బాలాసోర్‌ ఘటనకు మతం రంగు

– మతోన్మాదుల కట్టుకథలు తోసిపుచ్చిన అధికారులు
భువనేశ్వర్‌ : బాలాసోర్‌ రైలు ప్రమాదంపై అటు సీబీఐ, ఇటు రైల్వే శాఖ విచారణ జరుపు తున్నాయి. ప్రమాద కారణాన్ని తెలుసుకునే పనిలో నిమగమయ్యాయి. అయితే ఈ దుర్ఘటనపై మీడియాలోనూ, సోషల్‌ మీడియాలోనూ పలు కథనాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా ఈ ఘటనకు మతం రంగు పులిమేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. సంఘటన జరిగిన తర్వాత బాహానగర్‌ బజార్‌ రైల్వే స్టేషన్‌ స్టేషన్‌ మాస్టర్‌ షరీఫ్‌ కన్పించడం లేదంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు కన్పించాయి. ఆ తర్వాత వాటిలో కొన్ని పోస్టులను తొలగించారు. బీజేపీ ఐటి విభాగం అధిపతిగా చెప్పుకుంటున్న ఓ వ్యక్తి కూడా ఇలాంటి పోస్టే పెట్టారు. ‘విచారణకు ఆదేశించిన తర్వాత స్టేషన్‌ మాస్టర్‌ షరీఫ్‌ అదృశ్యమయ్యారు. ఈ మతం వారితో ఇదే సమస్య’ అంటూ ఆయన ట్వీట్‌ చేశారు. కొందరు పనిలో పనిగా దీనిని రీ-ట్వీట్‌ చేశారు కూడా. ట్విటర్‌ బ్లూ వినియోగదారుడైన ఓ వ్యక్తి అయితే ఈ ప్రమాదానికి స్టేషన్‌ మాస్టరే కారణమని తేల్చే శారు.’ఇది ప్రమాదం కాదు. నిర్లక్ష్యమూ కాదు. కన్పిం చకుండా పోయిన స్టేషన్‌ మాస్టర్‌ షరీఫ్‌ ఉద్దేశపూర్వకంగాచేసిన పని. గూడ్సు రైలు ఉన్న లూప్‌ లైన్‌లోకి కోర మాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ను పంపా రు. స్టేషన్‌ మాస్టర్‌ పాత్రపై విచారణ జరిపితే పన్నాగం బయట పడుతుంది ‘అంటూ ఆయన ట్వీట్‌ చేశారు. రైలు పట్టాల సమీపంలో మసీదు ఉండడం తో పలువురు స్టేషన్‌ మాస్టర్‌ షరీఫ్‌ వైపు వేలెత్తి చూపుతున్నారు. పట్టాల పక్కన మసీదు ఉన్న ఫొటోలను కూడా షేర్‌ చేస్తు న్నారు. అయితే ఆ భవనం వాస్తవానికి మసీదు కాదు… అది ఇస్కాన్‌ దేవాలయం. ఇక స్టేషన్‌ మాస్టర్‌ గది వెలుపల ఉన్న ఓ బోర్డు పైన సిబ్బంది పేర్లు రాశారు. వాటిలో షరీఫ్‌ అన్న పేరే లేదు.
ఈ నెల 4న కళింగ టీవీ ప్రసారం చేసిన వార్త శీర్షిక ఇలా ఉంది ‘బాహనగర్‌ అసిస్టెంట్‌ స్టేషన్‌ మాస్టర్‌ పరారీ’. వార్తలోకి వెళితే ‘రైలు ప్రమాదం జరిగిన తర్వాత విధుల్లో ఉన్న అసిస్టెంట్‌ స్టేషన్‌ మాస్టర్‌ ఎస్‌బీ మొహంతీ ఆచూకీ తెలియడం లేదు’ అని ఉంది. అయితే మొహంతీని విచారి స్తున్నారంటూ ఈ నెల 5న మరో వార్తను ఆ టీవీ అందించింది. ఒడిశాకు చెందిన ఇద్దరు సీని యర్‌ ఐపీఎస్‌ అధికారులను సంప్రదించగా స్టేషన్‌ మాస్ట ర్లు ఎవరూ పారిపోలేదని, పోలీసులు వారిని సంప్రది స్తూనే ఉన్నారని తెలిపారు. స్టేషన్‌ సిబ్బందిలో షరీఫ్‌ పేరు ఉన్న వారు ఎవరూ లేరని కూడా చెప్పారు. స్టేషన్‌ సిబ్బంది మొత్తం విచారణకు హాజర వుతున్నారని అన్నారు. భువనేశ్వర్‌కు చెందిన పాత్రికే యులు కూడా ఈ విషయాన్నే ధృవీకరించారు. రైల్వే పీఆర్‌ఓ నిహార్‌ మొహంతీ కూడా ఇదే మాట చెప్పారు. ఎప్పుడో 2004 మార్చిలో పోస్ట్‌ చేసిన చిత్రాలను ఇప్పుడు కొందరు వినియోగిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అర్థమవుతోంది. వైరల్‌ అయిన ఫొటో లో చూపిన వ్యక్తి బొర్రా గుహల స్టేషన్‌ మాస్టర్‌ అని తేలింది.

Spread the love