్తున్నాయని ఎస్‌పీడీసీఎల్‌ ఆవేదన వ్యక్తం చేసింది. కొన్ని సార్లు ఎఫ్‌ఓసీ సిబ్బంది, ట్వీట్లో పేర్కొన్న చిరునామాకు వెళ్ళగా అక్కడ ఎలాంటి సమస్య ఉండటం లేదని వివరించింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ నగర పరిధిలో దాదాపు 68 లక్షల మంది వినియోగదారులున్నారు. అన్ని క్యాటగిరీల వినియోగదారులకు నిరంతర విద్యుత్‌ సరఫరా వల్ల గతేడాది మేనెలలో వచ్చిన అత్యధిక డిమాండ్‌, వినియోగం ఈ ఏడాది 3మార్చి, ఏప్రిల్‌ నెలల్లో కూడా వచ్చింది. నిరంతర సరఫరా వల్ల ఈ ఏడాది ఏప్రిల్‌ 18న 4,053 మెగావాట్ల గరిష్ట డిమాండ్‌, 84.68 మిలియన్‌ యూనిట్ల వినియోగం జరిగిందని తెలిపింది. ఏప్రిల్‌ 19న 4093 మెగావాట్ల గరిష్ట డిమాండ్‌. 85.38 మిలియన్‌ యూనిట్ల వినియోగం రికార్డు స్థాయిలో నమోదయ్యిందని పేర్కొంది. భవిష్యత్తులో డిమాండ్‌ ఎంతగా పెరిగినా నిరంతర సరఫరా అందించే సంస్థ ఇంజినీర్లు, సిబ్బంది అనునిత్యం సంసిద్దులై ఉన్నారని ఆ సంస్థ వివరించింది.

Spread the love