కాంగ్రెస్‌వన్నీ 420 హామీలు

కాంగ్రెస్‌వన్నీ 420 హామీలు– కృష్ణా జలాలను కేఆర్‌ఎంబీకి ఇచ్చిందే కాంగ్రెస్‌
–  అమరులకు నివాళ్లర్పించని వ్యక్తి.. నేడు సీఎం :షాద్‌నగర్‌ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు
నవతెలంగాణ-షాద్‌నగర్‌
కాంగ్రెస్‌ పార్టీ 420 దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు. కృష్ణా జలాలను కేఆర్‌ఎంబీకి అప్పగించిందే కాంగ్రెస్‌ అని తెలిపారు. తెలంగాణ కోసం పుట్టిన పార్టే బీఆర్‌ఎస్‌ అని, రాష్ట్ర హక్కుల విషయంలో ఎప్పుడూ రాజీపడబోమని స్పష్టంచేశారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ పట్టణంలోని కుంట్ల రామ్‌ రెడ్డి ఫంక్షన్‌ హాల్‌లో మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ అధ్యక్షతన నిర్వహించిన బీఆర్‌ఎస్‌ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. చావు నోట్లో తలపెట్టి కేసీఆర్‌ తెలంగాణ సాధించారని, ఎప్పుడూ కూడా జై తెలంగాణ అనని వ్యక్తి, ఉద్యమకారులపైకి తుపాకి పట్టుకొని వెళ్లిన వ్యక్తి నేడు సీఎం అయ్యాడని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటి వరకు అమరవీరులకు నివాళి అర్పించలేదని, ఈ విషయంలో తాను ఎంతో కలత చెందానని అన్నారు.
తెలంగాణ ఉద్యమంలో షాద్‌నగర్‌ ఎంతో క్రియాశీలకంగా పాల్గొన్నదని వివరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి కేవలం స్పీడ్‌ బ్రేకర్‌ మాత్రమేనని, మళ్లీ స్పీడ్‌ అందుకుంటామని తెలిపారు. కరోనా కాలంలో కూడా రైతుబంధు ఇచ్చిన ఘనత కేసీఆర్‌దే అన్నారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటికీ రైతుబంధు ఇవ్వలేదన్నారు. బీఆర్‌ఎస్‌ ఓడినా, గెలిచినా ఎప్పటికీ ప్రజల పక్షమేనని తెలిపారు. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు అమలు చేసేంతవరకు వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఒక్క నోటిఫికేషన్‌ ఇవ్వలేదని అన్నారు. హామీల గురించి అడిగితే అసెంబ్లీలో తప్పుడు శ్వేత పత్రాలతో డైవర్ట్‌ చేసే ప్రయత్నం చేశారని, వాస్తవాలు బయట పెడితే తిట్టడం మొదలు పెట్టారని అన్నారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు మాట్లాడరని ఆరోపించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌ పనులు 80శాతం పూర్తి అయ్యాయని, కాలవలు తవ్వితే నీళ్ళు వస్తాయని, కాంగ్రెస్‌ వాళ్ళు ఆ పని పూర్తి చేసి నీళ్లు అందియ్యాలన్నారు. స్వరాష్ట్రంలోనే పాలమూరుకు మెడికల్‌ కాలేజీలు వచ్చాయన్నారు. అక్రమ కేసులకు కార్యకర్తలు భయపడొద్దని, ప్రతి ఒక్కరికీ పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌ గడ్డపై మళ్లీ బీఆర్‌ఎస్‌ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. దీని కోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేయాలన్నారు. అంతకుముందు తెలంగాణ అమరవీరుడు సిరిపురం యాదయ్య వర్థంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి, అలాగే దివంగత గాయకుడు సాయిచంద్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో ఎంపీ మన్నే శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రులు శ్రీనివాస్‌ గౌడ్‌, లక్ష్మారెడ్డి, జడ్పీ వైస్‌ చైర్మెన్‌ ఈట గణేష్‌, మున్సిపల్‌ చైర్మెన్‌ నరేందర్‌, వైస్‌ చైర్మెన్‌ నటరాజన్‌, నాయకులు రాజవరప్రసాద్‌రావు, ఇబ్రహీం, రాంబాల్‌నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love