జయంతి ఉత్సవాలలో ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ
నవతెలంగాణ – అచ్చంపేట
నల్లమల్ల ప్రాంతం అచ్చంపేట నియోజకవర్గంలో మంగళవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 139వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. గిరిజన తండాలలో..ఏజెన్సీ పల్లెలలో… కుల సంఘాలు ప్రజా సంఘాలు అంబేద్కర్ యువజన సంఘాలు, దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహాలకు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. లింగాల మండలం కొత్తకుంటపల్లిలో జయంతిని పురస్కరించుకొని అంబేద్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆవిష్కరించారు. ప్రజలతో కలిసి భోజనం చేశారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేశారు. పట్టణం లో ప్రెస్ క్లబ్ , బాబు జగ్జీవన్ రావ్ భవనంలో ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి నిర్వహించారు.
పట్టణంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాల సభలో ఎమ్మెల్యే వంశీకృష్ణ పాల్గొని మాట్లాడారు. భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఎందరో జీవితాలలో వెలుగు నింపాడని అంబేద్కర్ పేద వర్గాల ప్రజల కోసం తన జీవితాన్ని త్యాగం చేశారని గుర్తు చేశారు. బాబా సాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అమలు చేయడానికి యువత కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు, కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.



