‘సగటు’తో సతమతం

Agree with 'average'– గృహజ్యోతి పథకంలో బాలారిష్టాలు
– మీటర్‌ రీడింగ్‌ సకాలంలో తీయక అనర్హత
– 200 యూనిట్ల ఫ్రీ కరెంటు కోసం పాట్లు
– కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు
‘గృహజ్యోతి’ పథకంలో భాగంగా జీరో కరెంట్‌ బిల్లు వచ్చిన లబ్దిదారుల్లో సంతోషం వెల్లివిరుస్తుండగా.. అర్హతవున్నా మీటర్‌ రీడింగ్‌ సకాలంలో తీయకపోవడంతో సున్నా బిల్లుకు నోచుకోని వినియోగదారులు నైరాశ్యంలో ఉన్నారు. 30 రోజుల బిల్లును 36 రోజులకు తీసి.. నెలరోజులకు యావరేజ్‌ కట్టడంతో అర్హత కోల్పోయిన వినియోగదారులు ఆవేదన చెందుతున్నారు.
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
గృహజ్యోతి పథకంలో భాగంగా ప్రభుత్వం ఈనెల నుంచి అమలు చేస్తున్న 200 యూనిట్ల లోపు ఫ్రీ కరెంట్‌కు అర్హతున్నా నోచుకోలేకపోయిన వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది. ఒక్కొక్కరికి ఒక్కో సమస్య ఉత్పన్నమవు తుండటంతో కరెంట్‌ ఆఫీసులు, పంచాయతీ, ఎంపీడీవో, మున్సిపల్‌ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈనెలతో బాలారిష్టాలను అధిగమించి వచ్చేనెల నుంచి అర్హులందరికీ సంపూర్ణంగా ఉచిత విద్యుత్‌ అమలు చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రత్యేక కౌంటర్లను సైతం నెలకొల్పింది. వారం రోజుల క్రితం ప్రారంభమైన ఈ కౌంటర్లకు వినియోగదారులు బారులు తీరుతున్నారు. ప్రజాపాలన దరఖాస్తులో లోపాల కారణంగా కొందరు అర్హత కోల్పోగా.. కొందరు దరఖాస్తు సమయంలో సరైన ఆధారాలను సమర్పించకపోవడం కూడా సమస్యగా మారింది. కొన్ని ఆన్‌లైన్‌ సమస్యలు కూడా వెలుగుచూస్తున్నాయి. రాష్ట్రంలో చాలా చోట్ల ఈ సమస్య ఉంది. కొంతమందికి జీరో బిల్లు వచ్చి మరికొందరికి రాకపోవడంతో ఆసంతృప్తిలో ఉన్నారు. దీనిపై ఒక్కొక్క చోట వేలల్లో దరఖాస్తులు అందుతున్నాయి.
ఖమ్మం కార్పొరేషన్‌లోనే ఒక్కరోజే 5వేల దరఖాస్తులు..
ప్రజాపాలన దరఖాస్తుల్లో లోపాలను సరిదిద్దేందుకు ఏర్పాటు చేసిన కౌంటర్లకు జనం భారీగా బారులు తీరుతున్నారు. ఖమ్మం కార్పొరేషన్‌లో సోమవారం ఒక్కరోజే ఐదువేల మందికి పైగా దరఖాస్తులు సమర్పించారు. పది కౌంటర్ల ద్వారా వీటిని స్వీకరించారు. సిబ్బంది కార్యాలయానికి రాకముందు నుంచే బాధితులు బారులు తీరుతున్నారు. కార్పొరేషన్‌లో 1,00,736 దరఖాస్తులు వచ్చాయి. వాటిని ఆన్‌లైన్‌ చేసినా జీరో కరెంట్‌ బిల్లు రాకపోవడంతో ఎక్కడ తప్పిదం జరిగిందో తెలియక వినియోగదారులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మండల పరిషత్‌ కార్యాలయాల్లోనూ ఇదే తంతు కొనసాగుతోంది. వేలాదిగా దరఖాస్తులు సమర్పిస్తుండటంతో సర్వర్‌ బిజీ వస్తోంది. జిల్లా వ్యాప్తంగా 4.27 లక్షల గృహ విద్యుత్‌ వినియోగదారులున్నారు. వీరిలో 3.85 లక్షల మంది 200 యూనిట్ల లోపు కరెంట్‌ వినియోగిస్తున్నట్టు ప్రజాపాలనలో దరఖాస్తు చేశారు. ఆధారాలను పరిశీలిస్తే 3.55 లక్షల మంది సరైన ఆధారాలు సమర్పించారు. వీరిలో 2.29 లక్షల మంది మాత్రమే జీరో బిల్లుకు అర్హులుగా అధికారులు గుర్తించారు.
