కటకం సుదర్శన్‌ మరణం తర్వాత..

– మావోయిస్టులలో తాజా పరిణామాలపై
– ఇంటెలిజెన్స్‌ విభాగాల ఆరా
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
మావోయిస్టు అగ్రనాయకుడు, కేంద్ర కమిటీ సభ్యుడు కటకం సుదర్శన్‌ అలియాస్‌ ఆనంద్‌ మరణం తర్వాత మావోయిస్టు పార్టీలో నెలకొంటున్న పరిణామాలపై కేంద్ర ఇంటెలిజెన్స్‌ బ్యూరోతో పాటు ప్రభావిత రాష్ట్రాల నిఘా అధికారులు ఆరా తీస్తు న్నారు. నెల రోజుల క్రితం కటకం సుదర్శన్‌ గుండె పోటుతో మరణించినట్టు ఆ పార్టీ అధికార ప్రతినిధి అభరు ఇటీవల ప్రకటించారు. పార్టీలో కీలక నేతగా గుర్తింపు పొందిన సుదర్శన్‌ పార్టీ వ్యూహరచన, సిద్ధాంతవ్యాప్తిలో కీలకపాత్ర వహించినట్టు ఇంటెలిజెన్స్‌ వద్ద సమాచారం ఉన్నది. ముఖ్యంగా, దండకారణ్యంలో పటిష్టమైన పీపుల్స్‌ గెరిల్లా ఆర్మీని తయారు చేయటంలోనూ సుదర్శన్‌కు సిద్ధహస్తుడిగా పేరున్నది. ఇంతటి కీలక నేత మరణించటంతో మావోయిస్టుల పార్టీ కార్యకలాపాల్లో దాని ప్రభావం ఏ మేరకు ఉన్నదనే కోణంలో నిఘా అధికారులు నిశితంగా దృష్టిని సారించినట్టు తెలిసింది. ఇటీవలి కాలంలో మావోయిస్టు అగ్రనేతలైన అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ రామకృష్ణ, హరిభూషన్‌తో పాటు మరికొందరు నేతలు అనా రోగ్య కారణాల వలన మృతిచెందిన వైనాలను కూడా పరిగణలోకి తీసుకొని ఇంటెలిజెన్స్‌ అధికారులు ఆరా తీస్తున్నట్టు తెలుస్తున్నది. అదే సమయంలో జంపన్నతో పాటు మరికొందరు నాయకులు లొంగు ‘బాట’లో నడవటం కూడా మావోయిస్టుల బలాన్ని ఏ మేరకు తగ్గించగలిగిందనేది కూడా ఇంటెలిజెన్స్‌ అధికారులు అంచనా వేస్తున్నట్టు సమాచారం. మొత్తమ్మీద 2024 లోక్‌సభ ఎన్నికల నాటికి మావో యిస్టుల కార్యకలాపాలను పూర్తిగా అణచివేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్టు కేంద్ర హోం శాఖ గతంలో ప్రకటించింది. ఈ నేపథ్యంలో మావోయిస్టు పార్టీలోని కీలక నేతలు కొందరు మరణించటం, మరికొందరు లొంగిపోవటాన్ని యాంటీ నక్సలైట్‌ విభాగాలు మదింపు చేస్తూ మావోయిస్టుల కార్యకలా పాలను అణచివేయటానికి వేయాల్సిన కొత్త ఎత్తుగడలపై కేంద్ర ఇంటెలిజెన్స్‌ బ్యూరోతోపాటు తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, బీహార్‌, ఒడిశా, ఏపీ రాష్ట్రాల నిఘా అధికారులు సమిష్టిగా చర్చించి వ్యూహాలను రచిస్తున్నారని తెలిసింది. అదే సమయంలో రాష్ట్రంలో సైతం వచ్చే ఆరు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నందున మావోయిస్టుల కదలికలపై ఇప్పటి నుంచే దృష్టిని సారించాలని మావోయిస్టు ప్రభావిత జిల్లాల ఎస్పీలను డీజీపీ అంజనీ కుమార్‌ ఇప్పటికే ఆదేశించారు. అంతేగాక, ఎప్పటికప్పుడు ప్రభావిత జిల్లాల్లోని పరిస్థితులపై ఆయన ఉన్నతాధికారులతో చర్చిస్తున్నారని తెలిసింది.

Spread the love