Tuesday, June 30, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంబీడీ కార్మికులందరికీ జీవన భృతి ఇవ్వాలి..

బీడీ కార్మికులందరికీ జీవన భృతి ఇవ్వాలి..

- Advertisement -

పీఎఫ్‌ పింఛన్‌పై పార్లమెంట్‌లో 
కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడాలి:
తెలంగాణ బీడీ అండ్‌ సిగార్‌ 
వర్కర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) డిమాండ్‌
కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు
కాంగ్రెస్‌ ప్రభుత్వ హామీని అమలు చేయాలి
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి/కంఠేశ్వర్‌
బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులకు జీవన భృతి ఇవ్వాలని తెలంగాణ బీడీ అండ్‌ సిగార్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) నాయకులు డిమాండ్‌ చేశారు. యూనియన్‌ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పలు జిల్లాల కలెక్టరేట్ల ఎదుట సోమవారం బీడీ కార్మికులు ధర్నాలు చేశారు. బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులందరికీ ప్రభుత్వం రూ.4016 జీవనభృతి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.
మెదక్‌, సిద్దిపేట కలెక్టరేట్ల ముందు బీడీ కార్మికులు పెద్దఎత్తున ఆందోళన నిర్వహించారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం బీడీ కార్మికుల జీవన భృతి రూ. 4016కు పెంచి అమలు చేయాలని తెలంగాణ బీడీ అండ్‌ సిగార్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు కాముని గోపాలస్వామి, మెదక్‌ జిల్లా సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏ.మల్లేశం డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో వ్యవసాయం తర్వాత బీడీ పరిశ్రమ పెద్ద ఉపాధి కల్పిస్తున్నది తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్‌ అనుకూల విధానాల ఫలితంగా జీఎస్‌టీ పేరుతో పన్నులు పెంచడం, పుర్రె గుర్తు సైజు పంచడం వల్ల బీడీ పరిశ్రమ దెబ్బ తింటోందన్నారు. రాష్ట్రంలో 3 బడ్జెట్‌ సమావేశాలు జరిగినప్పటికీ బీడీ కార్మికుల జీవన భృతి కోసం కేటాయింపులు లేవని విమర్శించారు. బీడీ కార్మికులకు షరతులు లేని జీవనభృతి రూ.4016 అమలు చేయాలని, నెలలో 26 రోజుల పని కల్పించాలని డిమాండ్‌ చేశారు.

నిజామాబాద్‌ కలెక్టరేట్‌ ఎదుట ధర్నా అనంతరం కలెక్టర్‌ ఇలా త్రిపాఠికి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు రమేష్‌బాబు మాట్లాడుతూ.. జిల్లాలో రెండున్నర లక్షల మంది బీడీ కార్మికులు ఉండగా, గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కొద్దిమందికి మాత్రమే జీవనభృతి చెల్లిందని తెలిపారు. బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులందరికీ జీవనభృతి రూ.4016కు పెంచి చెల్లిస్తామని కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీనిచ్చి మాట తప్పిందన్నారు. వెంటనే బీడీ కార్మికులందరికీ జీవనభృతి ఇవ్వాలని, లేకపోతే రానున్న పెద్దఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ జిల్లా అధ్యక్షులు గంగా మోహన్‌, కోశాధికారి నన్నేసాబ్‌, బీడీ కార్మికులు మహబూబ్‌, నవీన్‌, రజిని, లక్ష్మీ, సుజాత తదితరులు పాల్గొన్నారు.
బీడీ కార్మికులకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని అమలు చేయాలని వెంటనే పెన్షన్‌ రూ.4016, కేంద్ర ప్రభుత్వం పీఎఫ్‌ పింఛన్‌ రూ.6వేలు ఇవ్వాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఆర్‌డీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. అనంతరం అధికారికి వినతిపత్రం ఇచ్చారు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజరు పార్లమెంటులో బీడీ కార్మికుల పీఎఫ్‌ పెన్షన్‌ అమలుపై మాట్లాడాలని యూనియన్‌ జిల్లా గౌరవ అధ్యక్షులు మూషం రమేష్‌ డిమాండ్‌ చేశారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -