ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో, ప్రజల ఓట్లతో ఎన్నికైన నాయకులు రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉండాలి. వారి మాటల్లో మాత్రమే కాదు, ఆచరణలో కూడా ప్రజాస్వామ్య ఔన్నత్యాన్ని కాపాడాలి. కానీ, ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్రంలో ఆక్రమణల నిర్మూలన కోసం ఏర్పాటు చేసిన ‘హైడ్రా’ టాస్క్‌ఫోర్స్ చర్యలను సమర్థిస్తూ, జర్మనీ నియంత అయిన హిట్లర్ తనకు ప్రేరణ అని చెప్పడం తీవ్ర ఆందోళన కలిగించే విషయం. ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న నాయకుడు, కోట్లాది మంది మరణాలకు కారణమైన నియంతను ఆదర్శంగా ప్రస్తావించడం ప్రజాస్వామ్య స్ఫూర్తిని కించపరచడమే కాదు, రాజ్యాంగ విలువల పట్ల ఉన్న నిబద్ధతను కూడా ప్రశ్నార్థకం చేస్తుంది.
అలాగే హైదరాబాద్ నగరంలో అమెరికా కాన్సులేట్ రహదారికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టారు. ప్రపంచ దేశాలను తమ చెప్పుచేతల్లో పెట్టుకోవాలనుకుని, అనేక దేశాల్లో యుద్ధాలకు తెగబడుతున్న యుద్ధ పిపాసి పేరు మన నేలకు పెట్టడం బాధాకరం. ఒక నగరంలోని రోడ్డు పేరు అనేది కేవలం గుర్తింపుకాదు, అది ఒక విలువను, ఒక చరిత్రను, ఒక రాజకీయ దిశను ప్రతిబింబిస్తుంది. సామ్రాజ్య వాదం అనేది విస్తరణ, ఆధి పత్యం, దోపిడీపై ఆధారపడిన వ్యవస్థ. వ్యవస్థలో అభివృద్ధి చెందుతున్న దేశాలు వనరుల సరఫరాదారులుగా మారిపోతాయి, కానీ లాభాలు గ్లోబల్ కార్పొరేట్ కేంద్రాలకు వెళ్లిపోతాయి. ఇది అంతా నియో లిబరల్ విధానా లలో భాగం కూడా. నగరాలను మార్కెట్లుగా మార్చి, వాటిని గ్లోబల్ పెట్టుబడులకు ఆకర్షణీయంగా చూపించడానికి బ్రాండింగ్ చేస్తారు. ఈ బ్రాండింగ్‌లో భాగంగా అంతర్జాతీయ రాజకీయ నాయకుల పేర్లు, కార్పొ రేట్ చిహ్నాలు, గ్లోబల్ సంస్కృతి ప్రవేశపెడతారు. ట్రంప్ వంటి పేర్లు ఈ ప్రక్రియలో ఒక సాధనం. కానీ ఈ ప్రక్రియలో నగరాలు తమ స్వభావాన్ని కోల్పోతాయి. ప్రజల చరిత్ర, సంస్కృతి, స్థానికత వంటి అంశాలన్ని మార్కెటింగ్ సాధనాలుగా మారిపోతాయి.
ప్రపంచంలోని అనేక దేశాలు యుద్ధాల వల్ల నాశనం అయ్యాయి. పశ్చిమ ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా ప్రాంతాల్లో జరిగిన యుద్ధాలు లక్షలాది మంది ప్రాణాల ను బలి తీసుకున్నాయి. కోట్లాది మంది ప్రజలు శరణార్థులయ్యారు. ఈ యుద్ధాలు మానవతా విలువల కోసం కాదు, అవి గ్లోబల్ కాపిటల్ ప్రయోజనాలను కాపాడటానికి నిర్వహించబడినవే. అలాంటి ఒక వ్యవస్థకు ప్రతినిధిగా నిలిచిన వ్యక్తి పేరును మన నగరపు ప్రజా చిహ్నంగా నిలబెట్టడం అంటే ఆ విధానాలను పరోక్షంగా సమర్థిం చడం అవుతుంది. ఇది కేవలం రాజకీయ నిర్ణయం కాదు, ఇది ఒక భావ జాల ప్రకటన. ఇది “మనము ఎవరి వైపు ఉన్నాం?” అనే ప్రశ్నకు సమాధానం ఇస్తుంది.
