అంబానీ,అదానీలకే మోడీ నజరానాలు

Ambani and Adani Modi Nazaranas– చేనేతపై జీఎస్టీ
– స్కీములు ఎత్తేసిన మొదటి ప్రధాని మోడీయే..
– గోదావరి నీళ్లు ఎత్తుకుపోయేందుకు కుట్ర
– మేము ఆర్డర్లు ఇచ్చినన్నాళ్లూ చేనేతలకు పని
– కాంగ్రెస్‌ బకాయిలు ఇవ్వదు..పనీ కల్పించదు
– సిరిసిల్లలో రోడ్‌షో, కార్నర్‌ మీటింగ్‌లో మాజీ సీఎం కేసీఆర్‌
– సిద్దిపేట సభతో బస్సు యాత్ర ముగింపు
నవతెలంగాణ – కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి / సిరిసిల్ల టౌన్‌/ సిద్దిపేట
‘బీజేపీ ఎజెండాలో పేదలు లేరు.. పెద్దపెద్ద గద్దలే ఉన్నాయి. పదేండ్ల పాలనలో పేదల కోసం ఏ ఒక్క పనీ చేయని మోడీ అంబానీ, అదానీల కోసమే పని చేశారు.. చేనేతలపై జీఎస్టీ వేసి, వారి సంక్షేమా న్ని, స్కీములను ఎత్తేసిన మొట్టమొదటి ప్రధాని నరేంద్ర మోడీయే. ఇక్కడి గోదావరి నీళ్లు ఎత్తుకుపోయే కుట్రకు తెరలేపిండు. ఇప్పటికే గోదావరి జలాలు లేక పక్కనే ఉన్న సజీవ జలధార మానేరు ఎండిపోయింది. మరోవైపు అడ్డగోలు హామీలిచ్చి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ఫ్రీ బస్సు తప్ప ఏమీ అమలు చేయలేదు. చేనేతలకు పని కల్పించడం లేదు’ అని మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అన్నారు. బీఆర్‌ఎస్‌ కరీంనగర్‌ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన రోడ్‌షో, కార్నర్‌ మీటింగ్‌లో కేసీఆర్‌ ప్రసంగించారు. అనంతరం సిద్దిపేటలో జరిగిన సభతో కేసీఆర్‌ బస్సు యాత్ర ముగిసింది.
లోక్‌సభ ఎన్నికల్లో మూడు పార్టీలు రంగంలో ఉన్నాయని, ఏ పార్టీ ఏం చేసిందో తమందరికీ బాగా తెలుసునని అన్నారు. దేశం, ధర్మం అంటూ మాట్లాడే ప్రధాని మోడీ, హిందూ హిందూ అని మాట్లాడే బండి సంజరు మొన్న వేములవాడకు వచ్చి రూపాయి కూడా రాజన్నకు ఇవ్వలేదని విమర్శించారు. కనీసం వేములవాడ దేవస్థానాన్ని బాగు చేస్తామని కూడా చెప్పలేదన్నారు. ‘బండి సంజరు రూపాయి అడగలేదు.. మోడీ ఇవ్వలేదు’ అని ఎద్దేవా చేశారు. బీజేపీ ఎజెండాలో కార్మికులు, పేదలు, ఆటోరిక్షావాళ్లు.. ఇలా ఎవరూ ఉండరని, ఉండేదల్లా అంబానీ, అదానీ లాంటి పెద్దపెద్ద గద్దలే అని విమర్శించారు. అలాంటి లక్షల కోట్ల శ్రీమంతులకు కార్పొరేట్‌ ట్యాక్స్‌లు రద్దు చేస్తరు కానీ పేదల కోసం ఏమీ చేయరని అన్నారు. విదేశాల్లో నల్లధనం తీసుకొచ్చి ప్రతి పేదోడి ఖాతాలో రూ.15లక్షలు జమ చేస్తామని చెప్పి మోసం చేసిన మోడీని మళ్లీ ఎలా నమ్మేదని ప్రశ్నించారు.
చేనేతలను ఉపాధికి దూరం చేసిన కాంగ్రెస్‌
తాము అధికారంలో ఉన్నన్ని రోజులు బతుకమ్మ చీరలు, స్కూల్‌డ్రెస్సులు, క్రిస్మస్‌, రంజాన్‌ కానుకలను సిరిసిల్ల చేనేతలకు ఆర్డర్లు ఇచ్చి ప్రతి కార్మికునికీ నెలకు రూ.10వేల నుంచి రూ.15వేల ఉపాధి కల్పించామని కేసీఆర్‌ చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆర్డర్లు కాదుకదా.. పాత బకాయిలూ చెల్లించకుండా చేనేతలకు ఉపాధిని దూరం చేసిందని వివరించారు. ఇదే విషయమై ప్రభుత్వాన్ని నిలదీస్తే ‘నిరోధ్‌లు, పాపడలు’ అమ్ముకోండని కాంగ్రెస్‌ నేతలు అంటే కోపం వచ్చి తాను ఒక మాట అన్నానని తనపై 48 గంటల నిషేధం పెట్టారని గుర్తు చేశారు. సిరిసిల్లకు ఒక టెక్స్‌టైల్‌ పార్కు కావాలంటే ప్రధాని మోడీ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ఎంపీగా ఉన్న సంజరు ఇక్కడి ప్రజలకు ఏం చేయాలో సోయి లేదని విమర్శించారు. బండి సంజరుకి, వినోద్‌కుమార్‌కి ఏమైనా పోలిక ఉందా.. బండి సంజరు మాట్లాడేది ఏ భాషో కూడా అర్థం కాదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌, బీజేపీకి ఓటు ద్వారా బుద్ధి చెప్పి.. కమ్యూనిస్టు ఉద్యమ నేత, పార్లమెంట్‌లో గళం విప్పే వినోద్‌కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించి తెలంగాణ పౌరుషాన్ని చూపాలని పిలుపునిచ్చారు. గోదావరి జలాలను కాపాడుకోవాలన్నా.. మన నేత కార్మికుల బతుకులు బాగుపడాలన్నా పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని కోరారు. ఈ రోడ్‌షోలో స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్‌, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య సహా పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు.

Spread the love