రైతు వేదికల నుంచి పంపిణీ చేయండి
బోనస్ ఇచ్చే 7 రకాల సన్నవడ్ల విత్తనాలను అందుబాటులో ఉంచండి
అవి పండించే రైతుల వివరాలు సేకరించండి
శాఖల మధ్య సమన్వయం అత్యవసరం
పంట కొనుగోళ్లపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు
ఎరువుల కోసంఅఖిలపక్ష ఎంపీలతో ఢిల్లీకి : వ్యవసాయశాఖ సమీక్షలో అధికారులకు సీఎం ఏ రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఎరువుల పంపిణీలో పారదర్శకత, వేగం పెంచేందుకు అన్ని రకాల ఫెర్టిలైజర్లను యాప్ ద్వారా బుక్ చేసే విధానం తీసుకురావాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. యాప్ ద్వారా రైతులు బుక్ చేసుకున్న యూరియాను రైతు వేదికల ద్వారానే పంపిణీ చేయాలని సూచించారు. ఈ బాధ్యతల్ని జిల్లా అదనపు కలెక్టర్లకు అప్పగించాలని చెప్పారు. అలాగే ప్రభుత్వం బోనస్ ఇస్తున్న 7 రకాల సన్నవడ్ల విత్తనాలను కూడా రైతు వేదికల వద్ద అందుబాటులో ఉంచాలనీ, వాటిని పండించే రైతుల వివరాలను సేకరించాలని ఆదేశించారు. మంగళవారంనాడిక్కడి మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎమ్‌సీహెచ్‌ఆర్డీ)లోని బోధి పెవిలియన్‌లో వ్యవసాయ శాఖపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు, సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రి ,వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, పౌర సరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి, ప్రణాళికా శాఖ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
రైతులకు విత్తనాల సరఫరా నుంచి పండించిన పంట ఉత్పత్తుల కొనుగోళ్ల వరకు సమగ్ర ప్రణాళిక, నిర్దిష్ట కార్యాచరణను అమలు చేయాలని సీఎం అధికారుల్ని అదేశించారు.
పంట వేసినప్పటి నుంచే రైతుల వివరాల నమోదు, పంటల వివరాల రికార్డులు, దిగుబడి అంచనాలు, ధాన్యం కొనుగోళ్ల వరకు ప్రతి దశలో వ్యవసాయ శాఖకు పూర్తి అవగాహన ఉండాలని దిశానిర్దేశం చేశారు. ధాన్యం కొనుగోళ్లలో ఇప్పటివరకు ఉన్న అనుభవాలు, రైతులు ఇబ్బంది పడకుండా చేపట్టాల్సిన చర్యలపై రైతు కమిషన్, అగ్రికల్చర్ యూనివర్సిటీ, వ్యవసాయ నిపుణులు ఇచ్చిన సలహాలు, సూచనలపై ఈ సమావేశంలో విస్త్రుతంగా చర్చించారు. వచ్చే సీజన్ నుంచి రైతులు ఎక్కడా ఇబ్బంది పడకుండా కొనుగోళ్లు సాఫీగా జరిగేలా ఇప్పుడే ఉన్నతాధికారుల కమిటీని ఏర్పాటు చేయాలని సీఎస్ రామకృష్ణారావును అదేశించారు. వ్యవసాయ శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో పనిచేసే ఈ కమిటీలో ఆ శాఖ డైరెక్టర్, పౌరసరఫరాలశాఖ మేనేజింగ్ డైరెక్టర్, ప్లానింగ్ విభాగం కార్యదర్శి సభ్యులుగా ఉండాలని చెప్పారు. పై అంశాలన్నీ ఈ కమిటీ ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, అవసరమైతే క్షేత్రస్థాయిలో పర్యవేక్షించడం, దానికోసం అవసరమైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకుంటూ ఏ రైతు ఏ పంట వేశాడు.. ఏ గ్రామంలో ఏయే పంటలు ఎంత విస్తీర్ణంలో ఉన్నాయనే వివరాలను కచ్చితత్వంతో నమోదు చేస్తారని తెలిపారు. కనీస మద్దతు ధరలు, కేంద్రం నిర్దేశించిన కోటాలను అనుసరించి రాష్ట్రంలో పంట ఉత్పత్తుల కొనుగోళ్లు సాఫీగా జరిగేలా అన్ని చర్యలు చేపట్టాలన్నారు.
ఈ సీజన్‌లో పడిన ఇబ్బందులు పునరావృతం కాకుండా ధాన్యం కొనుగోళ్ల సమయంలో అకాల వర్షాలు, తూకం, రవాణా, నిల్వ, మార్కెటింగ్ వంటి అంశాలపై ముందుగానే కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. సన్న వడ్లు పండించే రైతులకు బోనస్ ఇస్తున్న నేపథ్యంలో 7 రకాల సన్న వడ్ల విత్తనాలను అందుబాటులో ఉంచాలనీ, వీటిని సబ్సిడీపై రైతులకు ఇవ్వాలని చెప్పారు. రైతు వేదికల్లోనే సన్న వడ్ల విత్తనాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సన్న వడ్లు పండించే రైతుల పూర్తి డేటా సేకరించాలని, ధాన్యం దిగుబడిపై వ్యవసాయ శాఖకు సంపూర్ణ అవగాహన ఉండాలని స్పష్టం చేశారు. రైతు వేదికలను ఇకపై రైతులకు ఉపయోగపడే కేంద్రాలుగా తీర్చిదిద్దాలన్నారు. రైతులు అక్కడే తమ వివరాలు నమోదు చేసుకొని విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసేలా అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ప్రతి రైతు వేదిక వద్ద వ్యవసాయ శాఖతో పాటు రెవెన్యూ, పోలీస్ విభాగాల నుంచి ఒక్కో అధికారి అందుబాటులో ఉండాలని సూచించారు. జిల్లాల్లో వీటి నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలను అదనపు కలెక్టర్లకు అప్పగించాలని ఆదేశించారు. వ్యవసాయ శాఖలో సాంకేతికత వినియోగాన్ని మరింత పెంచుకోవాలని చెప్పారు. ఏఐ ఆధారిత విధానాలను సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు. అగ్రికల్చర్ యూనివర్సిటీని నోడల్ ఏజెన్సీగా పెట్టుకొని విత్తనాల నుంచి కొనుగోళ్ల వరకు మొత్తం వ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానం చేయాలన్నారు.
దీనికోసం వ్యవసాయ శాఖ, సివిల్ సప్లయిస్, అగ్రికల్చర్ యూనివర్సిటీ సమన్వయంతో పనిచేయాలన్నారు. భద్రాద్రి కొత్తగూడం జిల్లా దమ్మపేట మండలంలో ప్రారంభించిన ఏఐ పైలట్ ప్రాజెక్ట్ ఫలితాలు అధ్యయనం చేయాలని, రైతులకు ఉపయోగంగా ఉంటే మరింత విస్తృతంగా వినియోగించుకోవాలని చెప్పారు. ఖరీఫ్ సీజన్ కు అవసరమైన యూరియా, ఇతర ఎరువుల కేటాయింపులపై ఎప్పటికప్పుడు కేంద్రానికి లేఖలు రాయాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కు ముఖ్యమంత్రి సూచించారు. రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తి అయ్యే ఎరువులు అత్యధికంగా తెలంగాణకే కేటాయించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. రాష్ట్రంలో ఎరువుల పరిస్థితిపై అన్ని పార్టీల ఎంపీలతో సమావేశం నిర్వహించి, వాస్తవ పరిస్థితిని వివరించాలనీ, అవసరమైతే మంత్రులు, అఖిలపక్ష ఎంపీల బృందం ఢిల్లీ కి వెళ్లి కేంద్రానికి విజ్ఞప్తి చేయాలని తెలిపారు. మార్క్‌ఫెడ్ నష్టాలను తగ్గించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఏడాది వ్యాపారులకు తలొగ్గకుండా ప్రభుత్వం వ్యూహత్మకంగా వ్యవహరించడంతో మొక్క జొన్న కొనుగోళ్లతో వచ్చే నష్టం తగ్గించగలిగామన్నారు. గతంలో రూ. 13 వేలకు టన్ను అమ్మితే, ఈసారి దాదాపు రూ. 21 వేలకు పైగా టెండర్ రేట్ వచ్చిందని చెప్పారు. ఆయిల్‌ఫెడ్‌ను మరింత బలోపేతం చేసి లాభలదిశలో నడిపించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ డైరీని మరింత బలోపేతం చేయాలనీ, సకాలంలో పాల రైతులకు చెల్లింపులు జరపాలని సూచించారు.
యాప్ ద్వారానే అన్ని ఎరువులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



