ముఖ్యమంత్రివన్నీ అబద్ధాలే..

All Chief Ministers are liars..– ప్రాజెక్టులు కేంద్రానికి అప్పగించి నిందలు మాపై సరికాదు
– పోతిరెడ్డిపాడుపై కొట్లాడింది బీఆర్‌ఎస్‌ పార్టీనే
– తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు : మాజీ మంత్రి హరీశ్‌ రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌ రావు విమర్శించారు. సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పదేండ్లలో రాష్ట్రానికి చెందిన ఏ ప్రాజెక్ట్‌నూ కేంద్రానికి కేసీఆర్‌ అప్పగించలేదని అన్నారు. అధికారం చేపట్టిన రెండు నెలలకే సీఎం రెండు ప్రాజెక్టులను అప్పగించి తప్పులను తమపైకి నెడుతున్నారని ఆరోపించారు. జనవరి 17న ఢిల్లీలో జరిగిన మీటింగ్‌లో ప్రాజెక్టుల అప్పగింతకు ఆమోదం తెలిపారన్నారు. మినిట్స్‌లో అది స్పష్టంగా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వానికి ఉలుకూ పలుకూ లేదని విమర్శించారు. 19న తాము ప్రశ్నించడంతో ఒప్పుకోలేదని లేఖ రాశారని చెప్పారు. ఫిబ్రవరి ఒకటో తేదీన రెండో కేఆర్‌ఎంబీ మీటింగ్‌ జరిగిందనీ, ఆ మీటింగులోనూ ప్రాజెక్టులు ఇవ్వడానికి ఒప్పుకున్నట్టు మినిట్స్‌లో ఉందని గుర్తు చేశారు. పవర్‌ హౌజ్‌ల అప్పగింతకు మాత్రమే అభ్యంతరం చెప్పారనీ, నీటి ప్రాజెక్టులపై మాత్రం అభ్యంతరం చెప్పలేదని విమర్శించారు. కేఆర్‌ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నట్టు రెండు రాష్ట్రాల ఈఎన్సీలు చెప్పారన్నారు. ”నెల రోజుల్లో అప్పగిస్తామని ప్రభుత్వం చెప్పింది. సీఆర్‌పీఎఫ్‌ పర్మిషన్‌తో ప్రాజెక్టుల వద్దకు ఇంజినీర్లు వెళ్ళాలని అందులో ఉంది. రెండు రాష్ట్రాలు నిర్వహణ చేయాలని మినిట్స్‌లో ఉంది” అని హరీష్‌ రావు తెలిపారు. 16, 17 మీటింగ్‌లలో అప్పగిస్తామని మేమెక్కడా చెప్పక పోయినా కేసీఆర్‌ స్వయంగా సంతకాలు చేశారని అబద్దాలు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసత్యాలను ప్రజలు, మేధావులు గుర్తించాలని కోరారు. పోతిరెడ్డి పాడు విషయంలో సైతం తామెన్నడూ రాజీ పడలేదని చెప్పారు. ఆ జీఓ వచ్చినప్పుడు ముందుండి పోరాటం చేశామనీ, పదవులను వదులుకున్నామని తెలిపారు. జూలై 4, 2005న మంత్రి పదవులకు రాజీనామా చేస్తే, 13 సెప్టెంబర్‌ 2005న జీఓ వచ్చిందనీ, పదవుల్లో ఉన్నపుడు పోతిరెడ్డిపాడు జీఓ వచ్చిందని రేవంత్‌ ఎలా మాట్లాడుతారని ప్రశ్నించారు. రెండో అపెక్స్‌ కమిటీ మినిట్స్‌లో రాయలసీమ, పోతిరెడ్డి పాడులపై అభ్యంతరం చెప్పామని మినిట్స్‌లో ఉందనీ, కావాలంటే చెక్‌ చేసుకోవాలని సూచించారు. విభజన చట్టం రూపొందించిన కాంగ్రెస్‌ పార్టీని కాదని నిందలు తమపై వేయడం సబబని అన్నారు. తమకు తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యమని తేల్చి చెప్పారు. వాస్తవాలను పక్కదోవ పట్టించేందు కేసీఆర్‌పై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని విమర్శలు గుప్పించారు. తాము చర్చనుంచి పారిపోమనీ, అసెంబ్లీలో ఆధారాలతో సహా నిరూపిస్తామని చెప్పారు.

Spread the love