Thursday, June 25, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్క్యారెట్‌‌తో అదిరే రుచులు

క్యారెట్‌‌తో అదిరే రుచులు

- Advertisement -

చూడగానే నోరూరించేలా ఉంటుంది క్యారెట్‌. పచ్చిదైనా పసందుగా తినేయొచ్చు. కళ్లకు మేలుచేసే క్యారెట్‌తో.. ఇడ్లీ, ఉప్మా, బర్ఫీ, లడ్డూ, దోశ, శాండ్‌విచ్, కుర్మా, కూటు, ఖీర్, సూప్, పుడ్డింగ్, పాయసం, కిచిడీ, పులావ్, కబాబ్, సలాడ్, కోసాంబరీ, స్ప్రింగ్‌ రోల్స్‌- ఇలా ఎన్నెన్నో వెరైటీలు చేయొచ్చు. అలాంటి క్యారెట్‌‌తో చేసే కొన్ని రుచులు ఈరోజు మీ కోసం…

స్మూదీ

కావల్సిన పదార్థాలు: క్యారెట్లు – రెండు, కాచి చల్లార్చిన పాలు – కప్పు, అరటిపండు – ఒకటి, తేనె – రెండు టేబుల్‌ స్పూన్లు, యాలకుల పొడి – చిటికెడు, బాదం, జీడిపప్పులు – మూడు చొప్పున, అల్లం ముద్ద – పావు స్పూన్‌
తయారు చేసే విధానం: బాదంపప్పులను నానబెట్టి పొట్టు తీసి పక్కనుంచాలి. క్యారెట్లను ఉడికించి చల్లారనివ్వాలి. అందులో పాలు, అరటి పండు, తేనె, యాలకుల పొడి, అల్లం ముద్ద, బాదం, జీడిపప్పులు వేసి.. మెత్తగా గ్రైండ్‌ చేయాలి. అంతే.. నోరూరించే క్యారెట్‌ స్మూదీ తయారైపోతుంది. తేనె లేకుంటే పంచదార వేసుకోవచ్చు.

చీజ్‌ బాల్స్‌
కావల్సిన పదార్థాలు: క్యారెట్లు – నాలుగు, చీజ్‌ – కప్పు, ఆలూ – ఒకటి, బ్రెడ్‌ పొడి – అర కప్పు, మొక్కజొన్న పిండి – రెండు టేబుల్‌స్పూన్లు, అల్లం-వెల్లుల్లి పేస్ట్‌ – స్పూన్, పచ్చిమిర్చి – రెండు, ఉప్పు – రుచికి తగినంత, మిరియాల పొడి – అర స్పూన్, గరం మసాలా – పావు స్పూన్, కొత్తిమీర తరుగు – చారెడు, నూనె – వేయించడానికి సరిపడా
తయారు చేసే విధానం: ఆలూను ఉడికించి పొట్టు తీసి మెదపాలి. క్యారెట్లను కడిగి తురమాలి. అందులో మెదిపిన ఆలూ, చీజ్, అల్లం-వెల్లుల్లి పేస్ట్, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉప్పు, మిరియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర తరుగు వేసి కలపాలి. దీనికి బ్రెడ్‌ పొడి, మొక్కజొన్న పిండి జతచేసి మరోసారి కలపాలి. ఈ మిశ్రమంతో చిన్న బాల్స్‌లా చేయాలి. కడాయిలో నూనె వేడి చేసి, మధ్యస్థమైన సెగ మీద బంగారు రంగులోకి మారే వరకూ వేయించాలి. వాటిని టిష్యూ పేపర్‌ మీదికి తీస్తే అదనపు నూనెను పీల్చేసుకుంటుంది. ఇక టొమాటో లేదా చిల్లీ సాస్‌తో వేడిగా వడ్డించండి.

పరోటా
కావల్సిన పదార్థాలు: గోధుమ పిండి – రెండు కప్పులు, క్యారెట్‌ తురుము – కప్పు, ఉప్పు – రుచికి తగినంత, జీలకర్ర – అర స్పూన్, వాము – పావు స్పూన్, పచ్చిమిర్చి – ఒకటి, కొత్తిమీర – గుప్పెడు, నూనె – మూడు టేబుల్‌ స్పూన్లు, నెయ్యి – రెండు స్పూన్లు
తయారు చేసే విధానం: గోధుమపిండిలో క్యారెట్‌ తురుము, ఉప్పు, జీలకర్ర, వాము, పచ్చిమిర్చి, కొత్తిమీర, నెయ్యి వేసి కలపాలి. అందులో కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ మెత్తటి పిండి అయ్యేలా బాగా కలపాలి. దాని మీద మూత పెట్టి పక్కనుంచాలి. అరగంట తర్వాత.. ఎనిమిది సమాన భాగాలు చేసి.. చపాతీకర్రతో రొట్టెలు చేయాలి. అన్నీ అయ్యాక.. కాలుతున్న పెనం మీద కాస్త నూనె వేసి రెండు వైపులా కాల్చుకోవాలి. ఇక వేడి వేడి క్యారెట్‌ పరోటా తింటే రుచి అదిరిపోతుంది.