యావరేజ్‌ పేరుతో అనర్హత..
మీటర్‌ రీడింగ్‌ సకాలంలో తీయకపోవడంతో యావరేజ్‌ (సగటు) ప్రాతిపదికన బిల్లు కౌంట్‌ చేస్తున్నారు. ఒక నెల 36 రోజులకు మరో నెల 27 లేదంటే 28 రోజులకు రీడింగ్‌ తీస్తున్నారు. సగటు నెలరోజులకు లెక్కిస్తుండటంతో యూనిట్లు 200కు పైగా చేరుతున్నాయి. దీనివల్ల 200 యూనిట్ల సమీపంలో22కి వచ్చిన వారి సగటు లెక్కించడంతో అర్హత కోల్పోతున్నారు.
193 యూనిట్లు వాడినా సగటు పేరుతో అనర్హత..
ఎర్రుపాలెం మండల కేంద్రానికి చెందిన కోటి శివారెడ్డి ఖమ్మం బుర్హన్‌ పురంలోని (ఏరియా జోన్‌ 11) ఆర్‌. అనురాధ (యూఎస్‌సీఎన్‌వో :15420138) ఇంట్లో అద్దెకు ఉంటు న్నారు. ప్రయివేటు అకౌంటెంట్‌గా పని చేస్తున్నారు. జనవరిలో 4వ తేదీన ఆయన కరెంట్‌ బిల్లు తీశారు. తిరిగి ఫిబ్రవరి 9వ తేదీన అంటే 36 రోజుల తర్వాత రీడింగ్‌ చేశారు. మొత్తం ఆయన 292 యూనిట్లు వాడితే సగటు లెక్కించి 251 యూనిట్లుగా తేల్చారు. మొత్తం నెట్‌ ఎమౌంట్‌ రూ.1818 పేర్కొంటూ బిల్లు ఇచ్చారు. ఫిబ్రవరిలో 9వ తేదీన బిల్లు చేసిన అధికారులు తిరిగి 27 రోజుల తర్వాత మార్చి 7వ తేదీన ఈనెల బిల్లు తీశారు. మొత్తం 193 యూనిట్లు వాడినట్టు తేల్చారు. గత నెల 36 రోజులు, ఈనెల 27 రోజులు వెరసి 30 రోజుల సగటు తీశారు. దాంతో శివారెడ్డి వాడిన యూనిట్ల సంఖ్య 207.30కు చేరింది. దీనివల్ల అతను గృహజ్యోతి జీరో కరెంట్‌ పథకానికి అర్హత కోల్పోయాడు. ఇలా ఎంతో మంది సగటు గణాంకాలు తెలియక సతమతమవుతున్నారు.
బార్డర్లోకి వస్తే ఇలాంటి ఇబ్బందులే.. : – ఎ. సురేందర్‌, ఖమ్మం సర్కిల్‌ పర్యవేక్షక ఇంజినీర్‌
200 యూనిట్ల లోపు వాడితే జీరో కరెంట్‌ బిల్లు వస్తుంది. కానీ మీటర్‌ రీడింగ్‌ వివిధ కారణాల రీత్యా ఒకనెల 27 రోజులకు తీయవచ్చు.. ఒక నెల 36, 37 రోజులకు కూడా తీయవచ్చు. దీనిబట్టి నెల సగటు (యావరేజ్‌) లెక్కించాల్సి ఉంటుంది. అలాంటప్పుడు బార్డర్‌లో ఉన్నవారి యావరేజ్‌ 200 యూనిట్లు దాటే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు 170-180 యూనిట్ల లోపు వాడితే సగటు తీసినా ఇబ్బంది ఉండదు. ఈనెల తక్కువ యూనిట్లు వాడితే ఇలాంటి వారు వచ్చేనెల అర్హత పొందుతారు. ఈనెల 200 యూనిట్ల లోపు వాడినా వచ్చేనెల అంతకుమించి వాడితే ఆ నెల బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. మరుసటి నెల యావరేజ్‌ యూనిట్లు తగ్గితే చెల్లించాల్సిన అవసరం ఉండదు.

Spread the love