ప్రజా ప్రదేశాలకు పేర్లు పెట్టడం అనేది ఒక ఐడియాల జికల్ ప్రక్రియ. దాని ద్వారా ఏ విలువలను సమాజం గౌరవిస్తుందో తెలుస్తుంది. హైదరా బాద్ వంటి చారిత్రక నగరంలో ట్రంప్ పేరు పెట్టడం ద్వారా అమెరికా సామ్రాజ్య వాదాన్ని సహజంగా అంగీకరించదగినదిగా చూపించే ప్రయత్నం జరుగుతుంది. ఇది స్థానిక చరిత్రను, స్థానిక పోరాటాలను అణచి వేయ డానికి దారి తీస్తుంది. స్థానిక వీరులు, ప్రజా నాయకులు, సామాజిక సంస్క ర్తల స్థానాన్ని గ్లోబల్ కార్పొరేట్ రాజకీయాల ప్రతినిధులు ఆక్రమిస్తారు. ఇది కేవలం సాంస్కృతిక మార్పు కాదు, ఇది ఆర్థిక – రాజకీయ పునర్వ్యవ స్థీకరణ. నగరాలు పెట్టుబడులకు అనుకూలంగా మారుతున్నప్పుడు, సాధారణ ప్రజలు బయటకు నెట్టబడతారు. గృహాలు ఖరీదవు తాయి, జీవన వ్యయం పెరుగుతుంది, అసంఘటిత కార్మిక వర్గం మరింత అస్థిరతలోకి నెట్టబడు తుంది. ఇది “అభి వృద్ధి” పేరుతో జరుగుతున్న ప్రహసనం. ఈ నేపథ్యంలో ట్రంప్ పేరు పెట్టడం అనేది కేవలం ఒక రోడ్డుకు పేరు పెట్టడం కాదు, ఇది ఒక వర్గ రాజకీయ ప్రకటన. ఇది స్థానిక పాలక వర్గాలు గ్లోబల్ పెట్టుబడిదారీ వ్యవస్థతో తమ అను బంధాన్ని ప్రకటించడం. ఇది ప్రజల తరఫున కాదు,ఇది పెట్టుబడిదారుల తరఫున తీసుకున్న నిర్ణయం!
తెలంగాణది వీరోచిత సాయుధ పోరాటాల చరిత్ర. రైతాంగం భూస్వా మ్య దోపిడీకి వ్యతిరేకంగా ఆయుధాలు ఎత్తి పోరాడిన నేల. ఇక్కడి ప్రతి రహదారి, ప్రతి ఊరు, ప్రతి కథ ఆ పోరాటాల జ్ఞాపకాలతో నిండి ఉంటాయి. అలాంటి నేలపై యుద్ధ రాజకీయాలను ప్రోత్సహించిన నాయ కుడి పేరును పెట్టడం, ఆ చరిత్రను అవమానిం చడం తప్ప మరొకటి కాదు. ఇది చరిత్రను మార్చి ఒక కొత్త భావజాలాన్ని రుద్దే ప్రయత్నం. ఈ నేల యుద్ధ పిపాసుల పేర్లను అంగీకరించదు, ఇది పోరాట స్ఫూర్తిని మాత్రమే గౌరవిస్తుంది. ఈ నేలపై పేర్లు పెట్టబడాల్సింది ప్రజల కోసం పోరాడినవారి పేర్లు, దోపిడీకి వ్యతిరేకంగా నిలిచినవారి పేర్లు, సమానత్వం కోసం ప్రాణ త్యాగం చేసినవారి పేర్లు. కాబట్టి దీన్ని వ్యతిరేకించడం అనేది కేవలం ఒక పేరును తిరస్కరించడం కాదు, ఇది ఒక భావజాలానికి వ్యతిరేకంగా నిలబడటం, మన చరిత్రను సంరక్షించడం. హైదరాబాద్ రోడ్లు ప్రజల రక్తం, చెమటతో నిర్మించ బడ్డాయి. అవి కార్పొరేట్ రాజకీయాల చిహ్నాలకు కాదు, ప్రజా పోరాటాల స్ఫూర్తికి గుర్తింపుగా నిలవాలి. ఈ రోడ్లపై నడిచే ప్రతి మనిషి, ఈ నగరంలో నివసించే ప్రతి పౌరుడు, ఈ చరిత్రకు వారసుడు. ఆ వారసత్వాన్ని కాపాడుకోవడం మన అందరి బాధ్యత.
– విజయ్ పుట్టపాగ, 8008028237
ఫాసిస్టులు స్ఫూర్తి ప్రదాతలా?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