హల్వా
కావల్సిన పదార్థాలు: క్యారెట్లు – కిలో, చిక్కటి పాలు – లీటర్, పంచదార – కప్పు, నెయ్యి – ఆరు టేబుల్‌ స్పూన్లు, యాలకుల పొడి – అర స్పూన్, జీడిపప్పులు – పావు కప్పు, ఎండుద్రాక్ష – టేబుల్‌ స్పూన్, బాదం, పిస్తా – పది చొప్పున, కోవా – కొద్దిగా
తయారు చేసే విధానం: క్యారెట్లను తురమాలి. కడాయిలో సగం నెయ్యి వేడిచేసి డ్రై ఫ్రూట్స్‌ను వేయించాలి. అవి కాస్త వేగాక.. క్యారెట్‌ తురుము చేర్చాలి. రెండు నిమిషాలు వేయించి.. పాలు జతచేసి సన్న సెగ మీద ఉడికించాలి. మధ్యమధ్యలో కలియతిప్పుతుండాలి. కొంచెం దగ్గరగా అయ్యాక.. పంచదార, యాలకుల పొడి జోడించి కలుపుతుండాలి. చిక్కగా అయ్యేకొద్దీ అడుగంటకుండా కింది నుంచి పైకి కలియబెడుతూనే ఉండాలి. చివర్లో మిగిలిన నెయ్యి, ఖోవా కూడా వేసి.. ఇంకో నిమిషం ఉంచి దించేయాలి. ఇది సహజంగానే చక్కటి రంగుతో ఆకర్షణీయంగా ఉంటుంది కాబట్టి ఫుడ్‌కలర్‌ అవసరం లేదు. మరింత రంగు రావాలంటే డిల్లీ క్యారెట్లు ఉపయోగించవచ్చు.

ఊరగాయ
కావల్సిన పదార్థాలు: క్యారెట్లు – కిలో, ఉప్పు – అర కప్పు, నూనె – పావు లీటర్, ఆవపిండి – వంద గ్రాములు, కారం – ముప్పావు టీ స్పూను, మెంతుల పొడి – టేబుల్‌ స్పూన్, వెల్లుల్లిపాయలు – రెండు, పసుపు – స్పూన్, నిమ్మరసం – రెండు టేబుల్‌ స్పూన్లు
తయారు చేసే విధానం: క్యారెట్లను కడిగి తడి లేకుండా తుడవాలి. పొడవుగా, సన్నగా ముక్కలు కోసి, రెండు మూడు గంటలు నీడలో ఆరబెట్టాలి. వాటిని వెడల్పాటి పాత్రలో వేసి.. ఉప్పు, పసుపు, ఆవపొడి, మెంతుల పొడి, కారం, నిమ్మరసం, పొట్టు తీసిన వెల్లుల్లి చేర్చి బాగా కలపాలి. ఇప్పుడు కొద్దికొద్దిగా నూనె పోస్తూ అంతా కలిసేలా కలియబెట్టాలి. మూత పెట్టేసి.. మర్నాడు పొడి గరిటెతో పచ్చడి కలపాలి. ఇంకో రెండు రోజులు అలా కలిపితే ఘుమఘుమలాడే క్యారెట్‌ ఊరగాయ సిద్ధం. దీన్ని తడి లేని సీసాల్లోకి తీసి.. తేమ లేని చల్లని ప్రదేశంలో ఉంచాలి. తడి స్పూన్‌ ఉపయోగించినా, ఉప్పు తగ్గినా పచ్చడి పాడవుతుంది.

క్యారెట్‌-కొబ్బరి ఫ్రై
కావల్సిన పదార్థాలు: క్యారెట్‌ తురుము – రెండు కప్పులు, తాజా కొబ్బరి తురుము – అర కప్పు, నూనె – రెండు టేబుల్‌ స్పూన్లు, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర – అర స్పూన్‌ చొప్పున, ఎండుమిర్చి – రెండు, కరివేపాకు – రెండు రెబ్బలు, పచ్చిమిర్చి – మూడు, ఉప్పు – రుచికి తగినంత, పసుపు – చిటికెడు, నిమ్మరసం – ముప్పావు స్పూన్‌
తయారు చేసే విధానం: కడాయిలో నూనె వేడయ్యాక.. ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు వేయాలి. ఆవాలు చిటపటలాడుతుండగా.. జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు జతచేయాలి. అవి వేగాక పచ్చిమిర్చి వేసి కాస్త వేయించాలి. అందులో క్యారెట్‌ తురుము, పసుపు, ఉప్పు చేర్చి కలియతిప్పి.. మూత పెట్టాలి. సన్న సెగ మీద ఉడికిస్తూ మధ్యమధ్యలో కలుపుతుండాలి. క్యారెట్‌ మెత్తబడింనుకున్నాక.. కొబ్బరి తురుము జోడించి రెండూ మూడు నిమిషాలు వేయించాలి. సెగ తీసేసి.. నిమ్మరసం చల్లాలి. ఇది వేడివేడి అన్నంలో చాలా రుచిగా ఉంటుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -